Thursday, December 12, 2024

ఇది ప్రజాపాలన కాదు.. ప్రజాపీడిత పాలన

కాంగ్రెస్‌ ఒక్క హామీని సక్కగా నిలబెట్టుకోలేదు: కేటీఆర్‌

కాంగ్రెస్‌ ‌పార్టీ ఎలాగైనా అధికారంలోకి రావాలని ఇష్టం వొచ్చినట్లు హామీలు ఇచ్చి ఇప్పుడు అమలు చేయటానికి నానా కారణాలు చెబుతుందని మాజీ మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. ఇది ప్రజాపాలన కాదు. ప్రజా పీడిత పాలన అని మాజీ మంత్రి కేటీఆర్‌ ‌మండిపడ్డారు. కాంగ్రెస్‌ ఏడాది పాలనలో ప్రజల వేదన అరణ్య రోదనగానే మిగిలిందని విమర్శిం చారు. రైతులను చెరబట్టారని, పేదల ఇండ్లు కూలగొట్టారని ధ్వజమెత్తారు. రైతుబంధు ఎత్తేశారని, రైతు బీమాకు పాతరేశారని, కేసీఆర్‌ ‌కిట్‌, ‌న్యూట్రిషన్‌ ‌కిట్‌ ‌మాయం చేశారని, అమ్మవొడిని ఆగం చేశారని దుయ్యబట్టారు.

నిరుద్యోగుల ఉసురు పోసుకున్నారని, ఏక్‌ ‌పోలీస్‌ అన్న పోలీసులను అణగదొక్కారని చెప్పారు. హామీల అమలు అడిగిన ఆడబిడ్డలు, ఆశాలను అవమానించారని మండిపడ్డారు. టీఎస్‌ ‌టీజీగా చేసి చార్మినార్‌, ‌కాకతీయ కళాతోరణాలను తొలగించారన్నారు. తెలంగాణ బిడ్డలు లాఠీలకు, తూటాలకు ఎదురొడ్డి ఆత్మబలిదానాలతో ఉద్యమిస్తున్నప్పుడు.. సమైక్యవాదుల పంచన చేరి వంచన చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార అహంకారంతో ఇప్పుడు ఏకంగా అమ్మనే మార్చారని విమర్శించారు. చరిత్రను చెరిపేస్తామన్న భ్రమలో తెలంగాణ ప్రజలను ఏమారుస్తాం అనుకుంటే పొరపాటేనని చెప్పారు. తెలంగాణ అన్నీ గమనిస్తున్నది, కాలంబు రాగానే కాటేసి తీరుతుందన్నారు.

ఆశా వర్కర్లకు కేటీఆర్‌ ‌పరామర్శ
పోలీసుల దాడిలో గాయపడి ఉస్మానియా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఆశావర్కర్లను బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌మంగళవారం పరామర్శించారు. ఎవరికీ భయపడవద్దని, మీకు మేం అండగా ఉన్నామని వారికి ధ్కెర్యం చెప్పారు. అందరి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో  కేటీఆర్‌ ‌మాట్లాడుతూ.. ఆశావర్కర్ల పట్ల కాంగ్రెస్‌ ‌ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. ఇచ్చిన హామీ మేరకు తమ వేతనాన్ని రూ.18 వేలకు పెంచాలని డిమాండ్‌ ‌చేస్తూ ఆశావర్కర్‌లు సోమవారం హైదరాబాద్‌లో ధర్నాకు దిగారన్నారు. ధర్నాలో ఉన్న ఆశావర్కర్లను చెదరగొట్టేందుకు పోలీసులు దురుసుగా ప్రవర్తించారని తెలిపారు. మహిళలు అన్న గౌరవం లేకుండా మగ పోలీసులు వారిపై దౌర్జన్యం చేశారని, చీరకొంగులు లాగి అసభ్యకరంగా ప్రవర్తించారని ఆరోపించారు.

అదానీ నిరసనలో కాంగ్రెస్‌ ‌ద్వంద్వ వైఖరి
అదానీ వ్యతిరేక నిరసనల్లో కాంగ్రెస్‌ ‌ద్వంద్వవైఖరి పాటిస్తోందని మాజీ మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. పార్లమెంట్‌లో ఒకలా, తెలంగాణ అసెంబ్లీలో మరోలా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. ఈ మేరకు ఎక్స్ ‌వేదికగా ట్వీట్‌ ‌చేశారు. ‘రాహుల్‌ ‌జీ ఇది ఎలాంటి వంచన..  పార్లమెంట్‌లో అదానీ ఫొటో ఉన్న టీషర్ట్ ‌ధరించడం మీకు సరైనదే అయితే.. మీ అడుగుజాడల్లో నడిచి తెలంగాణ అసెంబ్లీలో అదానీ రేవంత్‌ ‌వ్యవహారాన్ని బయటపెట్టడానికి మాకు ఎందుకు అనుమతి లేదు..? దీనికి సమాధానం చెప్పండి’ అంటూ కేటీఆర్‌ ‌నిలదీశారు. ఈ మేరకు రాహుల్‌.. ‌మోదీ అదానీ చిత్రాలతో ఉన్న టీషర్ట్‌లను ధరించిన ఫొటోలను ట్వీట్‌కు జతచేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ ‌వైరల్‌ అవుతోంది.

ప్ర‌దాన వార్త‌లు

అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తాం అన్న కేటీఆర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular