Monday, November 18, 2024

కాంగ్రెస్‌లోని పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్నా

  • పార్టీలో అసంతృప్తిగా ఉన్నా
  • కాంగ్రెస్ నుంచి ఇంత అగౌరవం, అవమానం జరుగుతుందనుకోలేదు
  • పార్టీ ఫిరాయింపులకు పాల్పడకుండా నైతిక విలువలు పాటించాలి
  • ఎమ్మెల్యే, ఎంపిలు ఎవరైనా సరే ఫిరాయింపులకు పాల్పడితే తక్షణమే వారిపై అనర్హత వేటు పడాలి
  • పార్టీలో జరుగుతున్న పరిణామాలపై హైకమాండ్‌కు లేఖ రాశా కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

రాష్ట్ర కాంగ్రెస్‌లోని పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్నానని పార్టీలో అసంతృప్తితో ఉన్నానంటూ హై కమాండ్‌కు లేఖ రాశానని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. తీవ్ర మానసిక బాధతో హైకమాండ్‌కు ఈ లేఖ రాశానని ఆయన తెలిపారు. అసెంబ్లీ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను నమ్ముకున్న కాంగ్రెస్ నుంచి తనకు ఇంత అగౌరవం, అవమానం జరుగుతుందనుకోలేదని ఆయన వాపోయారు. రాహుల్ గాంధీ ఆలోచనలకు భిన్నంగా కెసిఆర్ అనుసరించినట్టే మనం కూడా ఫిరాయింపులకు పాల్పడుతున్నామని ఆయన మండిపడ్డారు. కొన్ని స్వార్థపూరిత శక్తులు పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి నెపంతో పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారని జీవన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ప్రత్యేక గుర్తింపు ఇస్తున్నామన్నారు.

పార్టీ ఫిరాయింపులకు పాల్పడకుండా నైతిక విలువను పాటించాలని ఆయన సూచించారు. సంఖ్యాబలంతో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉందని, ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మంచి మెజారిటీ ఇచ్చారని అయినా కూడా తాము పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నామని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ఆ 10 మంది ఎమ్మెల్యేలు లేకుంటే ప్రభుత్వం నడవదా? అని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపుదారులు కాంగ్రెస్ ముసుగు వేసుకోవడం తనకు బాధ కలిగిస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే, ఎంపిలు ఎవరైనా సరే ఫిరాయింపులకు పాల్పడితే తక్షణమే వారిపై అనర్హత వేటు పడాలని గతంలో తమ పార్టీ అధినేత రాహుల్ గాంధీ అన్నారని ఆయన గుర్తు చేశారు. ఆనాడు పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా దేశంలో ఒకే ఒక్క వ్యక్తి దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ మాత్రమే పోరాటం చేశారని ఆయన తెలిపారు.

ముఠా నాయకుడిగా పోచారం శ్రీనివాస్ రెడ్డి
పోచారం శ్రీనివాస్ రెడ్డి ఫిరాయింపులకు ముఠా నాయకుడిగా వ్యవహారిస్తున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ బి ఫారంతో గెలిచిన వాళ్ల మాదిరి వాళ్లు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఆధిపత్య పోరు కోసం తన అనుచరుడు గంగారెడ్డిని క్రూరంగా హత్య చేశారని జీవన్ రెడ్డి వాపోయారు. పోచారం అధ్యక్షతన ఫిరాయింపు దారులతో సిఎం రేవంత్, ఇన్‌చార్జీలు సమావేశం అవ్వడం, పార్టీలో, ప్రభుత్వంలో వారికే బాధ్యతలు ఇవ్వడం సరికాదన్నారు. హత్య కేసులో స్థానిక ఎమ్మెల్యే సంజయ్ పాత్ర ఉందని, తాను ఎక్కడా మాట్లాడలేదని ఆయన స్పష్టం చేశారు. హత్యకు పాల్పడిన బత్తిన సంతోష్ బలమైన బిఆర్‌ఎస్ కార్యకర్త అని మాత్రమే చెప్పానని ఆయన వివరించారు.

నిందితుడు సంతోష్‌పై అనేక కేసులు ఉన్నాయని జీవన్‌రెడ్డి ఆరోపించారు. ఎవరి అండదండలు చూసుకొని గంగారెడ్డిని హత్య చేశారని ఆయన ప్రశ్నించారు. అవసర మైతే సిఎం రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌లను కలిసి తన ఆవేదన తెలియచేస్తానని ఆయన తెలిపారు. పార్టీ విధానానికి అనుగుణంగానే తన ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సుస్థిరంగా ఉందని ఆయన అన్నారు. పార్టీ ఫిరాయింపుల వల్ల క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. పార్టీ ఫిరాయింపులను తాను జీర్ణించుకోలేకపోతున్నానని ఆయన తెలిపారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular