గల్ఫ్ కార్మికుల సమస్యలపై సిఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి
గల్ఫ్ కార్మికుల సమస్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సిఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. గల్ఫ్ నుంచి వచ్చినవారికి ఉపాధి పథకాల్లో ప్రాధాన్యం ఇవ్వాలని జీవన్‌రెడ్డి ఆ లేఖలో కోరారు. కార్మికులు విదేశాల్లో మరణిస్తే రూ.5 లక్షలు ఆర్థిక సహాయం ఇవ్వాలని జీవన్ రెడ్డి ఆ లేఖలో సిఎంకు సూచించారు. కేరళ ప్రభుత్వం మాదిరిగా గల్ఫ్ కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.
రాష్ట్రానికి చెందిన దాదాపు 15 లక్షల మంది గల్ప్‌లో ఉపాధి పొందుతున్నారని జీవన్‌రెడ్డి అందులో పేర్కొన్నారు. ఒక్కొక్కరు ప్రతి నెలా పది వేలు స్వరాష్ట్రానికి పంపుతున్నా నెలకు రూ.1500 కోట్లు విదేశీ మారకద్రవ్యం రాష్ట్రానికి, దేశానికి వస్తుందన్నారు. అదే ఏడాదికి అయితే రూ.18 వేల కోట్లు విదేశీ మారకద్రవ్యం సమకూరుతుందని జీవన్ రెడ్డి ఆ లేఖలో తెలిపారు. గల్ఫ్ కార్మికులకు ప్రభుత్వం అండగా నిలవాలని సిఎంను ఆ లేఖలో జీవన్ రెడ్డి కోరారు.