Monday, May 19, 2025

సోనియాను ఆహ్వానించడానికి ఢిల్లీకి వెళ్లిన సిఎం రేవంత్‌రెడ్డి

  • ఆయనతో పాటు డిప్యూటీ సిఎం, మంత్రులు కూడా…
  • సోనియా రాకను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పిసిసి

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మొదటిసారి జరుగుతున్న అవతరణ వేడుకలకు ముఖ్య అతిథిగా సోనియాగాంధీని తెలంగాణకు తీసుకురావడానికి పిసిసి కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే ఏఐసిసి నేతలతో సంప్రదింపులు జరిపిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం రాత్రి ఢిల్లీకి వెళ్లారు. ఇప్పటివరకు ఏఐసిసి నుంచి సోనియాగాంధీ హాజరుపై స్పష్టత రాకపోవడంతో నేరుగా ఢిల్లీ వెళ్లి ఆమెతో మాట్లాడి వ్యక్తిగతంగా ఆహ్వానించాలని సిఎం రేవంత్ భావించారు. అందులో భాగంగా ఆయన ఢిల్లీకి వెళ్లినట్టుగా కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు కేరళ వెళ్లారు. అక్కడ కోజీకోడ్‌లోని ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్ ఏర్పాటు చేసిన పుస్తకావిష్కరణలో సిఎం రేవంత్ పాల్గొన్నారు. అక్కడి నుంచి ఆయన ఢిల్లీకి వెళ్లినట్టుగా పిసిసి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం పంజాబ్ ఎలక్షన్ క్యాంపెయిన్‌లో ఉన్న డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క సైతం ఢిల్లీకి వెళ్లినట్టుగా తెలిసింది. డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క, సిఎం రేవంత్ రెడ్డితో కలిసి సోనియాగాంధీతో సమావేశమయ్యే అవకాశముందని పిసిసి వర్గాలు పేర్కొంటు న్నాయి. ఇప్పటికే రాష్ట్రం నుంచి పలువురు మంత్రులు కూడా ఢిల్లీకి బయలుదేరి వెళ్లినట్టుగా సమాచారం.

ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పిసిసి
సోనియాగాంధీతో పాటు రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ, ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గేలను సైతం పిసిసి ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తోంది. రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తయిన సందర్భంగా సోనియాగాంధీని ఈ కార్యక్రమానికి ఆహ్వానించడంతో ప్రజల్లో మంచి మేసేజ్ వెళ్తుందని, రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన అంశంగా మారుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. సోనియాగాంధీని ఈ కార్యక్రమానికి హాజరయ్యేలా చూడడం పిసిసికి ప్రతిష్టాత్మకంగా మారింది.

తెలంగాణ ఏర్పాటులో కీలకంగా వ్యవహారించి, తెలంగాణ ప్రజల హృదయాల్లో సోనియమ్మగా తనదైన ముద్ర వేసుకున్నారు. ఈ నేపథ్యంలో సోనియాగాంధీని ఘనంగా సత్కరించడంతో పాటు రాష్ట్రగీతాన్ని, తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అనారోగ్య కారణాలు, జూన్ 4వ తేదీన జరుగనున్న ఓట్ల లెక్కిపు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని సోనియాగాంధీ ఈ కార్యక్రమానికి హాజరవుతారా? లేక ఆమె రాకుండా రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీలను మాత్రమే పంపుతారా అన్నది త్వరలోనే తేలనుంది.

ప్ర‌దాన వార్త‌లు

కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com