Sunday, September 29, 2024

భూ భారతికి కసరత్తు… ధరణి స్థానంలో కొత్త చట్టం

తెలంగాణలో భూ సమస్యల పరిష్కారానికి ప్రస్తుతం ఉన్న రికార్డ్ ఆఫ్ రైట్స్‌-2020 చట్టం ఉపయోగపడదని రేవంత్ సర్కార్‌ భావిస్తోంది. ఈ చట్టం స్థానంలో కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకురావాలని నిర్ణయానికి వచ్చింది. దీనిపై మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
తెలంగాణ లో భూ సమస్యల పరిష్కారానికి రేవంత్‌ సర్కార్‌ కసరత్తులు చేస్తోంది. ప్రస్తుతం ఉన్న రికార్డ్ ఆఫ్ రైట్స్‌-2020 (ROR) చట్టం.. ఈ సమస్యల పరిష్కారానికి పనిచేయదని భావిస్తోంది.

ఆర్‌వోఆర్ చట్టాన్ని మొత్తానికే మార్చేయాలని ఓ నిర్ణయానికి వచ్చింది. అయితే ఈ పాత చట్టం స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకొచ్చేందుకు ముందడుగులు వేస్తోంది. ఇందుకోసం అనేక అంశాలను పరిగణలోకి తీసుకోని.. కొత్త రెవెన్యూ చట్టానికి రూపకల్పన చేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈ కొత్త చట్టానికి ఆమోదం తెలిపే బిల్లును తీసుకొస్తారనే రెవెన్యూ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది.

పాత చట్టం పనికిరాదు
బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ధరణి పోర్టల్‌ ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే దాన్ని అమల్లోకి తీసుకొస్తున్నప్పుడు అంతకుముందున్న పాత చట్టం స్థానంలో ఆవోఆర్ -2020 చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. ధరణి పోర్టల్‌ పునర్నిర్మాణం కోసం నియమించిన ప్రత్యేక కమిటీ ఈ చట్టాన్ని పరిశీలించింది. చివరికి ఈ చట్టం ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించదని.. దీనివల్ల ఇంకా కొత్త సమస్యలు వస్తున్నాయని అభిప్రాయానికి వచ్చింది.

కీలకమైన మార్పులు
ఈ కమిటీలోని నిపుణులు పాత చట్టంలో ఎలాంటి సవరణలు చేయాలో వాటి గురించి ప్రభుత్వానికి సిఫార్సులు చేశారు. లేకపోతే పూర్తిగా చట్టాన్ని రద్దు చేసి కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకురావాలని సూచించారు. దీంతో పాత చట్టంలో మార్పులు చేసే బదులు.. కొత్త చట్టాన్ని తీసుకురావడం మేలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే పాత చట్టంలోని పలు అంశాలను పరిగణలోకి తీసుకొని.. అసవరమైన కీలక మార్పులు చేస్తూ.. రికార్డ్ ఆఫ్ రైట్స్ -2024 చట్టాన్ని రూపొందించేలా అధికారులు కసరత్తులు చేస్తున్నారు. ఈ ముసాయిదా చట్టంలో న్యాయపరంగా అభిప్రాయాలను తీసుకొని రాష్ట్ర కేబినెట్‌ ఆమోదిస్తారు. ఆ తర్వాత జులైలో జరగనున్న బడ్జెట్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో దీనికి ఆమోదం పొందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న ఆవోఆర్ చట్టంలో ఎలాంటి మార్పులు జరుగుతాయనే దానిపై ఆసక్తి నెలకొంది. భూ సమస్యల పరిష్కారం కోసం.. పలు స్థాయిల్లోని అధికారులకు ఉండే అధికారాల వికేంద్రీకరణకు సంబంధించి కొత్త చట్టంలో క్లారిటీ రానుంది. అయితే కలెక్టర్లు, ఆర్డీవోలు, తహశీల్దార్లకు ఎలాంటి అధికారాలు ఇవ్వాలి.. ఆయా స్థాయిల్లో ఉన్న అధికారులు ఎలాంటి వాటికి బాధ్యత వహిస్తారనే దానిపై స్పష్టత రానుంది. అలాగే భూ రికార్డుల ప్రక్షాళన సందర్భంగా పాస్ పుస్తకాలు ఇవ్వకుండా పార్ట్‌-బీలో పెట్టిన 18 లక్షల ఎకరాలు.. సాదాబైనామాల కింద లావాదేవీలు జరిగి పాస్ పుస్తకాలు పొందని 9 లక్షల ఎకరాల భూములకు పరిష్కారం చూపించే దిశలో చట్టాన్ని తీసుకురానున్నట్లు సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular