కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ విచారణ
ఐఏఎస్‌లను ప్రశ్నించిన ఘోష్ జ్యుడిషియల్కమిషన్
డీపీఆర్, డిజైనింగ్‌లో పాత్రపై ఆరా
బిల్లుల చెల్లింపులపై ఆర్థిక శాఖకు నోటీసులు
మేడిగడ్డ నిర్మాణమే పెద్ద తప్పు
విద్యుత్ అంశం, బరాజ్‌లపై విద్యుత్‌రంగ నిపుణుడు రఘు
కమిషన్ ఎదుట పవర్ పాయింట్ ప్రజంటేషన్
కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్లు, తమ్మడిహట్టి దగ్గర కాకుండా మేడిగడ్డ దగ్గర బ్యారేజీల అంశం, అక్కడ జియాలజికల్సర్వే వంటి విషయాల్లో ఉన్నతాధికారులుగా ఉండి ఏం పరిశీలన చేశారని, ప్రభుత్వం నుంచి వచ్చిన నివేదికల ప్రకారం మీరేం చేశారంటూ సీనియర్ ఐఏఎస్‌లు, రిటైర్డ్ ఐఏఎస్‌లను పీసీ ఘోష్ కమిషన్ ప్రశ్నించింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణంలో లోపాలు, అవకతవకలపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ సోమవారం దాదాపు 10మంది ఐఏఎస్‌లను విచారించింది. కమిషన్ ఎదుట స్మితా సబర్వాల్, రజత్ కుమార్, వికాస్ రాజ్, రామకృష్ణారావు, రాహుల్ బొజ్జా, ఎస్.కె.జోషి, కంచర్ల రఘు హాజరయ్యారు. ఇందులో పలువురు తాజా, మాజీ సీనియర్ ఐఏఎస్ అధికారులు ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుల నిర్మాణంలో కీలక నిర్ణయాలు, అమలు చేసిన విధానాలపై జస్టిస్ ఘోష్ కమిషన్ వారిని ప్రశ్నించింది. నిర్మాణ లోపాలపై కీలక ప్రశ్నలను చంద్రఘోష్ కమిషన్ వారికి సంధించింది. దీనిపై ఐఏఎస్ అధికారులు వివరణ ఇచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రాజెక్టులపై తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలు తీరు తదితర వివరాలను కమిషన్‌కు వివరించారు.
ప్రధానంగా నిర్మాణ లోపాలు, బిల్లుల చెల్లింపులు, నివేదికల ఆధారంగా ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలిసింది. అయితే, అప్పుడు ప్రభుత్వం చెప్పినట్లే తాము చేశామని, కొన్ని సలహాలు ఇచ్చినా పరిగణలోకి తీసుకోలేదని ఐఏఎస్అధికారులు.. కమిషన్ఎదుట వాపోయినట్లు సమాచారం. విచారణ అనంతరం ఇప్పటివరకు చెప్పిన వివరాలను అఫిడవిట్ రూపంలో వారం రోజుల్లోగా సమర్పించాలని కమిషన్ ఆదేశించగా.. విచారణకు పూర్తిగా సహకరిస్తామని ఐఏఎస్, మాజీ ఐఏఎస్‌లు చెప్పారు. అయితే, బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో మరింత గడువు కావాలని ప్రస్తుత ఫైనాన్స్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు కోరారు.
దీంతో ఆగస్టు 5లోపు అఫిడవిట్ సమర్పించాలని కమిషన్ ఆదేశించింది. విచారణకు స్మితా సబర్వాల్, రజత్ కుమార్, వికాస్ రాజ్, రామకృష్ణారావు, రాహుల్ బొజ్జా, కంచర్ల రఘు ప్రత్యక్షంగా హాజరు కాగా.. ఎస్.కె.జోషి మాత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. మాజీ సీఎస్ సోమేష్ కుమార్ నేడు జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఎదుట హాజరుకానున్నారు. ఐఏఎస్‌లను ప్రశ్నించిన కమిషన్.. అప్పటి ప్రభుత్వ నిర్ణయాలు, సంబంధిత అంశాలపై అధికారుల నుంచి కమిషన్ వివరాలు తీసుకున్నది. వారందరినీ కూడా అఫిడవిట్లు దాఖలు చేయాలని జస్టిస్ పీసీ ఘోష్ ఆదేశించారు.
బిల్లులు ఎలా..?
కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విధానపరమైన అంశాలపై దృష్టి సారించింది. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన విధానపర నిర్ణయాలు, అమలు తీరు, నిర్మాణం, సంబంధిత అంశాలపై అప్పటి అధికారుల నుంచి కమిషన్ వివరాలు సేకరిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ పై ఇప్పటికే ఇంజినీరింగ్ అధికారులు, ఇరిగేషన్ శాఖ నుంచి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా కమిషన్ విచారణలో ఇప్పటి నుంచి కీలక అధికారులు హాజరయ్యారు.
ఈ నేపథ్యంలోనే పలువురు ఐఏఎస్ ల నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సోమవారం వివరణ కోరింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలతోపాటు పంపుహౌసులపై విచారణ నిర్వహిస్తున్న కమిషన్ మొత్తం 10 మందికి నోటీసులు పంపంచింది. వీరిలో పలువురు రిటైర్డ్ ఐఏఎస్‌లు ఉండగా.. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం నుంచి ఇప్పటి వరకు నీటిపారుదల, ఆర్థిక శాఖలలో కీలక విధులు నిర్వహించిన వారు సోమ, మంగళవారాల్లో హాజరు కావాలని సమాచారం అందించింది. ఈ నేపథ్యంలోనే సోమవారం పలువురిని విచారించింది. ప్రధానంగా బిల్లుల చెల్లింపులపైనా ఆర్థిక శాఖలోని అధికారులను ప్రశ్నించింది.
మేడిగడ్డ వద్ద నిర్మాణమే పెద్ద తప్పు: విద్యుత్ శాఖ ఇంజినీర్ రఘు
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు తలపెట్టిన తుమ్మడిహట్టిని కాదని, మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ఎత్తిపోతలు చేపట్టడమే ప్రధాన తప్పు అని విద్యుత్ శాఖ ఇంజినీర్ కె.రఘు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని ఆనకట్టలపై విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరైన ఆయన, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రాజెక్టు మార్పు వల్ల రాష్ట్ర ప్రజలపై చాలా భారం పడిందని, ప్రతి ఏటా నిర్వహణ కూడా భారమే అని వివరించారు. ప్రాణహిత – చేవెళ్ల మార్పు, మూడు బ్యారేజీల నిర్మాణం, నాణ్యత అంశాలు, పంప్ హౌస్‌లు మునక గురించి వివరించినట్లు తెలిపారు. ప్రాజెక్టు మార్పు వల్ల తెలంగాణ ప్రజలపై చాలా భారం పడిందని, ప్రతి ఏటా నిర్వహణ కూడా భారమే అని వివరించారు. మార్పుతో రెండు లక్షల ఎకరాల ఆయకట్టు కోల్పోయామని, వేల ఎకరాలు ప్రతి ఏటా ముంపునకు గురవుతోందని రఘు వివరించారు.
నిబంధనలకు విరుద్ధంగా కొన్ని చెల్లింపులు
డీపీఆర్ ఆమోదానికి ముందే బ్యారేజీల నిర్మాణంతో డిజైన్లలో లోపాలు వచ్చాయని, బ్యారేజీ స్థలాల ఎంపికలో కూడా చాలా లోపాలు ఉన్నాయని విద్యుత్ నిపుణుడు రఘు అన్నారు. ఈపీసీ ఒప్పందం ప్రకారం ప్రక్రియ జరగలేదని, లోపాలు చాలా ఉన్నాయని కమిషన్ ముందు వివరించారు. కొంతమంది కాంట్రాక్టర్లకు నిబంధనలకు విరుద్ధంగా కొన్ని చెల్లింపులు చేసినట్లు చెప్పారు. 2019లో బ్యారేజీలు పూర్తయ్యాక నిర్వహణ చేపట్టలేదని, అందుకే దెబ్బతిన్నాయని అభిప్రాయపడ్డారు. పంప్ హౌస్‌లను నదీ మట్టం కంటే చాలా దిగువన నిర్మించారని, దీంతో మేడిగడ్డ, అన్నారం పంప్ హౌస్‌ల్లో పంపులు మునిగినట్లు రఘు కమిషన్ ముందు వివరించారు. ప్రాజెక్టుల్లో సమస్యలు ఉండవని తాను చెప్పడం లేదని, సమస్యలకు గల కారణాలు ముఖ్యమని అన్నారు. అంచనాలు తప్పుగా వేయడం, డిజైన్లలో లోపాలు ఉన్నాయన్న రఘు, త్వరగా పూర్తి చేయాలన్న ఉద్దేశంతో ఇంజినీర్లకు సమయం ఇవ్వలేదని అన్నారు.