- రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి కాగ్నిజెంట్, చార్లెస్ స్క్వాబ్,
ట్రైజిన్ టెక్నాలజీస్ తదితర సంస్థలు ముందుకు
రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా
బిజీబిజీగా గడుపుతున్న రేవంత్ రెడ్డి
తెలంగాణకు పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికాలో వివిధ బహుళజాతి సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నారు. పరిశ్రమల స్థాపన ద్వారా ఇక్కడి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్న సంకల్పంతో ఈ నెల 3వ తేదీన అమెరికా వెళ్లిన సిఎం రేవంత్ ఇప్పటివరకు ఐదు రోజుల వ్యవధిలో 10 సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నారు.
కాగ్నిజెంట్ సంస్థ త్వరలో హైదరాబాద్‌లో అతిపెద్ద క్యాంపస్ ను ఏర్పాటు చేసేందుకు ముందుకు రాగా, ఈ సంస్థ క్యాంపస్ ఏర్పాటు అయితే 15 వేల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వాల్ష్ కార్రా హోల్డింగ్స్ సంస్థ విహబ్ లో ఐదు మిలియన్ డాలర్లను పెట్టుబడి పెట్టేందుకు అంగీకారం తెలిపింది. తెలంగాణ స్టార్టప్‌లలో 100 మిలియన్ల పెట్టుబడి పెట్టాలని నిర్ణయించింది. అదే విధంగా ఆర్సీసిఎం సంస్థతోనూ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ సంస్థ ద్వారా దాదాపు 500 హై- ఎండ్ టెక్ ఉద్యోగాలు లభిస్తాయి.
రూ.వెయ్యి కోట్ల పెట్టుబడులతో స్వచ్ఛ్ బయో ముందుకు
స్వచ్ఛ్ బయో సంస్థ రూ.వెయ్యి కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు ఇప్పటికే ప్రకటించగా ఈ సంస్థ ద్వారా ప్రత్యక్షంగా ఐదు వందల మందికి కొలువులు రానున్నాయి. మరో సంస్థ ట్రైజిన్ టెక్నాలజీస్ హైదరాబాద్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్నోవేషన్ డెవలప్‌మెంట్, డెలివరీ సెంటర్ ఏర్పాటు చేసేందుకు అంగీకారం తెలిపింది. ఈ సంస్థ ఏర్పాటు అయితే దాదాపు 1,000 మందికి ఉద్యోగావకాశాలు వస్తాయి. హెచ్‌సిఏ హెల్త్ కేర్ నాలుగు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో క్యాంపస్‌ను విస్తరించేందుకు అంగీకారం తెలిపింది.
గ్లాస్ ట్యూబింగ్ ఫెసిలిటీ కేంద్రంలో వచ్చే ఏడాది వాణిజ్య ఉత్పత్తి ప్రారంభించనున్నట్టు కార్నింగ్ సంస్థ వెల్లడించింది. వివింట్ ఫార్మా తెలంగాణలో 400 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనున్నట్టు తెలిపింది. ఈ సంస్థ ద్వారా వెయ్యి మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. చార్లెస్ స్క్వాబ్ హైదరాబాద్‌లో భారతదేశంలోనే మొదటి టెక్నాలజీ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్టు గురువారం ప్రకటించింది. ఈ సంస్థ ఇండియాలో ఎంచుకున్న మొట్టమొదటి నగరం హైదరాబాద్ కావడం విశేషం. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం అయ్యేందుకు వరల్డ్ బ్యాంకు భాగస్వామి అయ్యేందుకు సిద్ధం కావడం విశేషం.