* కాంగ్రెస్‌కు కొత్త ఊపు
* పదేండ్ల తర్వాత 100 సీట్లు దాటిన హస్తం
2014 నుంచి అనేక ఎదురుదెబ్బలు తింటున్న కాంగ్రెస్ పార్టీకి 2024 లోక్‌సభ ఎన్నికలు కొత్త ఊపుని ఇచ్చాయి. వరసగా పరాజయాలు, నేతలు ఇతర పార్టీలోకి వలస వెళ్లడంతో ఆ పార్టీ డీలా పడిపోయింది. అయితే, రాహుల్ గాంధీ ‘‘భారత్ జోడో యాత్ర’’లు కాంగ్రెస్‌కి కొత్త వైభవాన్ని తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. 2024 ఎన్నికల రిజల్ట్స్‌లో కాంగ్రెస్ 100 స్థానాల మార్కుని చేరుకుంది.
2014లో కేవలం 44 సీట్లు, 2019లో కేవలం 52 స్థానాలు సాధించిన కాంగ్రెస్, ఇప్పుడు 100కి పైగా స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తోంది. ప్రస్తుతం ఓట్ల లెక్కింపులో ఎన్డీయే కూటమి 290కి పైగా స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తుండగా, ఇండియా కూటమి 220 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. ముఖ్యంగా బీజేపీకి కంచుకోటలుగా ఉన్న రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఇండియా కూటమి సత్తా చాటుతోంది. మరోవైపు మహారాష్ట్రలో కూడా చాలా స్థానాల్లో లీడింగ్‌లో ఉంది.