Tuesday, December 24, 2024

Cm Revanth Fire On Allu Arjun అల్లు అర్జున్‌ అసలు మనిషేనా..?

  • సంథ్య థియేటర్‌ ఘటనకు ఆయనే కారణం
  • అనుమతి ఇవ్వమంటే ఎందుకు వచ్చారు
  • ఇక నుంచి బెనిఫిట్‌ షోలు రద్దు
  • టికెట్ల రేట్ల పెంపు అసలే ఉండదు
  • అసెంబ్లీలో సీఎం రేవంత్‌ రెడ్డి

టాలీవుడ్‌పై సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ఇటీవల సంధ్య థియేటర్‌ ఘటనతో పాటు అల్లు అర్జున్‌ విషయంలో తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఇకపై తెలంగాణలో ఎలాంటి బెనిఫిట్ షోలకు, టికెట్ రేట్లు పెంచుకోవడానికి ఎలాంటి అనుమతి ఇవ్వమని తాజాగా అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి తో పాటూ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సైతం స్పష్టం చేశారు.

అల్లు అర్జున్‌ .. మనిషేనా.? Cm fire on actor allu arjun
సంధ్య థియేటర్ ఘటన అల్లు అర్జున్ కారణంగానే జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అతడు రాకపోతే తొక్కిసలాట జరిగేది కాదని, రేవతి కుటుంబం నష్టపోయేది కాదంటూ అసెంబ్లీలో మండిపడ్డారు. బాధ్యులెవరైనా వదిలేది లేదని, చట్టప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ మేరకు సీఎం రేవంత్ మాట్లాడుతూ.. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో నటుడు అల్లు అర్జున్ బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించారు. అతను రోడ్ షో చేయడం వల్లే భారీగా అజాన్ థియేటర్ కు వచ్చారు. థియేటర్ కి రావొద్దని పోలీసులు చెప్పినా వినలేదు. అల్లు అర్జున్ అసలు మనిషేనా? అసలు ఏం మనిషి ఇతను.. ప్రపంచంలో ఇలాంటి మనుషులు ఉంటారా? డీసీపీ వచ్చి బలవంతంగా అల్లు అర్జున్‌ని కారులో ఎక్కించే వరకు థియేటర్‌లోనే కూర్చున్నాడు. అల్లు అర్జున్ రిటర్న్ వెళ్తుంటే కూడా కారు రూఫ్ టాప్ నుండి బయటకి వచ్చాడంటూ ఫైర్ అయ్యారు. మరోవైపు సభలో అల్లు అర్జున్‌పై అక్బరుద్దీన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితుల దగ్గరకు వెళ్లాలన్న బాధ్యత అల్లు అర్జున్‌కు లేదా అంటూ తీవ్ర విమర్శలు చేశారు.

ఏసీపీ వెళ్లిపోవాలని చెప్పినా వినలేదు
బౌన్సర్లు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. సినిమా ముందే ఇద్దరు చనిపోయారని చెప్పినా అల్లు అర్జున్ మూవీ మొత్తం చూసి వెళ్లాడు. పోలీసులను అతని దగ్గరకు సినిమా యాజమాన్యం వెళ్లనివ్వలేదు. ఏసీపీ వెళ్లిపోవాలని చెప్పినా అతడు వినలేదు. అందుకే థియేటర్ తోపాటు హీరోపై కూడా పోలీసులు కేసులు పెట్టారు. అయినా అంత డబ్బులు ఖర్చుచేసి సినిమా చూసేందుకు వచ్చి రేవతి చచ్చిపోతే ఆమె కుటుంబాన్ని చూడటానికి కూడా వెళ్లలేదు. అల్లు అర్జున్ కు ఏమైనా అయిందా? కన్ను పోయిందా? కాలు పోయిందా? రూప్ టాప్ మీద ఎక్కి చేతులు ఊపుతూ వెళ్లాడు. అతనివల్లే రేవతి కుటుంబం నష్టపోయింది. ఇకనుంచి బెన్ ఫిట్ షోలకు అనుమతులు ఇవ్వం“ అని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోలీసులు అనుమతి ఇవ్వలేదు 
సంధ్య థియేటర్ sandhya theatre లోపలికి వెళ్లేందుకు, బయటకు వచ్చేందుకు ఒకే దారి ఉండటంతో సెలెబ్రిటీ వస్తే ఇబ్బందులు తలెత్తుతాయని పోలీసులు అనుమతి ఇవ్వలేదని సీఎం రేవంత్‌ రెడ్డి చెప్పారు. అనుమతి ఇవ్వకపోయినా పుష్ప సినిమా హీరో థియేటర్ కు వెళ్లారని, అతను కేవలం థియేటర్ కు వెళ్లి సినిమా చూసి వెళ్ళిపోతే అభ్యంతరం ఉండేది కాదని, కానీ థియేటర్ కు వెళ్ళేటప్పుడు రోడ్డుపై కారు రూఫ్ టాప్ ఓపెన్ చేసి రోడ్ షో చేసుకుంటూ వెళ్లారని, దీంతో పక్కన ఉన్న అన్ని థియేటర్ల నుంచి ఒక్కసారిగా పబ్లిక్ సంధ్య థియేటర్ వైపు రావడంతో ఒక్కసారిగా తోపులాట జరిగి రేవతి చనిపోయిందన్నారు. ఆమె కొడుకు కోమాలోకి వెళ్ళాడని, అంత తొక్కిసలాటలో కూడా ఆ తల్లి కొడుకు చేయి విడిచిపెట్టలేదని, బిడ్డపై తల్లి ప్రేమ అలాంటదని సీఎం ఎమోషల్‌ అయ్యారు. కొడుకు చేయి పట్టుకుని ఆ తల్లి చనిపోయిందని, హీరో థియేటర్ లోపల ఉండటం వల్ల లోపల కూడా తొక్కిసలాట జరిగిందని, ఈ విషయాన్ని హీరోకు ఏసీపీ చెప్పినా.. శాంతి భద్రతలు చేయి దాటే ప్రమాదం ఉందని చెప్పినా హీరో వినలేదని పోలీసులు చెప్పినట్లు తెలిపారు.

