Monday, September 30, 2024

త్వరలో మరో 35 వేల పోస్టులు భర్తీ 

* నిరుద్యోగులు డిమాండ్‌ – సప్లయ్‌ సూత్రం గుర్తుంచుకోవాలి
* ఉపాధి లేక యువత చెడుమార్గంలో పయనిస్తున్నది
* యువతకు ఉపాధి లక్ష్యంగా పని చేస్తున్నాం
* రాష్ట్రంలోని ఇంజినీరింగ్​ కాలేజీలపైనా దృష్టి పెట్టాం
* బీఎఫ్​ఎస్​ఐ స్కిల్​ ప్రొగ్రాం ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి
తమ ప్రభుత్వం ఏర్పడిన 90 రోజుల్లోనే 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, డీఎస్సీ, గ్రూప్స్ విభాగాల్లో మరో 35 వేల ఉద్యోగాల భర్తీ చేపట్టామని సీఎం రేవంత్​రెడ్డి తెలిపారు. త్వరలో మరో 35 వేల పోస్టులు భర్తీ చేస్తామని వెల్లడించారు. ఏటా 3లక్షల మంది పట్టాలు తీసుకుని బయటకు వస్తున్నారన్న సీఎం, ఉపాధి అవకాశాలపై పరిశ్రమల యాజమాన్యాలతో మాట్లాడినట్లు వివరించారు. ఎలాంటి కోర్సులు చదివిన వారు కావాలని పరిశ్రమల యజమానులను అడుగుతున్నామని, అందుకు తగ్గట్టుగానే నిరుద్యోగ యువత డిమాండ్‌-సప్లయ్‌ సూత్రం గుర్తుంచుకోవాలని రేవంత్‌రెడ్డి తెలిపారు. మాసబ్‌ట్యాంక్‌లో బీఎఫ్​ఎస్​ఐ స్కిల్ ప్రోగ్రామ్‌ను ఆయన బుధవారం ప్రారంభించారు. బీఎఫ్​ఎస్​ఐ రంగాలకు అవసరమైన నైపుణ్యాలు నేర్పేందుకు స్కిల్​ ప్రోగ్రామ్​ను సీఎం, మంత్రి శ్రీధర్​బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ డిగ్రీ చదివేవారు భవిష్యత్తు దిశగా ఆలోచించాలని కోరారు. కొందరు విద్యార్థులు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ నేర్చుకోవడం లేదని, బ్యాంకులు, బీమా రంగాల్లోనూ ఎక్కువ ఉద్యోగవకాశాలు ఉన్నాయని వివరించారు. నాయకుడిగా రాణించాలన్నా నైపుణ్యం ఉండాలని ఉద్ఘాటించారు. ఉద్యోగాలు, ఉపాధి లేకుంటేనే యువత చెడు వ్యసనాల వైపు వెళ్లే ప్రమాదం ఉందని, ఈ క్రమంలోనే బీటెక్‌ చదివిన వారు కూడా డ్రగ్స్‌ విష వలయంలో చిక్కుకుంటున్నారని ఆవేదన వ్యక్తపరిచారు. ఈ సమస్య నిర్మూలనకు కార్యక్రమం చేపట్టామని, ప్రభుత్వం ఒక్కటే దీన్ని పరిష్కరించలేదని అందరూ కలిస్తేనే డ్రగ్స్‌ నిర్మూలన సాధ్యమని,  మారుతున్న కాలానికి అనుగుణంగా మనమూ మారాలని, మన విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడాలని సీఎం అన్నారు.
మాదే బాధ్యత
పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్యాలు అందించే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.  రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యను గుర్తించామని, అన్ని శాఖల్లో భర్తీ ప్రక్రియ చేపట్టామని, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు విరివిగా కల్పిస్తున్నామని చెప్పారు. ఇంజినీరింగ్, డిగ్రీ విద్యార్థులకు బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ సర్వీసెస్, ఇన్సూరెన్స్‌ (బీఎఫ్‌ఎస్‌ఐ) రంగాల్లో ఉద్యోగాలను కల్పించడమే లక్ష్యంగా వినూత్న కోర్సుకు రాష్ట్ర సర్కార్​ శ్రీకారం చుట్టినట్లు వివరించారు. నాలెడ్జ్‌, కమ్యూనికేషన్ ఉంటేనే మంచి ఉద్యోగాలు వస్తాయని, చదివిన డిగ్రీకి, మార్కెట్‌లో ఉన్న డిమాండ్‌కు గ్యాప్ ఉంటోందని సీఎం తెలిపారు. బీఎఫ్​ఎస్​ఐకు అవసరమైన స్కిల్స్ నేర్పేందుకు కోర్సు ప్రారంభిస్తున్నామని చెప్పారు. ఇంజినీరింగ్ విద్యార్థులు జాబ్‌ స్కిల్స్ నేర్చుకోవడం లేదని, కొన్ని కళాశాలల్లో అధ్యాపకులు, వసతులు ఉండటం లేదని సీఎం ఆక్షేపించారు. కళాశాలలు ఇలాగే కొనసాగితే గుర్తింపు రద్దు చేసేందుకు వెనుకాడమని హెచ్చరించారు. త్వరలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమీ, యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఔత్సాహిక క్రీడాకారులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తామని వివరించారు.
ఇంజినీరింగ్​కాలేజీలపై దృష్టి పెట్టాం
గత పదేళ్లలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక కొంతమంది తెలంగాణ యువత గంజాయ,  డ్రగ్స్ కు బానిసలయ్యారని,  ఇటీవల పట్టుబడినవారిలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఉండటం ఆందోళనకరమైన విషయం అని సీఎం రేవంత్​ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్, గంజాయి నియంత్రించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, వ్యసనాల నుంచి యువతను బయటపడేయాలంటే ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. దీనిలో భాగంగా 65 ఐటీఐలను అప్ గ్రేడ్ చేసి టాటా టెక్నాలజీస్ సహకారంతో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మారుస్తున్నామని, రాబోయే రెండేళ్లలో అన్ని ఐటీఐలను ఏటీసీలుగా మారుస్తామని ప్రకటించారు. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీలపైనా ప్రత్యేక దృష్టి సారించామని, కనీస ప్రమాణాలు లేకపోతే ఇంజనీరింగ్ కాలేజీల అనుమతులు రద్దు చేయడం ఖాయమని హెచ్చరించారు. పాలిటెక్నిక్ కాలేజీలను అప్ గ్రేడ్ చేస్తున్నామని, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ద్వారా విద్యార్థులకు నైపుణ్యం అందించబోతున్నామని, హైదరాబాద్ ను ఎడ్యుకేషన్ హబ్ గా మార్చడమే కాదు.. నైపుణ్యం అందించడంలోనూ హైదరాబాద్ కేరాఫ్ గా మార్చనున్నామని, సాంకేతిక నైపుణ్యానికి హైదరాబాద్ డెస్టినేషన్ కావాలని, ప్రపంచ వేదికపై హైదరాబాద్ ను విశ్వనగరంగా నిలబెట్టాలని సీఎం రేవంత్​ రెడ్డి కోరారు. రాబోయే ఏడాదిలో స్పోర్ట్స్ యూనివర్సిటీ , స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేస్తామని, తెలంగాణను దేశానికి రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతామన్నారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో చదివిన వారు ప్రపంచంలోనే పెద్ద సంస్థలకు సీఈవోలుగా ఉన్నారని,
అలాంటి వారి సహకారం తీసుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళతామని సీఎం చెప్పారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

Actress Kriti Sanon New Stills

Mrunal Thakur Latest Pics

Actress Shriya Saran new pics