కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి
కాంగ్రెస్ అంటేనే రైతుల పక్షపాతి అని కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఆగష్టు 15వ తేదీన రుణమాఫీ పక్కా అంటూ ఆయన పేర్కొన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ మోడీ, కిషన్ రెడ్డిల అబద్దాలకు లెక్క లేదన్నారు. ఒక్కో రాష్ట్రానికి వెళ్లి, ఒక్కోలా మాట్లాడుతున్నారన్నారు. పదేళ్లలో తెలంగాణకు ఏం చేశారంటూ ఆయన ప్రశ్నించారు.
విభజన హామీలేమయ్యాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కరువు జిల్లాలకు నష్ట పరిహారంపై మోడీ ఇప్పటి వరకు స్పందించలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ లేఖ రాసినా మౌనం వహించారన్నారు. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ఉన్నా, రాష్ట్రానికి ఏం ఉపయోగం లేదన్నారు. వరదలు, కరువు వచ్చినా, కిషన్ రెడ్డి నోరు మెదిపే పరిస్థితి లేదన్నారు. అచ్చే దిన్ అంటూ పదేళ్లలో ప్రజలకు సచ్చే దిన్‌ను తీసుకువచ్చారంటూ ఆయన చురకలు అంటించారు.
నిత్యావసర వస్తువులు ధరలు పెంచేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు. మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. అవినీతి పరులను జైళ్లో వేస్తామని దొంగ మాటలు చెప్పి, పన్ను ఎగవేతదారులను దేశాలు దాటిస్తున్నారని ఆయన ఆరోపించారు. నల్లధనం పేదల అకౌంట్‌లో వేస్తామని ప్రకటించి మోసం చేశారన్నారు. వివిధ రకాల పన్నుల రూపంలో తెలంగాణ కేంద్రానికి రూపాయి చెల్లిస్తే, బిచ్చం ఇచ్చినట్లు కేవలం 43 పైసల రిటర్న్ ఇస్తున్నారన్నారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు, మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ హోదాను ఇప్పటి వరకు ప్రకటించలేదన్నారు. కేంద్ర బడ్జెట్‌లో ఉత్తరాది రాష్ట్రాలతో సమాన వాటా అందడం లేదన్నారు. ఇక 811 టిఎంసి కృష్ణ జలాల్లో సరైన వాటా ఎందుకు ఇవ్వడం లేదని ఆయన మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలకు ఇచ్చినట్లు ఐఐటీ, మెడికల్ కాలేజీలను తెలంగాణకు ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు.