ఢిల్లీ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ ఎంపి మల్లు రవి
‘దేవుడు మీద ఒట్టేసి చెబుతున్నా’ అర్హులకే రుణ మాఫీ చేస్తామని కాంగ్రెస్ ఎంపి మల్లు రవి అన్నారు. రెండు లక్షల లోపు ఉన్న వారికే రుణాలు మాఫీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎవరికైనా రుణ మాఫీ కాకుంటే ఆ ఫిర్యాదులను పరిష్కారం చేస్తామన్నారు.
బిఆర్‌ఎస్ తరహాలో రియల్ ఎస్టేట్ భూములకు రుణమాఫీ చేయమని ఆయన తెలిపారు. బండి సంజయ్ మాటలు వింతగా ఉన్నాయని, కెటిఆర్‌కు పిసిసి పదవి అని బండి సంజయ్ అనడంలో అర్థం ఉందా?, కాళేశ్వరంపై విచారణ జరుగుతోందని, ఎవరికైనా చట్ట ప్రకారమే శిక్షలు పడతాయన్నారు.
తెలంగాణకు వెనుకబడిన ప్రాంతాల నిధుల కింద రూ.1800 కోట్లను కేంద్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అయిదేళ్ల నుంచి ఈ నిధులు పెండింగ్‌లో ఉన్నాయని, బిఆర్‌ఎస్ పదేళ్లలో రూ.20 వేల కోట్లను రుణమాఫీ చేస్తే, తమ ప్రభుత్వం రూ.31 వేల కోట్లను బడ్జెట్లో కేటాయించిందని ఆయన తెలిపారు. కొందరు రైతులకు రుణమాఫీ కాలేదన్న విషయం తమకు తెలుసని, రుణ మాఫీ ఫిర్యాదులపై కలెక్టర్ ఆఫీసులో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తున్నామని ఎంపి మల్లు రవి తెలిపారు.
అందరికీ రుణమాఫీ చేసేందుకు బడ్జెట్‌ను కేటాయించామన్నారు. బిజెపి జెండా కప్పుకొని చచ్చిపోతానని రేవంత్ రెడ్డి మోడీతో అన్నారని కెటిఆర్ చెప్పడం ఆయన పిచ్చికి పరాకాష్ట అని, కెటిఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఎంపి మల్లు రవి పేర్కొన్నారు.