Monday, April 21, 2025

అభ్యర్థుల ఎంపికపై ఆచితూచి…

కాంగ్రెస్ వరంగల్ అభ్యర్థిగా కడియం కావ్యను ప్రకటించిన ఏఐసిసి
ఖమ్మం సీటుపై వీడని పీఠముడి..!
హైదరాబాద్, కరీంనగర్ స్థానాలపై ఏకాభిప్రాయం
త్వరలోనే పేర్లు వెల్లడి

ఇప్పటికే 13 మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం వరంగల్ అభ్యర్థిగా కడియం కావ్యను సోమవారం రాత్రి ప్రకటించింది. దీంతో మొత్తం 14 సీట్లకు అభ్యర్థులను ఏఐసిసి ప్రకటించినట్టయ్యింది. సోమవారం ఢిల్లీలో సీఈసీ సమావేశం కాగా, ఇందులో నలుగురు అభ్యర్థుల ఎంపికపై సుదీర్ఘంగా సభ్యులు చర్చించారు. ఢిల్లీలోని కాంగ్రెస్ ఏఐసిసి ప్రధాన కార్యాలయంలో అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో జరిగిన ఈ సమావేశానికి, సోనియా గాంధీ సహా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డిలు హాజరయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో అభ్యర్థులను ఆచితూచి ఎంపిక చేయాలని కాంగ్రెస్ అధిష్టానం భావించింది.

సోమవారం ఉదయం ఒకసారి, సాయంత్రం మరోసారి సీఈసీ సమావేశం జరగ్గా ఈ నేపథ్యంలోనే నాలుగు పెండింగ్ స్థానాల అభ్యర్థుల ఎంపికపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించినట్టుగా సమాచారం. అభ్యర్థుల ఎంపిక విషయంలో పార్టీ అధిష్టానం ఒక్కోనేత నుంచి అభిప్రాయాలను సేకరించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర నేతలు సూచించిన అభ్యర్థి గెలుపు ఓటములపై విశ్లేషణ అడిగి తెలుసుకున్నట్టుగా సమాచారం.ఈ నేపథ్యంలోనే వరంగల్ స్థానానికి కడియం కావ్యను ఎంపిక చేసినట్టుగా తెలిసింది. దీంతోపాటు హైదరాబాద్, కరీంనగర్ స్థానాలకు అభ్యర్థులను కూడా దాదాపు ఖరారు చేసినట్టుగా తెలిసింది. త్వరలోనే ఈ రెండు స్థానాల అభ్యర్థుల పేర్లను వెల్లడించే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అయితే ఖమ్మం అభ్యర్థి ఖరారు ఇంకా పెండింగ్‌లో ఉంచినట్లుగా తెలుస్తోంది. ఖమ్మం స్థానం అభ్యర్థిపై ఈ నెల 9న మరోసారి జరిగే సీఈసీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది.

ఇప్పటికే 13 మంది అభ్యర్థుల ప్రకటన
రాష్ట్రంలో ఇప్పటికే 13 స్థానాలకు, కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ అభ్యర్థులను ఖరారు చేసింది. వీరిలో ఆదిలాబాద్ నుంచి ఆత్రం సుగుణ, నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, మెదక్ నుంచి నీలం మధు, భువనగిరి నుంచి చామల కిరణ్‌కుమార్ రెడ్డిని బరిలోకి దించింది. అలాగే నాగర్‌కర్నూల్ కాంగ్రెస్ ఎంపి అభ్యర్థిగా మల్లు రవి, పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణ, సికింద్రాబాద్ అభ్యర్థిగా దానం నాగేందర్, మల్కాజిగిరి అభ్యర్థిగా సునీత మహేందర్ రెడ్డి, చేవెళ్ల అభ్యర్థిగా గడ్డం రంజిత్‌రెడ్డిలను ఏఐసిసి ఎంపిక చేసింది. ఇక తొలి జాబితాలో మహబూబ్ నగర్ నుంచి ఏఐసిసి కార్యదర్శి వంశీచంద్ రెడ్డి, జహీరాబాద్ నుంచి మాజీ ఎంపి సురేష్ షెట్కార్, నల్గొండ నుంచి కుందూరు రఘువీర్ రెడ్డి, మహబూబాబాద్ నుంచి కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్‌లను ఎంపిక చేసిన విషయం తెలిసిందే.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com