-
చేవేళ్ల చెల్లి కంటతడి
-
అక్కలను నమ్ముకుంటే.. బతుకు బస్టాండ్
-
అసెంబ్లీలో సీఎం రేవంత్
-
మెడపట్టి గెంటివేశారంటూ కంటతడి పెట్టిన సబిత
రాష్ట్ర శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి మాటలు వివాదంగా మారాయి. అక్కలను నమ్ముకుంటే బతుకు బస్టాండ్ అవుతుందంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. సీఎం వ్యాఖ్యలను ఖండిస్తూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే తమ నిరసన తెలిపారు. మరోవైపు రేవంత్ రెడ్డి టార్గెట్‌గా కేటీఆర్‌తో సహా ఆ పార్టీ నాయకులు విమర్శలు గుప్పించారు. శాసనసభలో జరిగిన ఘటనపై ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. శాసనసభ వేదికగా మహిళలను సీఎం రేవంత్ రెడ్డి అవమానించారన్నారు. అసెంబ్లీ నుంచి రేవంత్ రెడ్డి దొంగలా పారిపోయారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క భట్టి మాటలు బాధకరమన్నారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి కంటతడి పెట్టుకున్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు. మేము పార్టీ మారామని అనే హక్కు కాంగ్రెస్ నేతలకు లేదని.. తాము పార్టీ మారలేదని, పార్టీ నుంచి మెడ పట్టి బయటకు గెంటేశారని ఆరోపించారు. తమ కుటుంబానికి ఓ చరిత్ర ఉందన్నారు. 2014లో టికెట్ ఇవ్వకపోయినా తాను పార్టీ కోసం పనిచేశానని చెప్పారు. తనను దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయాల్లోకి తీసుకువచ్చారని.. మహిళలను మహానేత రాజశేఖర్ రెడ్డి ప్రోత్సహించారని తెలిపారు. ప్రస్తుతం సభలో మహిళలను కనీసం మాట్లాడనీయడం లేదన్నారు. ముఖ్యమంత్రి సీటు రేవంత్ రెడ్డి సొంతం కాదని.. నాలుగు కోట్ల ప్రజలు ఇచ్చిన పదవి అనే విషయాన్ని గుర్తించుకోవాలని సూచించారు.
నిబద్ధతో పని చేశామన్న సునితారెడ్డి
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి మాట్లాడుతూ ఏపార్టీలో ఉన్నా తాము నిబద్ధతతో పనిచేశామన్నారు. తమపై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో మహిళలను అవమానించినట్లేనని పేర్కొన్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా జెండా మోసి కార్యకర్తలను కాపాడుకున్నామని ఆమె తెలిపారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే దొంగలే దొంగ అన్నట్లుగా ఉందన్నారు. డీకే అరుణ, సబితా ఇంద్రారెడ్డితో పాటు తనను సభలో అవమానించారన్నారు. కౌరవసభలో ద్రౌపదిలా మమ్మల్ని అవమానించారని సునీతా రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తాము సోదరుల మంచిని కోరుకునే వాళ్లమే తప్పా కీడు కోరుకునే వాళ్లం కాదన్నారు.
అండగా ఉంటారనుకుంటే పార్టీ ఫిరాయించారు
కాంగ్రెస్ పార్టీ తనను సీఎల్పీని చేస్తే తనకు అండగా, మద్దతుగా ఉండాల్సింది పోయి పదవి కోసం సబితా ఇంద్రారెడ్డి నాకేంటీ అని ఫిరాయించారంటూ భట్టి విక్రమార్క ఆరోపించారు. తనను ప్రతిపక్ష హోదా లేకుండా చేయడానికే ఆ విధంగా చేశారని భట్టి పేర్కొన్నారు. తనకు ప్రతిపక్ష నేత హోదా లేకుండా చేయడానికే తనపై కుట్ర చేశారన్నారు. పార్టీలు మారి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది కాక.. ప్రస్తుతం ఏవేవో మాట్లాడుతున్నారని.. సబిత బాధ తనకు అర్థం కావడంలేదని భట్టి విక్రమార్క తెలిపారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అక్కలు ఇక్కడ ముంచి అక్కడ తేలారని.. వారి మాటలు వింటే కేటీఆర్ జూబ్లీబస్టాండ్ ముందు కూర్చోవాల్సి వస్తుందన్నారు. సీఎం, డిప్యూటీ సీఎంల వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది.