• రక్షించిన మేస్త్రి చల్లా కామేశ్వర రావు చికిత్స పొందుతూ మృతి
• మరో మేస్త్రి పడిశాల ఉపేందర్ కోసం సహాయక చర్యలు ముమ్మరం
• ఇద్దరే చిక్కుకున్నట్లు సమాచారముందంటున్న జిల్లా అధికార్లు
• ఇంకా కూలీలు ఉండే అవకాశముందంటున్న స్థానికులు
• పోలీసుల అదుపులో ఇంటి యజమాని శ్రీపతి శ్రీనివాస్ ?
• యజమాని శ్రీపతి శ్రీనివాస్ కు రాజకీయ నేతల అండ ?
• బాధితులకు న్యాయం చేయాలంటూ భద్రాచలంలో ఆందోళనలు
భద్రాచలంలో కుప్ప కూలిన ఆరంతస్తుల భవన శిథిలాల్లో చిక్కుకున్న తాపీ మేస్త్రి చల్లా కామేశ్వర రావు ( కామేష్ ) మృత్యువాత పడ్డాడు. సహాయక బృందాలు గంటల తరబడి శ్రమించి, గురువారం అర్ధ రాత్రి దాటిన తర్వాత, సుమారు 2 గంటల సమయంలో శిథిలాల క్రింద చిక్కుకున్న కామేశ్వర రావును ప్రాణాలతో బయటకు తీశాయి. శిథిలాల నుండి బయటకు తీసే క్రమంలో అతని ఎడవ కాలును వైద్యుల సహాయంతో తొలగించినట్లు తెలుస్తోంది. తీవ్ర రక్త స్రావంతో బయట పడ్డ కామేశ్వర రావును వెంటనే భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ, ఆసుపత్రికి తీసుకెళ్లిన పది నిముషాల్లోనే అతను చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరో మేస్త్రి పడిశాల ఉపేందర్ శిథిలాల క్రింద చిక్కుకున్నట్లు భావిస్తున్న అధికార్లు సహాయక చర్యలను ముమ్మరం చేశారు.
విజయవాడ నుండి వచ్చిన రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, సింగరేణి రెస్క్యూ టీం, ఐటీసీ, అగ్ని మాపక సిబ్బంది ఈ సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. పోక్లైన్, జేసీబీ, గ్యాస్ కట్టర్లను ఉపయోగించి శిథిలాల్లో చిక్కుకున్న వారిని బయటకు తీసే ప్రయత్న చేస్తున్నారు. చిక్కుకున్న వారి ఆచూకీ తెలుసు కొనేందుకు పోలీసు జాగిలాలను కూడా ఉపయోగించారు. ప్రాధమికంగా అందిన, ఇంటి యజమాని ఇచ్చిన సమాచారం మేరకు, శిథిలాల్లో ఇద్దరే చిక్కుకున్నారని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్ చెప్పారు.
అయితే, స్థానికులు మాత్రం ఇంకా కూలీలు కూడా వుండే అవకాశం వుందంటున్నారు. అయితే, శిథిలాల తొలగింపు పూర్తయితే, శిథిలాల క్రింద చిక్కుకున్న వారి సంఖ్యపై స్పష్టత వస్తుంది. అందుకు మరి కొంత సమయం పట్టే అవకాశముంది. కాగా, అక్రమంగా ఆరు అంతస్తుల భవనం నిర్మించిన శ్రీపతి శ్రీనివాస్ ప్రస్తుతం పోలీసుల అదుపులో వున్నట్లు తెలుస్తోంది. దీన్ని పోలీసులు మాత్రం ఇంకా దృవీకరించ లేదు. శ్రీనివాస్ కు ఓ రాజకీయ నేత అండ దండలున్నాయని, ఆ అండతోనే నిబంధనలకు విరుద్ధంగా భవనాన్ని నిర్మిస్తున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. అందుకే, అక్రమంగా భవనం నిర్మిస్తున్నా, అధికార్లు నోటీసులు ఇచ్చి చేతులు దులుపు కున్నారు తప్ప, నిర్మాణాన్ని కూల్చి వేయలేదంటున్నారు.
న్యాయం కోసం ఆందోళనలు
ఇదిలా వుండగా, బాధిత కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ, భద్రాచలంలోని బ్రిడ్జి సెంటర్లో భవన నిర్మాణ కార్మికులు గురువారం ఉదయం ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైటాయించి ధర్నా చేశారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్మికుల ఆందోళనతో ప్రధాన రహదారిపై కిలో మీటరు మేర వాహనాలు నిలిచి పోయాయి. రంగంలోకి దిగిన పోలీసులు సర్ధి చెప్పడంతో ఆందోళనను విరమించారు. మరో వైపు బాధిత కుటుంబాలకు చెందిన కొందరు ఘటనా స్థలానికి వచ్చిన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కారును అడ్డగించారు. తమకు న్యాయం చేయాలని పట్టు బట్టారు. స్పందించిన కలెక్టర్ అందుకు హామీ ఇవ్వడంతో శాంతించారు.
ఇంకో వైపు, ఘటనా స్థలం వద్ద బాధిత కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున ఆర్ధిక సాయం అందించాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. బాధితులతో మాట్లాడి అండగా వుంటామని హామీ ఇచ్చారు. సీపీఎం, మాస్ లైన్ పార్టీల నేతలు సైతం ఇదే డిమాండ్ చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు మాత్రం 50 లక్షల పరిహారం చెల్లించి, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలంటున్నారు. ఇక సీపీఐ నాయకులు, ఘటనపై సమగ్ర విచారణ జరపాలని, బాధిత కుటుంబాలను ఆదుకొనేలా నివేదిక తయారు చేయాలని కోరుతున్నారు.
భవన నిర్మాణానికి ఎటువంటి పర్మీషన్ లేదు
•భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్
అయితే, భద్రాచలంలో కుప్ప కూలిన ఆరంతస్తుల భవన నిర్మాణానికి ఎటు వంటి పర్మీషన్ లేదని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ స్పష్టం చేశారు. తాపీ మేస్త్రి చల్లా కామేశ్వర రావును ఆసుపత్రికి తరలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గ్రామ పంచాయతీ అధికార్లు ఇప్పటికే ఈ భవన యజమానికి నోటీసులు ఇచ్చారని తెలిపారు. సంబంధిత అధికార్లు భవన నిర్మాణాన్ని ఆపే ప్రయత్నం చేసినప్పటికీ, యజమాని భవనాన్ని నిర్మిస్తూ పోయాడని, దాని ఫలితంగానే ఈ దుర్ఘటన జరిగిందన్నారు. ఈ ఘటనకు సంబంధించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని, భవిష్యత్ లో ఇటువంటి సంఘటనలు జరగకుండా చూస్తామని చెప్పారు.
సహజంగా అక్రమ నిర్మాణాలు జరుపుతున్న వారికి నోటీసులు ఇస్తామని, వారే వాటిని కూల్చి వేసుకొనే అవకాశం కూడా ఇస్తామన్నారు. నోటీసులు ఇచ్చిన తర్వాత, చాలా మంది కోర్టు స్టే తెచ్చుకొనే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. ఒక వేళ ఆ అవకాశం ఇవ్వకుండా కూల్చి వేస్తే, అధికార్లు చట్టానికి విరుద్దంగా చర్యలు తీసుకున్నారంటూ తమనే బ్లేమ్ చేస్తున్నారని, అందువల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. ప్రస్తుతం సంఘటనా స్థలం వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఇప్పటి వరకు చల్లా కామేశ్వర రావును బయటకు తీశామని, మరొకరి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇప్పటి వరకు తమ దగ్గర వున్న సమాచారం మేరకు శిథిలాల క్రింద ఇద్దరే చిక్కుకున్నారని, శిథిలాలను పూర్తిగా తొలగిస్తేనే ఎంత మంది వున్నది తెలుస్తుందని కలెక్టర్ చెప్పారు.