- బిజెపి అంటే భారతీయ ఝూటా మాటల పార్టీ
- స్వాతంత్య్రానికి వ్యతిరేకంగా మాట్లాడే వారిపై చర్యలు తీసుకోవాలి…
- మోహన్ భాగవత్ పై మోదీ చర్యలు తీసుకుంటారా?
- దేశ ప్రజల ప్రయోజనాలకు వేదిక ఏఐసీసీ కొత్త కార్యాలయం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
బీఆర్ఎస్ అనేది బీ ఆర్ఎస్ఎస్ అని, ఆ పార్టీ ఆర్ఎస్ఎస్ ఐడియాలజీతో వెళ్లేందుకు ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బీజేపీ చేసే ఆరోపణలనే తెలంగాణలో బీఆర్ఎస్ చేస్తోందని ఆయన విమర్శించారు. దిల్లీలో ఏఐసీసీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవంలో బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..
రాహుల్ గాంధీ చెప్పినట్లు ఆర్ఎస్ఎస్‌తో తమది సిద్ధాంతపరమైన వైరుధ్యమన్నారు. (ఐడియాలాజికల్ డిఫరెన్సెస్) స్వాతంత్య్రం కోసం ఆర్ఎస్ఎస్ ఏ పోరాటం చేయలేదని, వారెవరూ ఎటువంటి త్యాగాలు చేయలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. స్వాతంత్య్రం గురించి ప్రశంసించేందుకు వారు సిద్ధంగా లేరని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ల వాస్తవ సిద్ధాంతమే అదని, మోహన్ భాగవత్ (ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్) అదే చెప్పారని, స్వాతంత్య్ర పోరాటంతో వాళ్లకు ఎలాంటి సంబంధం లేదన్నారు.
కాంగ్రెస్ పార్టీ, నేతలు త్యాగాలు చేసి స్వాతంత్య్రం తీసుకొచ్చారని, దేశాన్ని ముందుకు నడిపించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని రాహుల్ గాంధీ చెప్పారని సీఎం వివరించారు. స్వాతంత్య్రానికి విరుద్ధంగా ఎవరైనా మాట్లాడితే వారిపై చట్టపరమైన విచారణ చేయాలని, ఆ క్రమంలోనే మోహన్ భాగవత్‌కు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బీజేపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేయడంలో దిట్టలని, అందుకే తాము భారతీయ ఝూటా (అబద్ధాలు) పార్టీ అంటున్నామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బీజేపీ చెబుతున్న విషయాలపై ఎక్కువ దృష్టి పెట్టాల్సిన పని లేదని సీఎం అభిప్రాయపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మోహన్ భాగవత్‌తో ఉన్నారా లేక దేశ స్వాతంత్య్రం కోసం అమరులైన లక్షలాది వెంట ఉన్నారా అనేది స్పష్టం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. బీజేపీ నేతలు కాంగ్రెస్‌పై ఆరోపణలు చేస్తూ స్వాతంత్య్రం విషయంలో మోహన్ భాగవత్ మాట్లాడిన అంశాన్ని తక్కువ చేసే ప్రయత్నం చేస్తున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మోహన్ భాగవత్‌పై చర్యలు తీసుకుంటారా లేదా దేశ ప్రజలకు స్పష్టం చేయాలని సీఎం డిమాండ్ చేశారు.
శాంతిభద్రతల పరిరక్షణపై రాజీ లేదు..
బీఆర్ఎస్ నుంచి తాము నేర్చుకోవాల్సింది ఏం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో చట్టం తన పద్ధతిలో నడిచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని స్పష్టం చేశారు. ఎక్కడైనా, ఎవరిపైనైనా దాడులు జరిగితే పోలీసులు చర్యలు చేపడతారని, శాంతి భద్రతల సమస్య తలెత్తితే పోలీసులు జోక్యం చేసుకుని క్రిమినల్ కేసులు నమోదు చేశారని సీఎం స్పష్టం చేశారు. గత ప్రభుత్వం హయంలో పోలీసులతో కలిసి బీఆర్ఎస్ వాళ్లు కాంగ్రెస్ కార్యాలయాలపై దాడులు చేశారని, తాము అలా చేయడం లేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఎక్కడైనా తప్పు జరిగితే దానిని సరిదిద్దేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సీఎం అన్నారు.
దేశ ప్రజల ప్రయోజనాలకు వేదిక…
ఏఐసీసీ నూతన కార్యాలయం దేశ ప్రజల ప్రయోజనాలకు వేదిక కాబోతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. దిల్లీలో ఏఐసీసీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. దేశ ప్రగతి కోసం ప్రణాళికలు సిద్ధం చేసే కార్యాలయాన్ని కాంగ్రెస్ నిర్మించుకుందన్నారు. ఈ కార్యాలయం నుంచే దేశాన్ని బలమైన, శక్తిమంతమైన దేశంగా మార్చడానికి ప్రణాళికలు రచిస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ద్వారా దేశానికి రాజ్యాంగాన్ని అందించిందన్నారు. ఆ రాజ్యాంగ స్ఫూర్తితో పేద ప్రజలు.. ముఖ్యంగా ఆదివాసీలు, దళితులు, బలహీన వర్గాలు, మైనారిటీల సంక్షేమానికి, అభివృద్ధికి పాటుపడుతోందని సీఎం తెలిపారు.
140 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంవత్సరాల తర్వాత సొంత కార్యాలయాన్ని నిర్మించుకుందన్నారు. ఇన్ని సంవత్సరాలు దేశాన్ని నడిపించిన కాంగ్రెస్ పార్టీ ఎంత నిస్వార్థంగా ఇన్ని రోజులు ప్రజలకు సేవలు అందించిందనేందుకు ఇదే నిదర్శనమన్నారు. 140 ఏళ్లు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆర్థిక స్థితిగతులను, 40 ఏళ్ల భారతీయ జనతా పార్టీ, ఇతర ప్రాంతీయ పార్టీల ఆర్థిక స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో దేశ ప్రజలందరికీ తెలుసని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ నూతన కార్యాలయం నుంచే దేశాన్ని ఇరవై ఒకటో శతాబ్దంలో ఏవిధంగా ముందుకు తీసుకెళ్లాలో ప్రణాళికలు రూపొందుతాయని సీఎం తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయం ప్రారంభించుకున్న రోజు దేశ ప్రజలకు పండగ రోజని, దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన పార్టీ ఒక అద్భుతమైన కార్యాలయాన్ని నిర్మించుకొని ప్రారంభించుకున్న రోజని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.