కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు సీఎం రేవంత్ రెడ్డి వినతి
ఢిల్లీ: తెలంగాణకు కేంద్రియ విద్యాలయాలు కేటాయించాలని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రితో గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ఇటీవల రాష్ట్రానికి ఏడు నవోదయ విద్యాలయాలు కేటాయించినందుకు కేంద్ర మంత్రికి సీఎం కృతజ్ఞతలు తెలిపారు. అదే సమయంలో రాష్ట్రానికి ఒక్క కేంద్రియ విద్యాలయం కూడా కేటాయించలేదని, కేంద్రియ విద్యాలయాలతో పాటు నవోదయ పాఠశాలలు లేని జిల్లాలకు వాటిని కేటాయించాలని కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి కోరారు.
డీమ్డ్ యూనివర్సిటీల ప్రకటనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తప్పనిసరి అని, కానీ ఇటీవల కేంద్ర ప్రభుత్వ అనుమతితోనే డీమ్డ్ యూనివర్సిటీలను గుర్తిస్తోందని సీఎం కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. డీమ్డ్ యూనివర్సిటీ గుర్తింపునకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఓసీ తీసుకునేలా చూడాలని కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి కోరారు.