రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లారు. సోమవారం రాత్రి బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో హస్తినకు బయలుదేరి వెళ్లారు. తాజా రాజకీయాలు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి ఆయన అధిష్టానానికి వివరించనున్నట్లుగా తెలుస్తోంది. నామినేటెడ్ పదవులపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆయన పలువురు పార్టీ పెద్దలతో సమావేశం కానున్నట్టుగా తెలిసింది.
మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీపై ఆయన అధిష్టానంతో చర్చించనున్నారు. పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌తో భేటీ అయి టిపిసిసి కార్యవర్గంపై కూడా చర్చించనున్నట్టుగా తెలిసింది. మంత్రివర్గ విస్తరణలో ఈసారి ఎవరికి అవకాశం దక్కుతుందో అని నేతల్లో ఉత్కంఠ నెలకొంది. దసరాలోపు మంత్రి వర్గాన్ని చేపట్టాలని సిఎం రేవంత్ రెడ్డి భావిస్తుండగా దానికి సంబంధించి అధిష్టానంతో చర్చించనున్నట్టుగా సమాచారం. సెప్టెంబర్ 29వ తేదీన జమ్మూకశ్మీర్ కథువా సభలో అస్వస్థతకు గురైన ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను సైతం సిఎం రేవంత్‌రెడ్డి పరామర్శించనున్నారు.