- నాలుగు కోట్ల ప్రజలకు ఇది సంతోషకరమైన వార్త
- సోనియాగాంధీని హాజరుకావడంపై సిఎంగా, పిసిసి అధ్యక్షుడిగా
- సోనియాకు ధన్యవాదాలు తెలుపుతున్నా ఢిల్లీలో విలేకరులతో సిఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని ఆహ్వానించామని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీతో భేటీ అయ్యారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కెసి వేణుగోపాల్‌ను సైతం ఈ వేడుకలకు ఆహ్వానించినట్టు ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ఆమెను ముఖ్య అతిథిగా పిలవాలని ఇప్పటికే తెలంగాణ కేబినెట్ తీర్మానించిందని సిఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న ఈ వేడుకలకు సోనియా గాంధీ తప్పకుండా వస్తారని ఆయన తెలిపారు. నాలుగు కోట్ల ప్రజలకు ఇది సంతోషకరమైన వార్త అని, సోనియాగాంధీ రాక కోసం రాష్ట్రమంతా ఎదురుచూస్తుందన్నారు. ప్రజాపాలనలో జరుపుకుంటున్న రాష్ట్ర అవతరణ తొలి వేడులకు రాష్ట్రమిచ్చిన సోనియాగాంధీని హాజరుకానుండటంపై టిపిసిసి అధ్యక్షుడిగా, తెలంగాణ సిఎంగా తాను ఆమెకు ధన్యవాదాలు తెలియచేస్తున్నానన్నారు.
సోనియా చేతుల మీదుగా రాష్ట్ర గీతం ‘జయ జయహే’ ఆవిష్కరణ
ఈ వేడుకల్లో భాగంగా సోనియా చేతుల మీదుగా రాష్ట్ర గీతం ‘జయ జయహే’ను ఆవిష్కరిస్తున్నట్టు ఆయన తెలిపారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్రంలోని అందరికీ రాష్ట్ర ఆవతరణ వేడుకలను ఆహ్వానిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియాగాంధీని సత్కరించబోతున్నామని ఆయన పేర్కొన్నారు. ఆమె రాక కోసం ఎదురుచూస్తున్నామని ఆయన తెలిపారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కృషి చేసిన ఉద్యమకారులను, అమరుల కుటుంబాలను ఈ వేడుకలకు ఆహ్వానిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జూన్ 9వ తేదీన ఎర్రకోటపై జెండా ఎగురవేస్తామన్నారు. కేంద్రంలో ఇండియా కూటమి గెలుస్తుందన్నారు. ప్రశాంత్ కిషోర్ అన్ని అబద్ధాలే చెబుతున్నారని, కేరళ, తమిళనాడులో బిజెపికి డిపాజిట్ రాదని ఆయన తెలిపారు. మోడీ గ్యారంటీకి వారంటీ అయిపోయిందన్నారు. బిజెపిని ఓడించేందుకు దేశ ప్రజలు సిద్ధమయ్యారని ఆయన చెప్పారు.