ఏమీ అనొద్దు అంటే ఇదేం న్యాయం
ఇక బయటకు వెళ్లడానికి హీరో ఒప్పుకోలేదని సిటీ కమిషనర్ చెప్పారని, దీంతో డీసీపీ వెళ్లి అక్కడ నుంచి కదలకపోతే అరెస్టు చేస్తామని హెచ్చరించి హీరోను కారు ఎక్కించారని సీఎం వివరించారు. అయినా వెళ్ళేటప్పుడు కూడా కార్ రూఫ్ టాప్ ఓపెన్ చేసి రోడ్ షో చేస్తూ వెళ్లారని, ఈ నేపథ్యంలో హీరోపై, యాజమాన్యం పై పోలీసులు కేసు పెట్టారన్నారు. బాధ్యత రహితంగా సమాధానాలు ఇవ్వడం వల్లే పోలీసులు వారి విధి నిర్వహించారని, ఈ ఘటనపై కొన్ని రాజకీయ పార్టీలు పైశాచికత్వం ప్రదర్శించాయని, తన కొడుకు ఆ హీరో అభిమాని అని కొడుకు కోసం ఒక్కో టికెట్ రూ.3వేల చొప్పున రూ.12వేలు పెట్టి ఆ కుటుంబం సినిమా టికెట్లు కొన్నారన్నారు. థియేటర్ లో ఒక తల్లి చనిపోతే ఆ కుటుంబాన్ని, ఆ పిల్లవాన్ని హీరో పరామర్శించలేదని, అలాంటి మానవత్వం లేని వాళ్ళను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తే పదేళ్లు మంత్రులుగా పని చేసిన వాళ్లు కూడా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు.

చావుకు కారణమైన వారిని పోలీస్ స్టేషన్ కు పిలిస్తే.. తప్పు పట్టి ప్రభుత్వాన్ని బదనాం చేయాలని ఎంతో నీచమైన భాష వాడారన్నారు. సినీ పరిశ్రమను ప్రోత్సహించాలని భావించి మా ప్రభుత్వం ప్రత్యేక షోలకు అనుమతి ఇచ్చిందని, ప్రాణాలు బలి తీసుకుంటే వాళ్లను ఏమీ అనొద్దు అంటే ఇదేం న్యాయం అని సీఎం ప్రశ్నించారు. సినీ, రాజకీయ ప్రముఖులకు ప్రత్యేక చట్టం ఏమైనా చేస్తారా? అని, అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగానికి లోబడే తమ ప్రభుత్వం నడుచుకుంటోందన్నారు. జైలుకు వెళ్లి వచ్చిన హీరో ఇంటికి క్యూ కట్టిన సినీ ప్రముఖుల్లో బాధిత కుటుంబాన్ని ఒక్కరైనా కలిసారా అని నిలదీశారు. సినీ ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం కోరుకుంటున్నరో తెలియడం లేదని, వ్యాపారాలు చేసుకోండి కానీ ప్రాణాలతో చేలాగాటమాడటానికి తామేం ఒప్పుకోమని, తాము అధికారంలో ఉన్నంత కాలం అలాంటి ఆటలు సాగవని సీఎం రేవంత్‌ రెడ్డి హెచ్చరించారు.

ప్ర‌దాన వార్త‌లు

దురుద్దేశంతోనే తనపై కేసు పెట్టారన్న కేటీఆర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com