నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. ఈ సినిమాకు యదు వంశీ దర్శకుడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ఆగస్ట్ 9న వంశీ నందిపాటి విడుదల చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో గురువారం నాడు నిర్మాత నిహారిక కొణిదెల మీడియాతో ముచ్చటించారు. ఆమె చెప్పిన సంగతులివే..
* కథ విన్నాక ఈ చిత్రంలో నా పేరు మాత్రం కనిపించాలని అనుకున్నాను. ఫీచర్ ఫిల్మ్ చేయాలని అనుకున్న టైంలో అంకిత్ ద్వారా ఈ కథ నా దగ్గరకు వచ్చింది. మ్యూజిక్‌తో పాటుగా ఈ కథను నాకు వినిపించారు. అనుదీప్ గారు అప్పటికే మ్యూజిక్ చేసేశారు. సిటీలో పుట్టి పెరిగిన నేను జాతర ఎక్స్‌పీరియెన్స్ చేయలేదు. కానీ నాకు కళ్లకు కట్టినట్టుగా వంశీ చూపించాడు. నెరేషన్ అద్భుతంగా ఇచ్చాడు. ఓటీటీలో అయినా థియేటర్లో అయినా సినిమా మేకింగ్ ప్రాసెస్ ఒకటే. అందుకే ఈ కథను ఎలాగైనా నిర్మించాలని ఫిక్స్ అయ్యా.
* పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే జాతర చుట్టూ ఈ కథను రాసుకున్నాడు. మూడు తరాలను చూపించేలా ఈ కథ ఉంటుంది. వంశీ గారి పర్సనల్ ఎక్స్‌పీరియెన్స్‌లు కూడా ఇందులో ఉన్నాయి. వంశీ గారు పవన్ కళ్యాణ్ గారికి అభిమాని. 2019 ఎన్నికల ప్రచార టైంలో జరిగిన విషయాలను కూడా ఇందులో తన స్టైల్లో, కాస్త సెటైరికల్‌గా చూపించారు.
* ముద్దపప్పు ఆవకాయ్ టైంలో నేను నటించాను. ఆ టైంలో నేను అందులో డబ్బులు కూడా పెట్టాను. అదే ప్రొడక్షన్ హౌస్ అయింది. కావాలని నిర్మాత అవ్వలేదు. అలా అయిపోయానంతే. నాకు నటించడమే ఇష్టం.
* పదకొండు మంది అబ్బాయిల కారెక్టర్లో నన్ను నేను ఊహించుకొన్నాను. సినిమాను చూసే ప్రతీ ఆడియెన్ ఏదో ఒక కారెక్టర్‌తో ట్రావెల్ చేస్తారు. ప్రతీ ఒక్కరూ సినిమాకు కనెక్ట్ అవుతారు.
* టాలెంట్ మాత్రమే కాదు.. క్రమశిక్షణ ఉంటేనే ఇండస్ట్రీలో ఎదుగుతారని చిరంజీవి గారు చెబుతుంటారు. ఆ క్రమశిక్షణ నేను వంశీలో చూశాను. ఆయన సినిమా కోసం చాలా కష్టపడ్డారు.
* మా నాన్నకి కూడా వంశీ నెరేషన్ ఇచ్చారు. మామూలుగానే మా నాన్నకి నచ్చక పోతే వెంటనే లేచి వెళ్లిపోతారు. కానీ వంశీ చెప్పిన కథ మా నాన్నకి కూడా చాలా నచ్చింది.