- నారీన్యాయ్…!
- మహిళా ఓటర్లే లక్ష్యంగా కాంగ్రెస్ హామీలు
- పార్లమెంట్ ఎన్నికల వేళ ఏఐసీసీ ఐదు గ్యారంటీలు
టీఎస్, న్యూస్:మహిళా ఓటర్లే లక్ష్యంగా కాంగ్రెస్ వరాల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణలో ఆరు, కర్ణాటకలో ఐదు గ్యారంటీ హామీలతో ఆయా రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల్లోనూ అదే వ్యూహాన్ని అనుసరిస్తోంది. కానీ ఇది వరకు ప్రకటించిన గ్యారంటీల్లో మహిళలు, రైతులు, యువత కోసం సంక్షేమ పథకాలను ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం మహిళా ఓటర్లను మాత్రమే ఆకర్శించేలా నారీన్యాయ్ పేరిట ఐదు గ్యారంటీలు ప్రకటించడంపై రాజకీయ చర్చ మొదలైంది. ఈ మేరకు నారీన్యాయ్ పేరిట మహిళలకు ప్రకటించిన ఐదు గ్యారంటీలను ఏఐసీసీ చీఫ్ బమల్లికార్జున ఖర్గే ట్విటర్ లో పోస్ట్ చేశారు. ఇందులో కాంగ్రెస్ ఇస్తోన్న హామీలు- ప్రకటనలు మాత్రమే కావనీ.ఇచ్చిన హామీలను కచ్చితంగా నెరవేరుస్తామని తెలిపారు. 1926 నుంచి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ వస్తున్నామన్నారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడే ఈ పోరాటంలో కాంగ్రెస్ కు ఆశీస్సులు అందించి.. పార్టీని బలోపేతం చేయాలని కోరారు. ఇటు అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఈ ఐదు గ్యారెంటీలకు సంబంధించిన వివరాలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారు.
లోక్ సభ ఎన్నికల్లో నారీన్యాయ్ పేరిట కాంగ్రెస్ ఇచ్చిన ఐదు గ్యారంటీలివే..!
01. మహాలక్ష్మి పథకం కింద ప్రతి పేద కుటుంబంలోని ఒక మహిళకు ఏటా రూ.లక్ష నగదు నేరుగా వారి ఖాతాలోకి జమా చేస్తారు.
02. ఆదీ ఆబాదీ- పూరా హక్ పథకం కింద కేంద్ర ప్రభుత్వంలో చేపట్టే ఉద్యోగ నియామకాల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్లు కల్పిస్తారు.
03. శక్తి కా సమ్మాన్ పథకం కింద ఆశా వర్క ర్లు,అంగన్వాడీ కార్యకర్తలు,మధ్యాహ్న భోజన పథకంలో విధులు నిర్వర్తించే మహిళలకు నెలవారీ జీతంలో కేంద్రం ఇచ్చే వాటా రెట్టింపు చేస్తారు.
04. అధికార్ మైత్రీ పేరిట న్యాయపరమైన హక్కుల విషయంలో మహిళలను విద్యావంతులను చేసి, వారికి సాధికారత కల్పించేందుకు వీలుగా ప్రతి పంచాయతీలో ఒక అధికార్ మైత్రీ నియామకం చేపట్టనున్నారు.
05. ఉద్యోగం చేసే మహిళల కోసం సావిత్రీబాయి పూలే హాస్టళ్లు రెట్టింపు చేసి.. ప్రతి జిల్లాలో కనీసం ఓ హాస్టల్ ఏర్పాటు చేస్తారు.