డిప్యూటీ సీఎం పదవి కూడా… అక్బరుద్దీన్‌కు సీఎం ఆఫర్
అసెంబ్లీలో బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీకి బంపర్ ఆఫర్ ఇచ్చారు. డిప్యూటీ సీఎం పదవితోపాటు.. ఏకంగా తన పక్కనే కూర్చొబెట్టు కుంటానంటూ పేర్కొన్నారు. శనివారం అసెంబ్లీలో విపక్షాల విమర్శలు.. ప్రభుత్వం కౌంటర్.. ఇలా వాడీవేడిగా బడ్జెట్ పై వాదోపవాదాలు కొనసాగాయి. ఈ చర్చ సందర్భంగానే ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీకి బంపర్ ఆఫర్ ఇచ్చారు.. దీనికి స్పందించిన అక్బరుద్దీన్ తాను ఎంఐఎం పార్టీలో సంతోషంగా ఉన్నానంటూ వ్యాఖ్యానించారు.
అక్బరుద్దీన్ ప్రసంగం తర్వాత అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి పదేళ్లు సమయం ఇచ్చారని.. తమకు నాలుగేళ్ల సమయం ఇస్తే చాంద్రాయణగుట్ట మెట్రో స్టేషన్ లో మిమ్మల్ని ఓటు అడుగుతానంటూ పేర్కొన్నారు. తాను గతంలో ఓబీసీ వ్యక్తికి టికెట్ ఇచ్చానని, తమకు కూడా ఓబీసీలపై ప్రేమ ఉందని, ఎంఐఎం అతని గెలుపు కోసం సహకరించాలంటూ కోరారు.. ఈ క్రమంలో.. అక్బరుద్దీన్ స్పందిస్తూ తాము ఎటువెళ్లాలంటూ ప్రశ్నించారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ బీఫామ్‌పై కొడంగల్ నుంచి అక్బరుద్దీన్ పోటీ చేస్తే గెలిపించే బాధ్యతను తీసుకుంటానని అన్నారు. చీఫ్ ఎన్నికల ఏజెంట్‌గా ఉండి ఆయనను గెలిపిస్తానని, అంతేకాకుండా డిప్యూటీ సీఎంగా అక్బరుద్దీన్‌ను తన పక్కనే కూర్చోబెట్టుకుంటానని చెప్పారు. అయితే, రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన అక్బరుద్దీన్ ఒవైసీ.. మజ్లిస్ పార్టీలో తాను సంతోషంగా ఉన్నానని తెలిపారు. చివరి శ్వాస వరకు ఎంఐఎం పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.
నేను చదువుకోలేదు
“చదువు అనేది చాలా ముఖ్యం. నేను పెద్దగా చదువుకోలేదని ఈ సభలో అందరి ముందు చెప్పడానికి సిగ్గుపడను. నేను డాక్టర్ కావాలనుకున్నాను. కానీ ఎంబీబీఎస్ చదువు మధ్యలోనే వదిలేశాను. ఆ బాధేంటో నాకు తెలుసు ” అంటూ అక్బరుద్దీన్ ఒవైసీ అసెంబ్లీలో ఎమోషనల్ అయ్యారు. తెలంగాణలో గత పదేళ్లలో విద్యారంగం నిర్లక్ష్యానికి గురైందని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. శనివారం అసెంబ్లీలో మాట్లాడుతూ.. విద్యారంగంపై దృష్టి పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు. విద్యార్థుల 8 వేల 200 కోట్ల స్కాలర్‌షిప్ బకాయిలు ఉన్నాయని, ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు రుణమాఫీ చేశారు కానీ స్కాలర్‌షిప్ బకాయిల చెల్లించలేదని తెలిపారు. గత పదేళ్లలో తెలంగాణ అక్షరాస్యత బాగా తగ్గిందని, ఇది ఆందోళన కలిగించే అంశమన్నారు.