ముఖ్యమంత్రి సహాయనిధి స్కామ్‌కు పాల్పడిన హాస్పిటళ్లపై రేవంత్ సర్కార్ యాక్షన్ తీసుకుంది. క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ – 2010 కింద 28 ప్రైవేటు హాస్పిటల్స్ రిజిస్ట్రేషన్లు రద్దు చేసింది. సీఎంఆర్‌ఎఫ్ అక్రమాలపై రేవంత్ సర్కార్ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో సంచలనంగా మారిన ఈ స్కామ్ లో సీరియస్ యాక్షన్ తీసుకుంది. ఈ నిర్ణయాన్ని వెంటనే అమల్లోకి తేవాలని హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, కరీంనగర్, పెద్దపల్లి, హనుమకొండ, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశించింది. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 10 ప్రైవేట్ హాస్పిటల్స్ రిజిస్ట్రేషన్ క్యాన్సల్ చేశారు. రంగారెడ్డి జిల్లాలో 6, హైదరాబాద్ 4, నల్గొండ 3, మహబూబాబాద్ 2, కరీంనగర్, పెద్దపల్లి, హనుమకొండ జిల్లాల్లో ఒక్కో ప్రైవేట్ ఆసుపత్రుల లైసెన్స్ రద్దు చేశారు. రోగులకు వైద్యం చేయకుండానే నకిలీ బిల్లులతో సీఎంఆర్‌ఎఫ్ నిధులు కొల్లగొట్టినట్లు విచారణలో వెల్లడైంది. సీఎంఆర్‌ఎఫ్ నిధులపై ఆరోపణలు రావడం, పలు ఆస్పత్రులు కంటిన్యూగా బిల్లుల కోసం ఫైళ్లు పంపుతుండటంతో.. ఈ నిధులపై విచారణ చేపట్టారు. విచారణలో కుంభకోణాలు బయటకు వచ్చాయి. దీంతో ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని రేవంత్ సర్కార్ లోతుగా దర్యాప్తు చేయించింది. గతేడాది సీఐడీ విచారణకు ఆదేశించిన రేవంత్ సర్కార్ ఈ కేసుల్లో నింధితులుగా కొంతమందిని గుర్తించి వారిని అదుపులోకి తీసుకుని విచారించింది. ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యాల పాత్ర ఉందని తేలడంతో క్రిమినల్ కేసులు నమోదు చేసి ఆయా హాస్పిటల్స్‌ను వైద్యారోగ్య శాఖ బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది.