- బూతులు తిట్టించారు.. అవమానించారు..
- నేను కక్ష సాధించాలనుకుంటే మీరు.. జైలులో ఉండేవారు..
- అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి భావోద్వేగం
అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. గతంలో తాను ఎదుర్కొన్న కష్టాలను గుర్తుచేస్తూ, తాను ఎవరిపై కక్షసాధింపు చర్యలు చేపట్టలేదని స్పష్టం చేశారు. తనపై జరిగిన అన్యాయాన్ని తానొకవేళ ప్రతీకారంగా తీసుకుని ఉండుంటే, పరిస్థితి పూర్తిగా వేరేలా ఉండేదని తెలిపారు. “మేం నిజంగా కక్ష సాధించాలనుకున్నా, వాళ్లు ఇలానే స్వేచ్ఛగా తిరగలేకపోయేవారు” అని వ్యాఖ్యానించారు.
మేం నిజంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే… వాళ్లు అక్కడ కూర్చుని నోటికొచ్చినట్లు మాట్లాడేవారు కాదు. చంచలగూడ జైలులోనో, చర్లపల్లి జైలులోనో మమ్మల్ని పెట్టినచోటే ఉండేవారు. అని వ్యాఖ్యానించారు. డ్రోన్ ఎగరేస్తే రూ. 500 ఫైన్ వేస్తారు.
కానీ అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎంపీగా ఉన్న నన్ను చర్లపల్లి జైలులో పెట్టారు. 16 రోజులు నన్ను డిటెన్షన్ సెల్ లో ఒక మనిషి కూడా కనిపించకుండా మమ్మల్ని నిర్బంధించిన ఆ కోపాన్ని బిగపట్టుకున్నాం తప్ప కక్ష సాధింపునకు పాల్పడలేదు. లైట్లు ఆన్ లోనే పెట్టి ఒక్క రాత్రి కూడా పడుకోకుండా జైలులో గడిపేలా చేశారు. కరుడు గట్టిన నేరస్తున్ని బంధించినట్లు ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న నన్ను బంధించారు. వాళ్ల తప్పులను దేవుడు చూస్తాడు..అంతకు అంతా అనుభవిస్తారు అనుకుని ఊరుకున్నా.. నా మీద కక్ష చూపిన వారిని దేవుడే దవాఖానల పాలు చేశాడు.
చర్లపల్లి జైలు నుంచి నా బిడ్డ లఘ్న పత్రిక రాసుకోవడానికి వెళ్లకుండా అడ్డుకున్నారు. రాజకీయ కక్ష సాధింపులంటే మీవి కదా. అయినా నేను కక్షసాధింపు చర్యలకు పాల్పడలేదు. నిజంగానే నేను కక్ష సాధించాలనుకుంటే మీ కుటుంబమంతా చర్లపల్లి జైలులో ఉండేవారు కానీ ఆ పని నేను చేయలేదు.. మేం విజ్ఞత ప్రదర్శించాం.. ప్రజలు అధికారమిచ్చింది కక్ష తీర్చుకోవడానికి కాదని నేను విజ్ఞత ప్రదర్శించా.. సొంత పార్టీ ఆఫీసులో బూతులు తీయించి రికార్డు చేయించినా… చెంపలు వాయించే శక్తి ఉన్నా నేను సంయమనం పాటించా ఎవరివి కక్ష సాధింపు చర్యలో తెలంగాణ సమాజం ఇదంతా గమనిస్తోంది అని సీఎ రేవంత్ రెడ్డి అన్నారు.