బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. అదానీ వ్యవహారంపై గురువారం హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయం వద్ద సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ధర్నా చేపట్టింది. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్.. బీజేపీ, బీఆర్ఎస్ లపై తీవ్ర విమర్శలు చేశారు. మోదీపై కొట్లాడుతామన్న సన్నాసులు ఏమయ్యారని సీఎం రేవంత్ మండిపడ్డారు. సెబీపై కేసీఆర్ వైఖరేంటో చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రతి చిల్లర విషయాలపై మాట్లాడే ట్విట్టర్ టిల్లు కేటీఆర్.. సెబీ అక్రమాలపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. రాజీవ్ గాంధీ విమానాశ్రయం పేరును మారుస్తామని.. విగ్రహాన్ని తొలగిస్తామని మాట్లాడుతున్న కేటీఆర్ కు పదేళ్ల తర్వాత తెలంగాణ తల్లి గుర్తుకు వచ్చిందా?.. రాజీవ్ గాంధీ విగ్రహంపై చెయి వేస్తే.. వీపు చింతపండు చేస్తాం అని వార్నింగ్ ఇచ్చారు. బీజేపీని సంతోషపెట్టేందుకే ఎయిర్ పోర్టుకు రాజీవ్ పేరు తీస్తామంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోనియాగాంధీ జన్మదినం రోజు సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం పెడతామని సీఎం స్పష్టం చేశారు.
దేశాన్ని లూటీ చేస్తున్నారు
ప్రధానమంత్రి మోడీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫైరయ్యారు. “దేశాన్ని మోడీ అప్పుల ఊబిలో ముంచారు.. మోదీ ప్రధాని అయ్యే నాటికి దేశం అప్పు రూ.55 లక్షల కోట్లు.. ప్రస్తుతం దేశం అప్పు రూ.కోటి 55 లక్షల కోట్లు దాటింది” అని మండిపడ్డారు. “మోడీ, అమిత్ షా లు దేశాన్ని లూటీ చేస్తున్నారు. ఇద్దరికి దోచి పెడుతున్నారు. మోడీ తన పరివారాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దేశ సంపదను దోచుకున్నవారిని జైలుకు పంపే వరకు పోరాడతాం. దేశ సంపదను ఎలా దోచుకుంటున్నారో హిండెన్ బర్గ్ బయటపెట్టింది. దానిపై పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కేంద్రాన్ని ప్రశ్నించింది. జేపీసీ వేయాలని పార్లమెంట్ లో డిమాండ్ చేస్తే.. మోడీ తప్పించుకున్నారు. నాలుగు రోజుల ముందుగానే పార్లమెంట్ ను వాయిదా వేశారు. మోడీ.. దేశాన్ని అప్పుల పాలు చేశారు.. ఇందిరాగాంధీ బ్యాంకులను సామాన్యలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. పేద భూములు పంచిన ఘనత ఆమెది. రాజీవ్ గాంధీ దేశానికి కంప్యూటర్లను పరిచయం చేశారు. దేశానికి బీజేపీ ముప్పుగా మారింది” అని విమర్శించారు.