-
పెరుగుతున్న ఒత్తిళ్లు…
-
పదవుల పంపకంపై కాంగ్రెస్ గురి
-
ఈనెలాఖరులోగా కొన్ని భర్తీ
-
స్థానిక సంస్థల తరువాత మరికొన్ని…..
-
సామాజిక సమీకరణాలతో పాటు సీనియర్‌లకు పదవులు
రోజు రోజుకు ఒత్తిళ్లు పెరుగుతుండడంతో పార్టీ కోసం పని చేసిన వారికి పదవులను కట్టబెట్టాలని కాంగ్రెస్ నిర్ణయించినట్టుగా తెలిసింది. పార్టీ అధికారంలోకి వచ్చిన 9 నెలలయ్యిందని ఇప్పటికైనా పదవులను భర్తీ చేయాలని కేడర్ ఒత్తిడి తెస్తుండడంతో త్వరితగతిన వాటిని పూర్తి చేయాలని కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం భావిస్తున్నట్టుగా సమాచారం. ప్రస్తుతం ఈ నెలాఖరులోగా కొన్ని పదవులను, స్థానిక సంస్థల ఎన్నికల తరువాత మరికొన్ని పదవులను భర్తీ చేసే అవకాశం ఉన్నట్టుగా కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అసెంబ్లీ సమావేశాలకు ముందే కొత్త పిసిసి అధ్యక్షుడి ఎంపికతో పాటు మంత్రివర్గ విస్తరణ, నామినెటేడ్ పదవుల పంపకం జరుగుతుందని అందరూ భావించారు. కానీ, సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఏకాభిప్రాయం కుదరకపోవడం, అసెంబ్లీ సమావేశాలు, సిఎం విదేశీ పర్యటన ఉండటంతో అది వాయిదా పడింది. రేవంత్ తన విదేశీ పర్యటన ముగించుకొని వచ్చి, మరుసటి రోజు స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్న తర్వాత సిఎం, పిసిసి హోదాలో పార్టీ కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొన్నా అది కూడా ముందుకుసాగలేదు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం పార్టీ పదవుల కోసం కాంగ్రెస్‌లో పోటీ పెరుగుతోంది.
కమిషన్ సభ్యుల నియామకంపై…..
పిసిసి అధ్యక్ష పదవితో పాటు ఏఐసిసి కార్యదర్శులు, వర్కింగ్, వైస్ ప్రెసిడెంట్‌లు, నామినెటేడ్ పదవులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, డైరెక్టర్‌ల పదవుల కోసం పలువురు నాయకులు పోటీ పడుతున్నారు. కొత్త పిసిసి పదవి కోసం ప్రస్తుత పిసిసి ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ, ఎంపి బలరాం నాయక్, ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్, పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్లు ప్రధాన పోటీ దారులుగా ఉండగా బిసిల వైపే అధిష్టానం మొగ్గు చూపినట్టుగా తెలిసింది. వీటితో పాటు మూడు కమిషన్‌ల నియామకంతో పాటు విసిల నియామకం పూర్తి చేసేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తున్నట్టుగా తెలిసింది. ఇప్పటికే బిసి, విద్య, రైతు కమిషన్ల చైర్మన్ల ఎంపిక పూర్తి కాగా సభ్యుల నియామకంపై కాంగ్రెస్ దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే విద్యా కమిషన్ చైర్మన్‌గా మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి, రైతు కమిషన్ చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే, కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి, బిసి కమిషన్ చైర్మన్‌గా పిసిసి సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్‌ల ఎంపిక పూర్తి చేసినట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వీటితో పాటు ఉన్నత విద్యామండలి చైర్మన్, విశ్వవిద్యాలయాల వైస్ చైర్మన్‌ల పదవుల భర్తీ కూడా పూర్తి చేయాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
పదవులకు అర్హత సామాజిక సమీకరణాలే
మొదటి విడతలో 37 మందికి వివిధ కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించిన పార్టీ రాష్ట్ర నాయకత్వం మరికొంత మందికి రెండో విడత కింద కార్పొరేషన్ చైర్మన్ల పదవులు ఇచ్చేందుకు సిద్దమవుతోంది. సామాజిక సమతుల్యత పాటించి ఈ పదవులు భర్తీ చేయాల్సి ఉంది. అదేవిధంగా ఎమ్మెల్యేలకు కూడా కొన్ని కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చే ఆలోచనలో పార్టీ ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా ఆర్టీసి, పౌరసరఫరాలు, మూసీ సుందరీకరణ కార్పొరేషన్ తదితర ముఖ్యమైన పదవులు ఎమ్మెల్యేలకు ఇస్తారన్న ప్రచారం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతోంది.
ఇదిలా ఉండగా వాటికంటే ముందు కమిషన్‌లను ఏర్పాటు చేయాలని యోచిస్తున్న పార్టీ నాయకత్వం వాటి కసరత్తులో కూడా వేగం పెంచినట్లు తెలుస్తోంది. బిసి కమిషన్‌ను అధిక జనాభా కలిగిన బిసి వర్గాలతో ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ప్రధానంగా ఇందులో మున్నూరు కాపు, యాదవ, గౌడ్, ముదిరాజులు లాంటి అత్యధిక జనాభా కలిగిన వారు చైర్మన్, సభ్యులు ఉండేటట్లు చూడాలని యోచిస్తోంది. అదేవిధంగా విద్యా కమిషన్ చైర్మన్‌గా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఐఏఎస్ మురళిని నియమిస్తే విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చే దిశలో పని చేయగలిగే వారిని సభ్యులుగా నియమించేందుకు కసరత్తు జరుగుతోంది.
సమాచార కమిషన్, హ్యూమన్ రైట్స్ కమిషన్‌లు సైతం….
రైతు కమిషన్ చైర్మన్‌గా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కోదండ రెడ్డి ఉండడంతో సభ్యులు అంతా కూడా వివిధ సామాజిక వర్గాలకు చెంది, వ్యవసాయంపై పట్టున్న వారిని ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. రైతును లాభాల్లోకి తీసుకొచ్చే దిశగా పంటల సాగులో మార్పులు తీసుకొచ్చేందుకు ఈ కమిషన్ పని చేయాల్సి ఉండడంతో అదే స్థాయిలో అవగాహన కలిగిన వారినే సభ్యులుగా నియమిస్తారని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ పదవులతో పాటు దాదాపు 15 విసి పదవులను కూడా భర్తీ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా సమాచార కమిషన్, హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా వేయాల్సి ఉండడంతో అందుకు అర్హులైన వారి కోసం పార్టీ అన్వేషణ చేస్తున్నట్లు సమాచారం.