హైదరాబాద్ లో ప్రసిద్ది చెందిన ఖైరతాబాద్ లోని సప్తముఖ మహాశక్తి గణపతిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శించుకుని తొలి పూజలు నిర్వహించారు. గణేశ్ ఉత్సవ సమితి నిర్వాహకులు సీఎంకు ఘనస్వాగతం పలికారు. ఈ క్రమంలో మహాగణపతి వద్ద భారీ బందోబస్తు చేపట్టారు. ఈ మార్గంలో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడకుండా పోలీసులు అన్ని చర్యలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంట మంత్రి పొన్నం ప్రభాకర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరున్నారు.
ఖైరతాబాద్ లో గణేశ్ వేడుకలను ప్రారంభించి 70 ఏళ్లు అయిన సందర్భంగా ఈసారి 70 అడుగుల ఎత్తులో వినాయకుడి విగ్రహాన్ని ప్రత్యేకంగా రూపొందించారు. సాయంత్రం గవర్నర్ జిష్టుదేవ్ వర్మ ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకోనున్నారు. అంతకు ముందు సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఇక తెలంగాణ వ్యాప్తంగా వినాయక చవితి వేడకులు ఘనంగా జరుగుతున్నాయి. ఊరు వాడ ఎక్కడ చూసినా గణనాధుల ప్రతిమలను ప్రతిష్టించి భక్తి శ్రధ్దలతో పూజల నిర్వహిస్తున్నారు.