ఏపీ నూతన సీఎం చంద్రబాబుకు సీఎం రేవంత్ రెడ్డి ఫోన్
తెలుగు రాష్ట్రాల్లో అపరిష్క్రృతంగా ఉన్న సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుంటూ.. ఇరు రాష్ట్రాల అభివృద్ధి విషయంలో కలిసి నడుద్దామని ఏపీ నూతన సీఎంగా బాధ్యతలు చేపట్టబోతున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. గురువారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గంపై మంత్రి సీతక్క, ఎంపీ బలరాంనాయక్ తో కలిసి సమీక్ష నిర్వహించిన ఆయన తర్వాత చంద్రబాబుకు ఫోన్ చేసి మాట్లాడారు.
ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడుకి అభినందనలు తెలిపిన రేవంత్ రెడ్డి, రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని ఆకాంక్షించారు. విభజన చట్టానికి సంబంధించిన పెండింగ్ అంశాలను సహృద్భావ వాతావరణంలో పరిష్కరించుకునేందుకు సహకరించాలని చంద్రబాబు నాయుడును సీఎం రేవంత్ కోరారు. విభజన చట్టం మేరకు మిగతా ఆస్తి, నీటి పంపకాల గురించి ఏపీతో చర్చించి పరిష్కరించుకుందామన్నారు.