ఆమోదం తెలిపిన డిపిసి కమిటీ
నలుగురు జేసిలకు అదనపు కమిషనర్‌లుగా….
కిందిస్థాయి కేడర్‌లలోనూ సుమారుగా 40 మంది
పదోన్నతులకు మోక్షం
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
వాణిజ్యపన్నుల శాఖలో అధికారుల పదోన్నతికి డిపిసి ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలోనే నలుగురు జేసిలకు అదనపు కమిషనర్‌లుగా పదోన్నతి రానుండగా, కిందిస్థాయిలో పనిచేస్తున్న ఏసిటిఓ, డిసిటిఓ, సిటిఓ, అసిస్టెంట్ కమిషనర్‌లకు కూడా పదోన్నతి లభించనుంది. ఈ పదోన్నతులకు సంబంధించి చాలా ఏళ్లుగా పెండింగ్ ఉండడంతో ప్రస్తుతం వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారులు స్పందించారు. ఈ నేపథ్యంలోనే చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న పదోన్నతులకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. జేసి స్థాయి నుంచి అదనపు కమిషనర్‌లుగా పదోన్నతులు పొందిన నలుగురు అధికారులకు సంబంధించి సిఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలపగానే రెండు రోజుల్లో వారి పదోన్నతికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేస్తామని ఆశాఖ ఉన్నతాధికారులు తెలిపారు.
వీరితో పాటు ఏసిటిఓ, డిసిటిఓ, సిటిఓ, అసిస్టెంట్ కమిషనర్‌లకు సంబంధించి కొందరికి సోమవారం పదోన్నతులు రాగా, మరికొందరికి నేడు ఉత్తర్వులు జారీ చేస్తామని అధికారులు తెలిపారు. 9 మంది డిప్యూటీ వాణిజ్యపన్నుల అధికారులను సిటిఓలుగా పదోన్నతులు రాగా, ఏసిటిఓల నుంచి డిసిటిఓలుగా 22 మంది వరకు పదోన్నతులు లభించాయి. దీంతోపాటు సిటిఓ స్థాయి నుంచి అసిస్టెంట్ కమిషనర్‌గా ఐదుగురికి కూడా పదోన్నతులు లభించాయి. ఈ పదోన్నతుల్లో మల్టీజోన్ 1, మల్టీజోన్ 2కు చెందిన ఉద్యోగులు ఉన్నారు. మొత్తంగా సుమారుగా 40 మంది అధికారులకు ఈ పదోన్నతులు లభించినట్టు ఆ శాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. వీరితోపాటు జూనియర్ అసిస్టెంట్ కేడర్ నుంచి సీనియర్ అసిస్టెంట్‌లుగా, సీనియర్ అసిస్టెంట్ స్థాయి నుంచి ఏసిటిఓలుగా పదోన్నతులు లభించే అవకాశాలు ఉన్నాయని ఆ శాఖ అధికారులు తెలిపారు.