వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు హాజరు
సాయంత్రం ముస్లింలతో కలిసి ఇఫ్తార్ విందు
ముఖ్యమంత్రి పర్యటనకు విస్తృత ఏర్పాట్లు
కొడంగల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం పర్యటించనున్నారు. మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవస్థానం 45వ వార్షిక బ్రహ్మోత్సవాలకు ముఖ్య మంత్రి హాజరుకానున్నారు. సీఎం పర్యటన సందర్భంగా విస్తృత ఏర్పాట్లు చేయాలని అధికారులకు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పలు సూచనలు చేశారు. నిరంతర విద్యుత్ సరఫరా, మూడు హెల్త్ క్యాంపు లు, రెండు అంబులెన్సులు, వైద్య సౌకర్యాలు అన్నింటిని ఏర్పాటు చేయాలని సూచించారు..దేవాలయ ఆవరణలో శానిటేషన్, బారికేడ్స్, పూర్తి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పోలీసు శాఖ బందోబస్తు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షణ చేపడుతుందన్నారు. ఎస్పీ నారాయణ రెడ్డితో కలిసి కలెక్టర్ ప్రతీక్ జైన్ సంబంధిత అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.
29న రాష్ట్ర ముఖ్య మంత్రి రానున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేపడుతున్నామని తెలిపారు. నిరంతర విద్యుత్ సరఫరా ఉండాలన్నారు. శానిటేషన్ లో భాగంగా బ్లీచింగ్ చేయించాలని కమిషనర్ కు ఆదేశించారు. ముందు జాగ్రత్త గా ఫైర్ ఇంజన్ ను ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం రాఘవేంద్ర గార్డెన్ ఫంక్షన్ హాల్ లో సాయంత్రం ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారని తెలిపారు. ఈసందర్బంగా ఫంక్షన్ హాల్ లో ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించారు.
కలెక్టర్ తో పాటు, ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి, దేవాలయం ఈవో రాజేందర్ రెడ్డి, ఆర్ అండ్ బి శ్రీధర్ రెడ్డి, ఎలక్ట్రిసిటీ ఎడి అర్జున్ కుమార్, మున్సిపల్ కమిషనర్ బలరాం నాయక్ ,తహసీల్దార్ విజయకుమార్, పిసిసి మెంబర్ మహ్మద్ యూసుఫ్ కొడంగల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నందారం ప్రశాంత్ కొడంగల్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నయీమ్ పార్టీ నాయకులు, ముస్తాక్ తౌఫీక్ పాల్గొన్నారు.