Thursday, May 8, 2025

త్వరలో ఉద్యోగ సంఘాల నాయకులతో సిఎం భేటీ..?

  • వచ్చేనెలలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలు..!
  • ప్రభుత్వంపై భారం పడకుండా ఆర్థిక పరమైన అంశాల సమస్యలు
  • మూడు, నాలుగు నెలలు తరువాత పరిష్కారం
  • మిగతా సమస్యలకు త్వరలోనే మోక్షం…

వచ్చేనెలలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సాధారణ బదిలీలు జరుగనున్నాయి. దీనికి సంబంధించి ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాల నాయకులు చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ సమస్యలతో పాటు పిఆర్‌సి, డిఏలు, సాధారణ బదిలీలు, హెల్త్‌కార్డులకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ సభ్యులు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి. చిన్నారెడ్డి, టిజెఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం, ప్రజావాణి స్టేట్ నోడల్ ఆఫీసర్ దివ్యలు సమావేశమై చర్చించారు. ఇప్పటికే త్రిసభ్య కమిటీ సభ్యులతో ఉద్యోగ సంఘాల నాయకులు భేటీ కాగా, సుమారుగా 21 అంశాలకు సంబంధించి సమస్యలపై నాయకులు త్రిసభ్య కమిటీ సభ్యులకు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలోనే త్రిసభ్య కమిటీ సభ్యులు మరోమారు ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశమై వారితో చర్చించిన తరువాత ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్టుగా తెలిసింది.

పిఆర్‌సి, హెల్త్‌కార్డులతో పాటు మిగతా అంశాలు…
అయితే ఉద్యోగ సంఘాల నాయకులతో సిఎం రేవంత్ త్వరలోనే భేటీ కానున్నట్టుగా తెలిసింది. అందులో భాగంగా ఉద్యోగుల సమస్యలకు సంబంధించి పిఆర్‌సి, హెల్త్‌కార్డులతో పాటు మిగతా అంశాల గురించి చర్చించే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. అయితే మూడు, నాలుగు నెలల వరకు ప్రభుత్వంపై భారం పడే అంశాలను కాకుండా మిగతా పెండింగ్ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. ఇప్పటికే సమస్యల పరిష్కారం కోసం సుమారు 40 ఉద్యోగ సంఘాలు జేఏసిగా ఏర్పడ్డాయి. ఉద్యోగ ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాలను ఇందులో భాగస్వాములను చేసి తమ సమస్యల పరిష్కారానికి నడుంబిగించాయి.

ఉద్యోగుల్లో ఉత్సాహాం నింపాలని….
ప్రస్తుతం 21 అంశాలను వెంటనే పరిష్కరించాలని ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రభుత్వం ఏర్పడి ఆరునెలలైనా సమస్యలు పరిష్కారం కాకపోవడం వల్ల ఉద్యోగులు నిరుత్సాహాం చెందుతున్నారని, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే ఉద్యోగుల్లో ఉత్సాహాం నింపాలని ఆ దిశగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ఉద్యోగ సంఘాల నాయకులు కోరుతున్నారు.

ఉద్యోగుల డిమాండ్ ఇలా….
సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్నిఅమలుచేయాలి. ఉద్యోగుల చందాతో ఆరోగ్యపథకాన్ని అమలు చేయాలి. పెండింగ్ డిఏలను వెంటనే విడుదలచేయాలి. ఉద్యోగలకు పదోన్నతులు చేపట్టాలి. రాష్ట్రంలో ఉద్యోగ బదిలీలను వెంటనే చేపట్టాలి, అసెంబ్లీ, పార్లమెంట్
ఎన్నికల్లో భాగంగా ఉద్యోగులను ప్రభుత్వం బదిలీ చేయగా వారిని వెంటనే వారి స్థానాలకు తీసుకురావాలి. గచ్చిబౌలి టిఎన్జీఓ రెండోఫేజ్‌లో 101.02 ఎకరాల స్థలంపై సొసైటీకి యజమాన్య హక్కులు కల్పించాలి. భాగ్యనగర్ టిఎన్జీఓ హౌసింగ్ సొసైటీ రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం సర్వేనెంబర్ 36, 37, గోపనపల్లికి సంబంధించి ప్రభుత్వం మెమో 1088/Assn.II L2/2014ను వెంటనే రద్దు చేయాలి. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్‌ల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి. ఉద్యోగ, పెన్షనర్లకు ఆదాయ పన్ను పరిమితిని పెంచేటట్లు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. సచివాలయంలో హెచ్‌ఓడిల నుంచి 12.5 శాతం కోటాను అమలు చేయాలి. 317 జీఓలోని లోపాలను సవరించి ఉద్యోగులకు పాత సీనియారిటీని కొనసాగించాలి. మెరుగైన ఫిట్‌మెంట్‌తో పిఆర్సీని వెంటనేఅమలుచేయాలి.

నూతన జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కేడర్ స్టెంత్‌ను పాతజిల్లాలో ఉన్న విధంగా అదనంగా కేటాయించాలి. రంగారెడ్డి కలెక్టరేట్ ఉద్యోగులకు గతంలో ఇచ్చిన విధంగా 24 శాతం ఇంటి అద్దెను మంజూరుచేయాలి. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాష్ట్రస్థాయిలో జాయింట్ కౌన్సిల్ సమావేశాలను నిర్వహించాలి. పాత పిఆర్సీలోని పెండింగ్ బిల్లులను పాస్ చేసుకోవడానికి గడువును 31-.03. -2026 వరకు పొడిగించడంతో పాటు ట్రెజరీశాఖకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలి. మెడికల్ రీయింబర్స్‌మెంట్ అనుమతిని 31-.03-.2024 నుంచి 31-.03-.2026 వరకు పొడిగించాలి. రాష్ట్రంలోమెడికల్ ఇన్వాల్విడేషన్ కమిటీలను ఏర్పాటుచేసి కారుణ్య నియామకాలను చేపట్టాలి. రిటైర్డ్ ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోకుండా రీఅపాయింట్‌మెంట్ ఎక్స్‌టెన్షన్ ఆఫ్ సర్వీస్‌ను నిలిపివేయాలి. ఉద్యోగుల మీద కక్ష సాధింపు చేస్తూ అక్రమ ఆస్తుల పేరిట కేసులు నమోదు చేయకుండా చూడాలి. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com