రైతులంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి గౌరవం లేదని, అందుకే దాడులు, అక్రమ అరెస్టు పనులన్నీ రహస్యంగా చేయించి, ఇప్పుడు కెమెరాల ముందు దొరికిపోగానే అధికారులను బలిపశులను చేస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. నీ నిజ స్వరూపం రాష్ట్రంలోని పేద ప్రజలందరికీ తెలిసిపోయిందని తెలి పారు. భూమి ఇవ్వను అన్నందుకు గిరిజన రైతులను జైలులో పెట్టడం.. జైలులో వారిని చిత్రహింసలు పెట్టడం. వారి కుటుంబసభ్యులను అర్ధరాత్రి ఇండ్ల మీద దాడిచేసి భయపెట్టడం, బెదిరించడం.. నెల రోజులుగా వారికి చెయ్యని నేరానికి బెయిల్ కూడా రాకుండా అడ్డుపడటం.. గుండె జబ్బుతో ఉన్న పేషెంటుకు బేడీలు వేయించటం కూడా ప్రభుత్వానికి సరైనదే అనిపిస్తోందని కేటీఆర్ విమర్శించారు. చేసే దరిద్రపు పనులన్నీ రహస్యంగా చేయించి, ఇప్పుడు కెమెరాల ముందు దొరికిపోగానే అధికారులను బలిపశులను చేస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డిపై మండిపడ్డారు. నీ నిజ స్వరూపం రాష్ట్రంలోని పేద ప్రజలందరికీ తెలిసిపోయిందని తెలిపారు. ఇకనైనా క్షమాపణలు చెప్పి కేసులు రద్దు చేయాలని, రైతులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లగచర్ల ఘటనలో రిమాండ్ అయిన హీర్యానాయక్‌కు కంది జైలులోనే బుధవారం మధ్యాహ్నం స్వల్పంగా గండెనొప్పి వొచ్చింది. దీంతో జైలు వైద్యులు పరీక్షలు చేశారు.
అక్కడే ఈసీజీ తీసి చికిత్స కోసం బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు సంగారెడ్డి ప్రభుత్వ జనరల్ వైద్యశాలకు తరలించారు. సంగారెడ్డి దవాఖానలో ఈసీజీ ఇతర పరీక్షలు చేసిన వైద్యులు మందులు రాసి పంపించారు. బుధవారం రాత్రి మరోమారు హీర్యానాయక్‌కు గండెనొప్పి రావటంతో తిరిగి సంగారెడ్డి దవాఖానకే తీసుకురాగా వైద్యులు చికిత్స చేసి పంపించారు. గురువారం ఉదయం హీర్యానాయక్ గండెనొప్పితో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. జైలు సిబ్బంది అతడిని అంబులెన్స్‌లో కాకుండా జైలు వాహనంలోనే చేతికి బేడీలు వేసి సంగారెడ్డి ప్రభుత్వ దవాఖానకు తీసుకొచ్చారు. సూపరింటెండెంట్ డాక్టర్ అనిల్‌కుమార్ నేతృత్వంలో వైద్యులు అశోక్, మజీద్‌ఖాన్ ఈసీజీ, 2డీ ఈకో పరీక్షలు చేయగా ఆ సమయంలోనూ రైతుకు బేడీలు తీయలేదు.
పరీక్షలు ముగిసిన తర్వాత మెరుగైన చికిత్స కోసం పంజాగుట్టలోని నిమ్స్‌కు తరలించాలని సూపరింటెండెంట్, వైద్యులు నిర్ణయం తీసుకున్నారు. హీర్యానాయక్ చాలారోజులుగా ఛాతి నొప్పితో బాధపడుతున్నట్టు వైద్యులు తెలిపారు. 2డీ ఈకో పరీక్ష చేయగా గుండె బలహీనంగా ఉన్నట్టు గుర్తించామని చెప్పారు. సంగారెడ్డిలో కాథల్యాబ్ లేనందున నిమ్స్‌కు రిఫర్ చేయాలని నిర్ణయించినట్టు వివరించారు. అండర్ ట్రయల్‌లో ఉన్న ఖైదీలకు సంకెళ్లు వేయవద్దని గతంలో కోర్టులు చెప్పినా అవేమీ పట్టించుకోండా కంది సెంట్రల్ జైలు పోలీసులు హీర్యానాయక్‌కు సంకెళ్లు వేసి దవాఖానకు తరలించటం తీవ్ర విమర్శలకు దారితీసింది. జైలు అధికారుల తీరును గిరిజన, రైతు సంఘాలు తీవ్రంగా ఖండించాయి.