హోటళ్లలో పురుగుల పిండి.. పాడైన టమాట
నగరంలోని భోజన హోటళ్లలో అపరిశుభ్రత రాజ్యమేలుతోంది. పురుగులు పట్టిన పిండి.. పాడైన టమోటాలతో వంటలు చేస్తూ వాటినే విక్రయిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఈ తిండి తిన్నవారు అనారోగ్యానికి గురవుతూ ఆసుపత్రులపాలవుతున్నారు. తాజాగా అధికారులు నిర్వహించిన హోటల్ తనిఖీల్లో పురుగులు పట్టిన బియ్యపు పిండి, పాడైన టమోటాలు, అపరిశుభ్ర వాతావరణం వెలుగు చూశాయి. ఫుడ్ సెఫ్టీ టాస్క్‌ఫోర్స్ అధికారులు అమీర్‌పేటలోని తాజా కిచెన్, అమోఘా హోటల్ అండ్ కేఫ్‌లో తనిఖీలు చేశారు. తాజా కిచెన్‌లో నీటి సంరక్షణకు ఎటువంటి చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించలేదు. ఫ్రిడ్జ్‌లో సగం ఉడికించిన ఆహార పదార్ధాలు, ఆహారానికి సంబంధం లేని పదార్థాలను ఎటువంటి రక్షణ చర్యలు లేకుండా నిల్వ చేశారు. ఇక జగిత్యాలలోని ఓ రెస్టారెంట్‌లో బిర్యానీలు చచ్చిన బొద్దింకలు వచ్చాయి.
హోటళ్లలో బియ్యపు పిండిలో పురుగులు, పాడైన టమోటాలు, కొన్ని ఆహార పదార్థాల్లో వెంట్రుకలు ఉన్నట్టు గుర్తించారు. అమోఘా హోటల్‌లో కిచెన్‌లో ఫ్లోరింగ్ అపరిశుభ్ర, గ్రైండింగ్, వాషింగ్ ఏరియా పూర్తి చెత్తతో నిండిపోయి ఉండటం గమనించారు. సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడుతున్నట్టు తేలింది. టాయిలెట్, కిచెన్‌తో అనుసంధానం చేసి ఉండటం వల్ల దుర్వాసన వ్యాప్తి చెందేలా ఉంది. దీంతో అధికారులు ఈ హోటళ్ల నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు.
ఆహార నాణ్యత విషయంలో హోటల్స్, రెస్టారెంట్ నిర్వాహకులు తమ తీరును మార్చుకోని పరిస్థితి. పలు మార్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేసి ఫుడ్ తయారీలో నాణ్యత ప్రమాణాలు పాటించని అనేక హోటళ్లను సీజ్‌లు కూడా చేశారు. కొద్ది రోజులు ఫుడ్ సేఫ్టీ అధికారుల హాడావుడి నడిచినా.. మళ్లీ షరామామూలే అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు హోటల్ నిర్వాహకులు. డబ్బు సంపాందించడమే లక్ష్యంగా పెట్టుకున్న వీరు.. కస్టమర్లకు ఫుడ్ సర్వ్ చేయడంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అధికారులు ఎన్నిసార్లు హెచ్చిరించినా, హోటళ్లను సీజ్ చేసినా వారి బుద్ధి మాత్రం మార్చుకోవడం లేదు.
ఫుడ్ తయారీలో ప్రాణాంతక రసాయనాలు వాడటం, ఎక్స్‌పైరీ అయిన పదర్థాలు ఉపయోగించడం చేస్తున్నారు. అంతే కాకుండా ఆహారంలో పురుగులు, బొద్దింకలు రావడం కూడా మామూలైపోయింది. తాజాగా జగిత్యాల జిల్లాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ వ్యక్తి బిర్యానీ తినాలని ఓ రెస్టారెంట్‌కు వెళ్లారు. ప్లేట్‌లో ఉన్న బిర్యానీని తిందామని చూడగా అక్కడ కనిపించింది చూసి అవాక్కయ్యారు. ఫుడ్ తయారీలో హోటల్ నిర్వాహకుల నిర్లక్ష్యం పట్ల కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలేం జరిగింది.. బిర్యానీలో ఏం బయటపడిందో ఇప్పుడు చూద్దాం.
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ఇష్ట రెస్టారెంట్‌లో దారుణం వెలుగు చూసింది. ఓ కస్టమర్.. రెస్టారెంట్‌కు వచ్చి బిర్యానీని ఆర్డర్ చేశాడు. టేబుల్ వద్దకు వచ్చిన బిర్యానీని తిందామని అనుకునేలోపు అందులో కనిపించింది చూసి సదరు కస్టమర్ షాక్‌కు గురయ్యాడు. చికెన్ బిర్యానీలో బొద్దింక కనబడటంతో కస్టమర్ నివ్వెరపోయాడు. ఇదేంటంటూ రెస్టారెంట్ సిబ్బంది, మేనేజ్‌మెంట్‌ను ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని కస్టమర్ వాపోతున్నారు. వెంటనే కిచెన్‌లోకి వెళ్లి చూడగా అక్కడ దృశ్యాలు చూసి కూడా ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు. అక్కడంతా చెత్తాచెదారంతో నిండిపోయిందని, బొద్దింకలు తిరుగుతున్నాయని కస్టమర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
దీంతో ఇష్టా రెస్టారెంట్‌పై ఇప్పటికే ఫుడ్ సేఫ్టీ అధికారులకు అతడు ఫిర్యాదు చేశాడు. గతంలో కూడా కస్టమర్లతో రెస్టారెంట్ నిర్వాహకులు ఇలానే వ్యవహరించారి కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఈ రెస్టారెంట్‌పై ఫుడ్ సేఫ్టీ అధికారులు పలుమార్లు తనిఖీలు చేయగా.. నివ్వెరపోయే దారుణాలు చోటు చేసుకున్నాయన కస్టమర్లు చెబుతున్నారు. అయినప్పటికీ అధికారులు కూడా చూసీ చూడనట్లు వదిలేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.