తెలంగాణ కాంగ్రెస్ లో అలజడి నెలకొంది. ఆ పార్టీలోని పది మంది ఎమ్మెల్యేలు హైదరాబాద్ సమీపంలోని ఓ హోటల్‌లో రహస్యంగా భేటీ అయినట్లుగా తెలుస్తోంది. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి నేతృత్వంలో మంతనాలు జరిపినట్లుగా సమాచారం. మంత్రి పొంగులేటి తీరుపై ఈ పదిమంది ఎమ్మెల్యేల అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై ఎమ్మెల్యేలు సమాలోచనలు చేస్తున్నట్టు సమాచారం. పది మంది ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ కావడం ఇటు కాంగ్రెస్ లోనూ అటు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఈ పరిణామాలతో సీఎం రేవంత్ రెడ్డి కూడా అలర్ట్ అయినట్లుగా తెలుస్తోంది. అందుబాటులో ఉన్న నేతలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు సీఎం. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మంత్రులలో పాటుగా పలువురు ఎమ్మెల్యేలతో సీఎం భేటీ అవనున్నారు. ఈ భేటీలో ఎమ్మెల్సీ, స్థానిక ఎన్నికలతో పాటు ప్రభుత్వ, పార్టీ అంతర్గత వ్యవహారాలు, తాజా రాజకీయాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అధికారులెవరూ ఈ మీటింగ్‌కు రావొద్దని సీఎం రేవంత్ ఆదేశించినట్లుగా తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ లో ఏం జరుగుతుంది అనేది ఉత్కంఠగా మారింది.
ఎప్పుడు ఏం జరుగుతుందో
మరోవైపు ఇటీవల సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ పెట్టిన పోల్ అంశం కూడా రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఏ ప్రభుత్వం మీకు నచ్చిందని పోల్ పెడితే 70 శాతం బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా, 30 శాతం కాంగ్రెస్‌కు ఫేవర్‌గా ఓట్లు పడటంతో పార్టీలోని అగ్రనేతలకు మింగుడు పడటం లేదని సమాచారం. ఇదే అంశంపై మాజీ సీఎం. బీఆర్ఎస్ ఛీప్ కేసీఆర్ కూడా వ్యంగంగా స్పందించారు. రాజకీయాల్లో కేసీఆర్ మళ్లీ యాక్టివ్ అవ్వడం, ఫిబ్రవరి నెలాఖరులో భారీ సభకు ప్లాన్ చేయడం, ఇప్పుడు కాంగ్రెస్ లోని 10 మంది ఎమ్మెల్యేలు రహస్యంగా మీటింగ్ పెట్టడం పార్టీ లోని అగ్రనేతలను ఉక్కరిబిక్కిరి చేస్తున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.