బీఆర్ఎస్ ప్రభుత్వానికి భిన్నమైన మార్పుతో కూడిన పాలన తెస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ సలహాదారులు, రిటైర్డు అధికారులు, ఉద్యోగుల కొనసాగింపులో మాత్రం గత ప్రభుత్వ బాటలోనే సాగుతుండటం చర్చనీయాంశమైంది. తాజాగా రాష్ట్ర నీటిపారుదల శాఖలో రిటైర్డు ఉద్యోగుల కొనసాగింపుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఉద్యోగ విరమణ అనంతరం కూడా కొనసాగుతున్న 72 మందిలో 38 మందిని తిరిగి కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. కొత్త ఏఈ, ఏఈఈల నియామకం పూర్తయ్యేవరకు ఈ 37 మందిని కొనసాగించనున్నట్లుగా పేర్కోంది. ఈ మేరకు గురువారం నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు. నీటిపారుదల శాఖలో ఎత్తిపోతల పథకాల సలహాదారు కె.పెంటారెడ్డి పదవీకాలాన్ని ప్రభుత్వం మరోసారి పొడిగించింది. నవంబర్ 15 వరకు కొనసాగించాలని నిర్ణయించింది.