యాదాద్రి భువనగిరి జిల్లాలోని రామన్నపేటలో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. అదానీ అంబుజా సిమెంట్ కంపెనీ ఏర్పాటుకు వ్యతిరేకంగా స్థానికులు ఆందోళనకు దిగారు. సిమెంటు ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం నిర్వహిస్తున్న ప్రజాభిప్రాయ సేకరణను ప్రజలు అడ్డుకున్నారు. పోలీసుల నిర్బంధాలను దాడుకు ప్లకార్డులు, నల్లజెండాలతో నిరసనకు దిగారు. పర్యావరణవేత్తల పేరుతో అంబుజాకు అనుకూలంగా మాట్లాడేందుకు ఇతర ప్రాంతాల నుంచి వొచ్చినవారిని తరిమికొట్టారు. పరిశ్రమ పేరుతో తమ బతుకులను బుగ్గి చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. కంపెనీ నిర్మాణానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒపుకునేది లేదని తేల్చిచెబుతున్నారు. కాగా, కంపెనీని ఏర్పాటును బీఆర్‌ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఎట్టిపరిస్థితలో పరిశ్రమ నిర్మాణాన్ని అడ్డుకుంటామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ ప్రజా ప్రతినిధులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు.
నల్లగొండలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డిని హౌస్ అరెస్టు చేశారు. మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను నకిరేకల్‌లో అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఇక మాజీ ఎమ్మెల్యేలు గ్యాదరి కిశోర్, రవీంద్రకుమార్ నాయక్‌లను గృహ నిర్బంధంలో ఉంచారు. రామన్నపేటలో గతంలో లాజిస్టిక్ పార్కు, డ్రైపోర్టు కోసం రైతుల నుంచి కొనుగోలు చేసిన భూముల్లో కాలుష్య కారక సిమెంట్ కంపెనీ ఏర్పాటుకు అదాని చర్యలు ప్రారంభించారు. 65.5 ఎకరాల్లో కంపెనీ స్థాపనకు రూ.1,400 కోట్లు ఖర్చు చేయనున్నారు. స్టాండ్ అలోన్ సిమెంట్ గ్రైడింగ్ యూనిట్‌లో ఏటా 6.0 ఎంఎంటీపీఏ సిమెంట్ ఉత్పత్తికి ప్రతిపాదనలు చేశారు. ఈ నెల 23న ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనున్నారు. సిమెంట్ పరిశ్రమను వ్యతిరేకిస్తున్న ప్రజలు ప్రభుత్వం, అదానీని తప్పు బడుతూ పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. పరిశ్రమ స్థాపన నిర్ణయాన్ని ఉపసహించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.