Friday, September 20, 2024

ఇదో వసూళ్ల దందా..!

సిఎన్‌జి గ్యాస్ కృత్రిమ కొరతతో
బారులు తీరుతున్న వాహనాలు
స్టాక్ వచ్చిన గంటలోనే ‘నోస్టాక్’
వాహనదారుడి నుంచి అదనంగా రూ.10లు,
బంక్ యజమాని నుంచి కాంట్రాక్టర్ రూ.20లు వసూళ్లు
తనిఖీలు చేయని అధికారులు
గంటల తరబడి క్యూ లైన్‌లోనే….

సిఎన్‌జి గ్యాస్‌ను (కంప్రెసివ్ నేచురల్ గ్యాస్) డీలర్‌లు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. ఈ కృత్రిమ కొరతతో ఆటోలు, కార్లు తదితర వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. దీనికితోడు ప్రతి బంక్‌లో అదనంగా రూ.20లను వసూలు చేస్తున్నారని ఆయా వాహనాల యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే గ్రేటర్ పరిధిలో సుమారుగా 70 వరకు సిఎస్‌జీ బంక్‌లు ఉండగా ఎప్పటికప్పుడు ఆయా సిఎన్‌జీ బంకుల్లో గ్యాస్ నింపుకోవడానికి ఆటోలు, కార్లు క్యూ కడుతున్నాయి. ఈనేపథ్యంలోనే పలువురు సిఎన్‌జీ యజమానులు గ్యాస్ కొరతను సృష్టిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

గ్యాస్‌ను బ్లాక్ చేయడంతో పాటు నో స్టాక్ బోర్డులు పెడుతుండడంతో ఆటోలు, కార్లు నడిపే వారు ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే ఈ బంక్‌లకు గ్యాస్‌ను సరఫరా చేసే భాగ్యనగర్ గ్యాస్ ఏజెన్సీ నుంచి ప్రతిరోజు గ్యాస్‌ను తీసుకెళ్లే కాంట్రాక్టర్ సరిపడా గ్యాస్‌ను వాహనాలను సమకూర్చడంలో విఫలమవుతుండడంతో ఇదే అదునుగా గ్యాస్‌ను విక్రయించే వారు కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారని పలువురు వాహనదారులు ఆరోపిస్తున్నారు. ప్రతిరోజూ గ్రేటర్ పరిధిలో 2,000ల కిలోల సిఎన్‌జి స్టాక్ రావాల్సి ఉండగా, కేవలం 200ల కిలోల సిఎన్‌జి మాత్రమే వస్తోందని డీలర్లు ఆరోపిస్తున్నారు. ఇందులో కంపెనీ లే ఔట్లు బంకులు అయిన తార్నాక, కొత్తపేట తదితర ప్రాంతాల్లోని స్టేషన్‌లలో సిఎన్‌జి స్టాక్ సరిపడా లేకపోవడంతో అక్కడ కూడా వాహనాలు బారులు తీరుతున్నాయని వారు పేర్కొన్నారు.

డెలివరీ చేసే ట్రక్ సామర్థ్యం 200ల కేజీలే
సిఎన్‌జి బంకుల్లో ప్రతి రోజూ సుమారు 1 లక్ష కేజీల సిఎన్‌జి అవసరం ఉంటుంది. ఒక్కో బంకులో 1,500ల నుంచి 2వేల కేజీల సిఎన్‌జి అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ప్రతిరోజూ కేవలం 200ల కిలోల సిఎన్‌జి గ్యాస్ మాత్రమే సరఫరా అవుతుండడం, డెలివరీ చేసే ట్రక్ సామర్థ్యం కూడా 200ల కేజీలు మాత్రమే ఉండడంతో ఇబ్బందులు పడుతున్నామని డీలర్లు వాపోతున్నారు. ఈ నేపథ్యంలోనే స్టాక్ వచ్చిన గంటన్నర వ్యవధిలోనే నో స్టాక్ బోర్డులు పెట్టక తప్పడం లేదని డీలర్లు వాపోతున్నారు.

5 నుంచి 6 గంటల పాటు క్యూ
ఈ కృత్రిమ కొరత వల్ల అధికంగా ఆదాయం సమకూరుతుండడంతో ఇదే అదునుగా ప్రతిసారి ఈ పద్ధతినే డీలర్లు అవలంభిస్తుండడం, దీనికి బంక్ యజమానులు వత్తాసు పలుకుతుండడంతో వాహన యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పాటు కిలో గ్యాస్‌కు ప్రస్తుతం రూ.95ల వరకు ధర పలుకుతుండగా దానికి అదనంగా రూ.20లు ఏ బంక్ యజమాని అయితే అదనంగా చెల్లిస్తారో ఆయా బంకుల్లో గ్యాస్ కొరత రాకుండా కాంట్రాక్టర్ గ్యాస్‌ను సరఫరా చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతోపాటు ప్రతి వాహనానికి గ్యాస్‌ను నింపించినప్పుడు కిలో గ్యాస్ తేడా వస్తుందని, దీనికి తోడు రూ.10లు అదనంగా చెల్లిస్తేనే ఆ వాహనాలకు గ్యాస్‌ను నింపుతున్నారని వాహనదారులు వాపోతున్నారు. దీంతోపాటు సిఎన్‌జీ బంకుల్లో తనిఖీలను అధికారులు చేపట్టకపోవడంతో ఆయా బంకుల యజమానులు ఆడింది ఆట పాడింది పాటగా మారింది. చాలా బంకుల్లో ప్రస్తుతం గ్యాస్‌ను నింపుకోవాలంటే 5 నుంచి 6 గంటల పాటు క్యూలో నిలబడాల్సి వస్తుందని వాహనయజమానులు ఆరోపిస్తున్నారు. గ్రేటర్ పరిధిలో 2 లక్షల సిఎన్‌జీ కార్లతో పాటు వివిధ వాహనాలు ఉండగా, ఒక లక్ష వరకు ఆటోలు సిఎన్‌జీతో నడుస్తున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

Lavanya Tripati New Pics

Ishita Raj Insta Hd Pics

Nabha Natash New photos