Friday, April 18, 2025

మల్లుర‌వికే నాగ‌ర్‌క‌ర్నూలు ఖ‌రారు

* రెండో జాబితాలో 5 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్
* పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణ, సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్,
* మల్కాజిగిరి నుంచి సునీతా మహేందర్ రెడ్డి,
* నాగర్ కర్నూల్ నుంచి మల్లు రవి, చేవెళ్ల నుంచి గడ్డం రంజిత్ రెడ్డిల పేర్లు ఖరారు

కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థుల రెండో జాబితాను ఎట్టకేలకు గురువారం రాత్రి ఏఐసిసి విడుదల చేసింది. అయితే ఏఐసిసి విడుదల చేసిన జాబితాలో 5 పేర్లను మాత్రమే విడుదల చేయడంతో మిగతా స్థానాలపై ఉత్కంఠ మరింత పెరిగింది. అయితే ఏఐసిసి విడుదల చేసిన జాబితాలో పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణ, సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్, మల్కాజిగిరి నుంచి సునీతా మహేందర్ రెడ్డి, నాగర్ కర్నూల్ నుంచి మల్లు రవి, చేవెళ్ల నుంచి గడ్డం రంజిత్ రెడ్డిల పేర్లను ఖరారు చేస్తూ ఏఐసిసి జనరల్ సెక్రటరీ కెసి వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. మొదటి విడతలో నలుగురు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ, రెండో విడతలో 5 సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది.

హోలీ తరువాత మూడో జాబితా
మరో 8 సీట్లకు సంబంధించి అభ్యర్థుల జాబితాను ప్రకటించే విషయంలో ఆలస్యం చేస్తుండడంతో ఆశావహులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆశావహులు ఢిల్లీలో ఏఐసిసి పెద్దలను ప్రసన్నం చేసుకోవడానికి క్యూ కడుతున్నారు. ఈ క్రమంలోనే 8 మంది అభ్యర్థుల జాబితాను (కాంగ్రెస్ మూడో జాబితాను) హోలీ తర్వాతే ప్రకటించే అవకాశం ఉన్నట్టు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటుండడంతో టికెట్‌లు ఆశిస్తున్న ఆశావహులు జాబితా కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఫ్లాష్ సర్వేల పేరుతో పలు దఫాలుగా క్షేత్రస్థాయి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్న అధిష్టానం ఈ మేరకు గెలిచే అభ్యర్థులను బరిలోకి దింపేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతోందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. అందులో భాగంగా మూడో జాబితాను పెండింగ్‌లో ఉంచడం వెనుక వ్యూహాత్మకంగా వ్యవహారిస్తోందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.

భువనగిరి, ఖమ్మం మినహా మిగతా చోట్ల..
మొదటి జాబితాలో జహీరాబాద్, నల్లగొండ, మహబూబాబాద్, మహబూబ్‌నగర్ స్థానాలకు, రెండో జాబితాలో పెద్దపల్లి, సికింద్రాబాద్, మల్కాజిగిరి, నాగర్ కర్నూల్, చేవెళ్ల స్థానాలకు అభ్యర్థులను ప్రకటించించిన కాంగ్రెస్ హైకమాండ్ మరో 8 స్థానాలపై సుదీర్ఘంగా కసరత్తు చేస్తున్నట్టుగా తెలిసింది. అయితే ఇందులో భువనగిరి, ఖమ్మం మినహా మిగతాచోట్ల అభ్యర్థుల విషయంలో ఏకాభిప్రాయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. వచ్చే సోమవారం (ఈనెల 25వ తేదీన) సీఈసీ సమావేశం నిర్వహించి అదే రోజున లేదా ఆ మరుసటి రోజున మూడో జాబితాను వెల్లడించే అవకాశముందని సమాచారం. ఇక భువనగిరి టికెట్ కోసం కోమటిరెడ్డి బ్రదర్స్ ఫ్యామిలీ, చామల కిరణ్ కుమార్ రెడ్డి, పున్నా కైలాశ్ నేత పోటీ పడుతుంటే, ఖమ్మం టికెట్ కోసం మంత్రి తుమ్మల తనయుడు తుమ్మల యుగంధర్, మరోమంత్రి పొంగులేటి సోదరుడు ప్రసాద రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దీంతో ఈ రెండు స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక అధిష్టానానికి బిగ్ టాస్క్‌గా మారింది.

కాంగ్రెస్ వర్సెస్ బిజెపిల మధ్య పోటీ
కాంగ్రెస్ పార్టీ పెండింగ్ స్థానాలను ప్రకటించకపోవడం వెనుక అభ్యర్థులపై ఆర్థిక భారం పడకూడదన్న ఆలోచన ఉందన్న చర్చ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ గెలుపు ధీమాతో ఉంది. బిఆర్‌ఎస్ రోజురోజుకు బలహీనపడుతుండటంతో కాంగ్రెస్ వర్సెస్ బిజెపిల మధ్య పోటీ అన్నట్లుగా రాజకీయం నడుస్తోంది. ఈ క్రమంలో ఇప్పటినుంచే అభ్యర్థులకు ఆర్థిక భారం లేకుండా వ్యూహాత్మకంగా వ్యవహారిస్తోందనే చర్చ జరుగుతోంది. అందులో భాగంగా గెలుపే లక్ష్యంగా 8 లోకసభ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక విషయంలో కాంగ్రెస్ పార్టీ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నట్టుగా సమాచారం. సామాజిక సమతుల్యత పాటిస్తూనే విజయం సాధించగలిగే ప్రజా బలం కలిగిన నాయకులకే టికెట్లను ఇచ్చే దిశలో కాంగ్రెస్ అధి నాయకత్వం ముందుకు వెళుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రజల్లో ఆదరణ కలిగిన నాయకులనే ఎన్నికల బరిలో దించాలని ఏఐసిసి భావించడంతో పాటు ఆ దిశగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వాన్ని సూచనలు చేస్తుందని, ఫైరవీలకు తావివ్వకుండా గెలుపు గుర్రాలకు అవకాశం ఇవ్వాలని ఏఐసిసి పేర్కొన్నట్టుగా తెలిసింది. రెండు రోజుల క్రితం జరిగిన సీఈసీ సమావేశంలో మరో 6 సీట్లలో ఇద్దరేసి అభ్యర్థులను ఎంపిక చేసినట్టుగా తెలిసింది. ఈ 6 సీట్లకు సంబంధించి ఈనెల 25వ తేదీన సీఈసీ సమావేశంలో చర్చించి అందులో నుంచి ఒక్కరిని ఎంపిక చేసే అవకాశం ఉన్నట్టుగా సమాచారం.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com