కేటీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి బీఆరెస్ నేతలపై ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ నేతలకు అధికారం పోయినా బలుపు తగ్గలేదని ఘాటుగా స్పందించారు. తెలంగాణ సచివాలయం ముందు కేటీఆర్ వాళ్ల అయ్య విగ్రహం పెట్టుకుందామనుకుంటున్నారని రేవంత్ మండిపడ్డారు. సెక్రెటరియేట్ ముందు ఉండాల్సింది ఉద్యమం ముసుగులో తెలంగాణను దోచుకున్న వాళ్ల విగ్రహం కాదని హితువు పలికారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామని మాట్లాడుతున్నారని, చేతనైతే ఎవడైనా విగ్రహంపై చేయి వేయండని హెచ్చరించారు రేవంత్ రెడ్డి.
నీ అయ్య విగ్రహం కోసం రాజీవ్ విగ్రహాన్ని తొలగించాలని అంటావా అని కేటీఆర్ ను ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. అధికారంలోకి వస్తే అని కేటీఆర్ మాట్లాడుతున్నాడని.. ఇక మీకు అధికారం కలనే.. ఇక మీరు చినతమడకకే పరిమితమని ఎద్దేవా చేశారు. పదేళ్లు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టని వాళ్లు ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు రేవంత్ రెడ్డి. డిసెంబర్ 9న సచివాలయం లోపల తెలంగాణ విగ్రహం ఏర్పాటు చేసే బాధ్యత తమ ప్రభుత్వానిదని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి.
తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో తమ చిత్తశుద్ధిని ఏ సన్నాసి శంకించనవసరం లేదని రేవంత్ అన్నారు. విచక్షణ కోల్పోయి అర్థం పర్ధం లేని మాటలు మాట్లాడితే తెలంగాణ సమాజం మిమ్మల్ని సామాజిక బహిష్కరణ చేస్తుందని హెచ్చరించారు. తెలంగాణ సచివాలయం ముందు దొంగలకు, తాగుబోతులకు స్థానం లేదని తేల్చి చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి.