ఆరోపించారు. విద్యుత్ అంశంపై న్యాయవిచారణ కోరింది బిఆర్‌ఎస్ సభ్యులేనని, నిజానిజాలు బయటకు వస్తాయని వద్దంటున్నది వాళ్లేనని ఆయన వ్యాఖ్యానించారు. వాళ్ల పార్టీవారికి ఇచ్చిన పనుల్లో వేల కోట్ల అవినీతి జరిగిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభ సమావేశాల్లో సోమవారం విద్యుత్ అంశంపై వాడివేడీ చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా సిఎం రేవంత్‌రెడ్డి ఛత్తీస్‌ఘఢ్ విద్యుత్ కోనుగోలు, యాదాద్రి పవర్‌ప్లాంట్‌కు సంబంధించిన న్యాయవిచారణ అంశంపై ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి చర్లపల్లి జైల్లో ఉన్నట్లు మాట్లాడుతున్నారని, కెసిఆర్ సత్యహరిశ్చంద్రుడికి ప్రతిరూపంలో ఉన్నట్లు చెబుతున్నారని సిఎం రేవంత్ ఎద్దేవా చేశారు. విచారణ కమిషన్ ముందు వాదనలు వినిపిస్తే బీఆర్‌ఎస్ సభ్యుల నిజాయతీ బయటకు వచ్చేదని ఆయన వ్యాఖ్యానించారు.
కోర్టుల నిర్ణయాలను తప్పుదోవ పట్టించేలా…
బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కోర్టుల నిర్ణయాలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారని సిఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ఇలా మాట్లాడితే ప్రాసిక్యూట్ చేయాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. కమిషన్ రద్దు చేయాలన్న హైకోర్టుకు వెళ్లారని ఆయన తెలిపారు. విచారణ కమిషన్ రద్దు చేయమని, విచారణ ఎదుర్కోవాల్సిందేనని హైకోర్టు చెప్పిందని ఆయన వెల్లడించారు. కమిషన్ రద్దు చేయడం కుదరదని సుప్రీంకోర్టుకు కూడా చెప్పిందని, చైర్మన్ ప్రెస్‌మీట్ నిర్వహించారన్న అభ్యంతరంపై కోర్టు మమ్మల్ని అడిగిందని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. చైర్మన్ మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉందా అని సుప్రీంకోర్టు ప్రశ్నించిందని, దానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సుప్రీంకోర్టుకు చెప్పామని ఆయన వెల్లడించారు. కమిషన్ రద్దు చేయాలన్న వాళ్ల విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించిందని, కెసిఆర్ వాదనను సుప్రీంకోర్టు తిరస్కరించిందని పేర్కొన్నారు. భద్రాద్రి పవర్‌ప్లాంట్‌ను రెండేళ్లలో పూర్తి చేస్తామని ఒప్పందం చేసుకున్నారని, రెండేళ్లలో పూర్తి చేస్తామన్నా ప్రాజెక్టుకు ఏడేళ్లు పట్టిందని సిఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు.
కొత్త చైర్మన్‌ను నియమిస్తాం
విద్యుత్ కమిషన్ ఎదుట కెసిఆర్ ఎందుకు హాజరుకావడం లేదని సిఎం రేవంత్ ప్రశ్నించారు. విద్యుత్ కొనుగోళ్లపై విచారణ కొనసాగించాలని సుప్రీం కోర్టు కూడా చెప్పిందని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. విచారణ కమిషన్‌కు కొత్త చైర్మన్‌ను సాయంత్రం వరకు నియమిస్తామని, బిఆర్‌ఎస్ వాదనలు అక్కడ చెప్పాలని సిఎం రేవంత్ స్పష్టం చేశారు. జైలుకు వెళ్లాల్సి వస్తుందన్న ఉద్ధేశ్యంతోనే కమిషన్‌కు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లారని, విద్యుత్ అంశంలో విచారణ వద్దని కోర్టును అడిగారని సిఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
కమీషన్లకు ఆశపడే…
బిఆర్‌ఎస్ పాలనలో కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీతో భద్రాద్రి పవర్ ప్లాంట్ నిర్మించారని సిఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. అప్పటికే ఆ టెక్నాలజీని నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకువచ్చిందని ఆయన గుర్తుచేశారు. అప్పటి బిఆర్‌ఎస్ నేతలు కమీషన్లకు ఆశపడి ఇండియా బుల్స్ అనే గుజరాత్ కంపెనీతో కూడబలుక్కొని, బిహెచ్‌ఈఏల్ నుంచి నామినేషన్ బేసిస్ మీద సబ్ క్రిటికల్ టెక్నాలజీ మెషీన్లు కొనుగోలు చేశారని ఆయన పేర్కొన్నారు.
సోనియా గాంధీ దయ, జైపాల్‌రెడ్డి కృషి వల్లే….
విద్యుత్ వినియోగం ప్రాతిపదికనే విద్యుత్ విభజన జరిగేలా జైపాల్‌రెడ్డి చేశారని సిఎం రేవంత్ పేర్కొన్నారు. విభజన చట్టంలో తెలంగాణకు 36 శాతం, ఎపికి 64 శాతం విద్యుత్ వచ్చేలా ఉందన్నారు. జైపాల్‌రెడ్డి కృషి వల్ల వినియోగం ఆధారంగా తెలంగాణకు 54 శాతం వచ్చేలా విద్యుత్ విభజన జరిగిందని సిఎం రేవంత్ గుర్తుచేశారు. ఉత్పత్తి సామర్థ్యం ప్రకారం 36 శాతం తెలంగాణలో, 64 శాతం ఎపిలో ఉందని ఆయన తెలిపారు. తెలంగాణను చీకట్ల నుంచి కాపాడింది జైపాల్‌రెడ్డి అని ఆయన పేర్కొన్నారు. సోనియా గాంధీ దయ, జైపాల్‌రెడ్డి కృషి వల్ల రాష్ట్రం విద్యుత్ సమస్య నుంచి గట్టెక్కిందని సిఎం రేవంత్ కొనియాడారు.
వాళ్ల అబద్ధాలు మానకపోతే, నేను నిజాలు చెప్పడం మానను
యాదాద్రి పవర్ ప్రాజెక్టు 2021లోపు పూర్తి చేస్తామని ఒప్పంద చేసుకున్నారని, ఇప్పటికి పూర్తి కాలేదని సిఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. యాదాద్రి పవర్ ప్లాంట్ పూర్తికి మరో రెండేళ్లు పడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్రాజెక్టుల్లో దిగమింగింది తేల్చడానికే విచారణ కమిషన్ వేశామని ఆయన వెల్లడించారు. మంత్రి పదవులు ఇస్తే చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డికి ఊడిగం చేసింది మీరు కాదా అని ఆయన ప్రశ్నించారు. తెలుగుదేశంలో ఉండి కూడా తెలంగాణకు జరిగిన అన్యాయం గురించి సభలో మాట్లాడానని సిఎం రేవంత్‌రెడ్డి గుర్తుచేసుకున్నారు. తనను జైలుకు పంపించినా భయపడలేదని నిలబడి కొట్లాడానని ఆయన పేర్కొన్నారు. వాళ్ల అబద్దాలు మానకపోతే, తాను నిజాలు చెప్పడం మాననని ఆయన హెచ్చరించారు.
బిఆర్‌ఎస్ డిఎన్‌ఏనే తిన్నింటివాసాలు లెక్కపెట్టడం….సిఎం
బిఆర్‌ఎస్ పార్టీ డిఎన్‌ఏలోనే నమ్మిన వారిని మోసం చేసే లక్షణం ఉందన్నారు. పదేళ్లు ఎవరితో కలిసి పనిచేసిన సహచరులను అగౌరపరిచారని ఎక్కడైనా ఉందా అని సిఎం రేవంత్ ప్రశ్నించారు. గురువుకు పంగనామాలు పెట్టడం ఎక్కడైనా ఉందా ? నేను మిత్రులను మిత్రులులాగే చూస్తానని, సహచరులను సహచరులాగే చూస్తానని, పెద్దలను గౌరవిస్తానని సిఎం రేవంత్ పేర్కొన్నారు. తిన్నింటివాసాలు లెక్కపెట్టే లక్షణం బిఆర్‌ఎస్ నేతలకు ఉందని ఆయన విమర్శించారు. బిఆర్‌ఎస్ డిఎన్‌ఏనే తిన్నింటివాసాలు లెక్కపెట్టడమని ఆయన ఎద్దేవా చేశారు. నమ్మిన వారిని మోసం చేసే లక్షణం బిఆర్‌ఎస్‌దేనని ఆయన పేర్కొన్నారు. 24 గంటల విద్యుత్ ఇవ్వాలని చంద్రబాబు హయాంలోనే నిర్ణయం తీసుకున్నారని ఆయన గుర్తు చేశారు. విద్యుత్ కోతలు ఉండకూడదని రాజశేఖర్ రెడ్డి నిర్ణయించారని, యూపిఏ ప్రభుత్వ నిర్ణయాల వల్లే హైదరాబాద్‌కు ఆదాయం పెరిగిందని సిఎం తెలిపారు.
సభకు రానప్పుడు కెసిఆర్‌కు ప్రతిపక్ష హోదా ఎందుకు?
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
సభకు రానప్పుడు కెసిఆర్‌కు ప్రతిపక్ష హోదా ఎందుకని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. శాసనసభలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కెసిఆర్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష నేతగా కెసిఆర్ సభకు వచ్చి మాట్లాడాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయన సభకు ఎందుకు రావడం లేదని అడిగితే, కెసిఆర్‌తో మాట్లాడే స్థాయి తమది కాదన్నారని ఆయన మండిపడ్డారు. ప్రతిపక్ష నేత హోదా కెసిఆర్ కాకుండా వేరేవారు తీసుకోవచ్చు కదా అంటూ ఆయన ఎద్దేవా చేశారు. సిఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి విమర్శలు చేయడం తగదని హితవు పలికారు.అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా విద్యుత్ విషయంలో గత ప్రభుత్వంపై కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపణాస్త్రాలు సంధించారు. పదేండ్ల పాలనలో రాష్ట్రాన్ని నాశనం చేశారని ఆయన విమర్శలు గుప్పించారు. విద్యుత్ పద్దుపై చర్చను ప్రారంభించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గత ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని అప్పుల్లోకి నెట్టేసిందని, దాని నుంచి బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.
సోమవారం కూడా ప్రశ్నోత్తరాలు రద్దు
తెలంగాణ అసెంబ్లీ ఒక్క రోజు విరామం తర్వాత నేడు తిరిగి ప్రారంభమైంది. సోమవారం కూడా ప్రశ్నోత్తరాలను రద్దు చేసి బడ్జెట్ పద్దులపై సభలో చర్చించారు. సోమవారం 19 పద్ధులపై చర్చ జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తో పాటు పలువురు మంత్రులు ఈ పద్దులను సభలో ప్రవేశపెట్టారు. పద్దుల్లో ప్రధానంగా ఆర్థిక నిర్వహణ, ఆర్థిక ప్రణాళిక, విద్యుత్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్, పరిశ్రమల, ఐటి, ఎక్సైజ్ హోం, కార్మిక ఉపాధి, రవాణా, బిసి సంక్షేమం, పాఠశాల విద్య, ఉన్నత విద్య, సాంకేతిక విద్య, మెడికల్ అండ్ హెల్త్ తదితర 19 పద్దలపై చర్చించారు. ముందుగా పలు పద్దులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తదితరులు ఈ పద్దులను సభలో ప్రవేశపెట్టారు.
ఆ విద్యుత్ ప్రాజెక్టు ప్రస్తుతం షట్ డౌన్
యాదాద్రి విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణంలో పాత సాంకేతిక పరిజ్ఞానంతో, ఎప్పుడో పక్కన పడేసిన పాత మోటార్లను ఉపయోగించారని రాజగోపాల్ రెడ్డి ఆక్షేపించారు. ఆ విద్యుత్ ప్రాజెక్టు ప్రస్తుతం ఏదో విధంగా షట్ డౌన్ అవుతుందని, అధికారులే దీనిని బయట పెట్టారని సభ దృష్టికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీసుకువచ్చారు. ఆ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం కూడా నామినేటెడ్ విధానంలో ఇవ్వడంతో పాటుగా ఇష్టానుసారంగా అంచనాలు పెంచి బిహెచ్‌ఈఎల్‌కు రూ. 20 వేల కోట్లు విలువైన పనులు ఇచ్చారని ఆయన ఆరోపించారు.
గత ప్రభుత్వానిది బాధ్యతారాహిత్యం
బొగ్గు గనులకు 280 కిలోమీటర్ల దూరంలో దామరచర్ల వద్ద థర్మల్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. బొగ్గు అందుబాటులో ఉన్న చోట పవర్ ప్రాజెక్ట్ పెట్టాల్సి ఉంది. కానీ, గత ప్రభుత్వం అందుకు భిన్నంగా పెట్టి బాధ్యతా రహితంగా వ్యవహారించి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసిందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలోని అన్ని శాఖల్లో బిల్లులు పెండింగ్ ఉన్నాయని, గత ప్రభుత్వాధినేతకు ఐఏఎస్ అధికారులతో కాళ్లు మొక్కించుకున్న చరిత్ర ఉందని ఆయన ఆరోపించారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన వ్యవహారంపై గంటల తరబడి మాట్లాడవచ్చని, గతంలో 24 గంటలు విద్యుత్ ఇవ్వలేదని, ఛతీస్‌ఘడ్ విద్యుత్ అగ్రిమెంట్ విషయంలో గత ప్రభుత్వం సక్రమంగా వ్యవహారించలేదని ఆయన ఆరోపించారు. అందువల్ల తెలంగాణ ప్రజలు తీవ్రంగా నష్ట పోయాని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు.
విద్యుత్ రంగంలో చేసే మంచికి ప్రతిపక్షం సహకరించాలి
రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని, విద్యుత్ రంగంలో సమూలమార్పులు తీసుకొస్తామని ఆయన తెలిపారు. విద్యుత్ రంగంలో చేసే మంచికి ప్రతిపక్షం సహకరించాలని ఆయన కోరారు.
ఎంపి ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌కు డిపాజిట్లు రాలేదు…రాజగోపాల్ రెడ్డి
ఛత్తీస్‌ఘఢ్ నుంచి చవకగా విద్యుత్ వచ్చేదని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఛత్తీస్‌ఘఢ్‌తో ఎంఓయూ చేసుకుని కూడా విద్యుత్ తెచ్చుకోలేదని ఆయన ఆరోపించారు. కారు, సారు, 16 అన్నారని, ఇప్పుడు ఎక్కడికి పోయారని ఆయన ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ డిపాజిట్లు కూడా రాలేదని ఆయన ఎద్దేవా చేశారు. విద్యుత్ రంగంపై విచారణ జరిపి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.
మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి హత్య కేసులో నిందితుడు: మంత్రి కోమటిరెడ్డి
మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి గతంలో హత్య కేసులో నిందితుడని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. దొంగతనం కేసులోనూ జగదీశ్వర్ రెడ్డి నిందితుడని, మదన్మోహన్ రెడ్డి హత్య కేసులో ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి ఏ2గా ఉన్నారని మంత్రి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. భిక్షం అనే వ్యక్తి హత్య కేసులో జగదీశ్వర్ రెడ్డి, ఆయన తండ్రి ఏ6, ఏ7గా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. రాంరెడ్డి హత్య కేసులో జగదీశ్వర్ రెడ్డి ఏ3 ఉన్నారని, ఆయనను ఏడాది పాటు జిల్లా నుంచి బహిష్కరించారని ఆయన తెలిపారు. మాజీ ఎమ్మెల్యే పెట్రోల్‌బంక్‌లో జరిగిన దొంగతనం కేసులో జగదీశ్వర్ రెడ్డి నిందితుడని, ఎన్టీఆర్ హయాంలో మద్యం కేసులోనూజగదీశ్వర్ రెడ్డి నిందితుడని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు.
ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డిపై చేసిన ఆరోపణలు నిరూపిస్తా
మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి సవాలను స్వీకరిస్తున్నానని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. జగదీశ్వర్ రెడ్డిపై చేసిన ఆరోపణలు నిరూపిస్తానని, ఆయనపై చేసిన ఆరోపణలు నిరూపించకపోతే మంత్రి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
మా నాయకుడు కెసిఆర్ హరిశ్చంద్రుడే: మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి
మా నాయకుడు కేసీఆర్ హరిశ్చంద్రుడే, వాళ్లలా సంచులు మోసే చంద్రుడు కాదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. తనపైన ఒకటి కాదు మూడు హత్య కేసులు పెట్టారని జగదీశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పెట్టిన మూడు కేసుల్లో కోర్టు తనను నిర్దోషిగా తేల్చిందని ఆయన చెప్పారు. పెట్రోల్ బంకులు, మిర్యాలగూడ కేసులు ఉన్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారని, వాళ్లు చెప్పిన కేసులపై హౌస్ కమిటీ వేయాలని ఆయన డిమాండ్ చేశారు. తనపై చేసిన ఆరోపణలు నిజమైతే ముక్కునేలకు రాసి రాజీనామా చేస్తానని, తాను మాట్లాడితే సిఎం భుజాలు ఎందుకు తడుముతున్నారని మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. మా నాయకుడు కెసిఆర్ హరిశ్చంద్రుడేనని, వాళ్లలా సంచులు మోసే చంద్రుడు కాదని ఆయన విమర్శించారు. చంద్రుడి సంచులు మోసి జైలుకు వెళ్లింది ఆయనేనని మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఎద్దేవా చేశారు.
ముక్కు నేలకు రాసి రాజీనామా చేస్తా
మంత్రి కోమటిరెడ్డి మాట్లాడిన ప్రతి అక్షరాన్ని రికార్డుల నుంచి తొలగించాలని ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి సభాపతిని కోరారు. కోమటిరెడ్డి చేసిన ఆరోపణల్లో ఏ ఒక్కటి నిరూపించినా సభలో ముక్కు నేలకు రాసి రాజీనామా చేసి వెళ్లిపోతానని ఆయన సవాల్ విసిరారు. రాజీనామా చేసిన తర్వాత మళ్లీ రాజకీయాల్లోకి రాను అని పేర్కొన్నారు. నాపై ఆరోపణలు నిరూపించకపోతే కోమటిరెడ్డి, సీఎం ఇద్దరు ముక్కు నేలకు రాయాలని, రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నాపై ఆరోపణలు నిరూపించకపోతే సీఎం, మంత్రి కోమటిరెడ్డి రాజకీయాల్లోంచి వెళ్లిపోవాలని సవాల్ విసిరారు.
మళ్లీ చర్లపల్లి జైలుకే వెళ్తామని రేవంత్ అంటున్నారు….
చర్లపల్లి జీవితం రేవంత్‌రెడ్డికి అనుభవం ఉందని జగదీశ్వర్ రెడ్డి అన్నారు. మళ్లీ చర్లపల్లి జైలుకే వెళ్తామని రేవంత్ అంటున్నారని, ఉద్యమంలో చంచల్‌గూడ జైలుకు వెళ్లిన అనుభవం తనకు ఉందని పేర్కొన్నారు.
అభివృద్ధి కోసమే అప్పులు చేశాం
2014 జూన్‌లో అధికారంలోకి వచ్చి నవంబర్ నాటికి 24 గంటల విద్యుత్ ఇచ్చామని ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం రైతులకు ఎందుకు 24 గంటల విద్యుత్ ఇవ్వటంలేదని మంత్రిని ప్రశ్నించానని జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. విద్యుత్ ఉన్నా సరఫరాకు లైన్లు, సౌకర్యాలు లేవని అధికారులు తెలిపారని ఆయన చెప్పారు. అప్పట్లో రూ.90 వేల కోట్లు పెట్టి విద్యుత్ సరఫరా వ్యవస్థను బలోపేతం చేశామని జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. తాము అధికారంలోకి వచ్చినప్పుడు రూ.24 వేల కోట్ల అప్పుతో విద్యుత్ రంగం తమ చేతికి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. అప్పులు చేయకుండా అభివృద్ధి ఎలా చేయాలని ఆయన ప్రశ్నించారు. అప్పులు చేయకుండా నోట్లు ముద్రించాలా అని ఆయన ప్రశ్నించారు. అభివృద్ధి కోసమే అప్పులు చేస్తున్నామని అసెంబ్లీలో ఆనాడే కెసిఆర్ చెప్పారని గుర్తుచేశారు. ఏదో కొత్త విషయం చెప్పినట్లు పదేపదే అప్పులు చేశారు అంటున్నారని జగదీశ్వర్ రెడ్డి మండిపడ్డారు.
మా ప్రభుత్వంలోనే విద్యుత్ వినియోగం పెరిగింది
2014 ముందు మాత్రమే కరెంటు లైన్ల కింద ఇళ్ల నిర్మాణం జరిగిందని జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో కరెంటు లైన్ల కింద ఇళ్ల నిర్మాణం జరగలేదని ఆయన చెప్పారు. పదేళ్ల బిఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రంలో స్థాపిత విద్యుత్ సామర్థ్యం పెరిగిందని ఆయన పేర్కొన్నారు. 2014లో రాష్ట్రంలో వ్యక్తిగత విద్యుత్ వినియోగం 1,196 కిలో వాట్లు ఉండగా 2024లో రాష్ట్రంలో వ్యక్తిగత విద్యుత్ వినియోగం 2,349 కిలో వాట్లు అని ఆయన చెప్పారు. తమ ప్రభుత్వంలోనే విద్యుత్ వినియోగం పెరిగిందని జగదీశ్వర్ రెడ్డి వెల్లడించారు.
గవర్నర్ సిపి రాధాకృష్ణన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన సిఎం రేవంత్‌రెడ్డి
రాజ్‌భవన్‌లో గవర్నర్ సిపి రాధాకృష్ణన్‌ను సిఎం రేవంత్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం ఉదయం రాజ్‌భవన్‌కు వెళ్లిన సిఎం రేవంత్ ముందుగా గవర్నర్‌ను శాలువాతో సన్మానించారు. కాసేపు ఆయనతో ముచ్చటించారు. జార్ఖండ్ గవర్నర్‌గా పని చేస్తున్న సిపి రాధాకృష్ణన్ ఇప్పటివరకు తెలంగాణ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన్ను తాజాగా కేంద్ర ప్రభుత్వం మహారాష్ట్రకు బదిలీ చేసింది.
కేంద్ర ప్రభుత్వం తాజాగా 10 రాష్ట్రాలకు గవర్నర్లను నియమించింది. అందులో భాగంగా రాధాకృష్ణన్‌ను స్థానంలో జిష్ణుదేవ్ వర్మను తెలంగాణ గవర్నర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. త్రిపురకు చెందిన జిష్ణుదేవ్ వర్మ(66) రాజ కుటుంబానికి చెందిన వ్యక్తి. 1957 ఆగష్టు 15వ తేదీన జన్మించిన ఆయన 2018 నుంచి -2023 మధ్య త్రిపుర ఉపముఖ్యమంత్రిగా పనిచేశారు.
పారిస్ ఒలింపిక్స్‌లో ఉత్తమ ప్రతిభ కనబరుస్తోన్న
క్రీడాకారులకు బెస్ట్ విషెస్ చెప్పిన సిఎం రేవంత్
పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ క్రీడాకారులు పథకాల సాధనకు సిద్ధమయ్యారు. స్టార్ అథ్లెట్స్ కొంతమంది తమ తొలి రౌండ్‌లను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ క్రీడాకారులకు సిఎం రేవంత్ రెడ్డి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఆయా కేటగిరీల తొలి దశల్లో ఉత్తమ ప్రతిభ కనబరుస్తోన్న తెలంగాణ అథ్లెట్స్ నిఖత్ జరీన్ (బాక్సింగ్), శ్రీజ ఆకుల (టేబుల్ టెన్నిస్), పివి సింధు (బ్యాడ్మింటన్)లకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. అలాగే తన ఈవెంట్ కోసం సిద్ధమవుతోన్న ఇషా సింగ్ (షూటింగ్)కు కూడా సిఎం బెస్ట్ విషెస్ చెప్పారు. వీరంతా తర్వాతి దశల్లోనూ ఇదే స్ఫూర్తిని కొనసాగించి విజయంతో దేశానికి మెడల్స్ సాధించాలని సిఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.
ఆయన సిఎస్ కాదు.. కల్వకుంట్ల ఫ్యామిలీకి నమ్మిన బంటు ఎక్స్ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ సెటైర్
ఆయన సిఎస్ కాదు.. కల్వకుంట్ల ఫ్యామిలీకి నమ్మిన బంటు అని తెలంగాణ మాజీ సిఎస్ సోమేశ్ కుమార్ పై తెలంగాణ కాంగ్రెస్ సెటైర్ వేసింది. జీఎస్టీ కుంభకోణంలో సోమేశ్‌కుమార్‌పై కేసు, వాణిజ్య పన్నుల శాఖ ఫిర్యాదుతో సిసిఎస్‌లో కేసు నమోదు కావడంతో పాటు, ఎఫ్‌ఐఆర్‌లో ఐదో నిందితుడిగా పేరు అంటూ వార్త పత్రికల్లో వచ్చిన కథనాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ గత బిఆర్‌ఎస్ ప్రభుత్వంపై పలు విమర్శలు చేసింది. అలాగే ప్రజా ధనానికి కస్టోడియన్ గా ఉండాల్సిన మాజీ సిఎస్ ప్రజాధనం దోపిడీకి మార్గదర్శిగా మారారని కాంగ్రెస్ ఫైర్ అయ్యింది. జీఎస్టీ వసూళ్లలో ఏకంగా రూ.1000 కోట్ల గోల్ మాల్ స్కాం తాజాగా బట్టబయలయ్యిందని చెబుతూ తెలంగాణలో గడచిన పదేళ్లూ స్కామ్‌ల పాలన జరిగిందనడానికి ఇది మరో నిదర్శనమని టి కాంగ్రెస్ ఎక్స్ ద్వారా ఈ ఆరోపణలు చేసింది.