Wednesday, November 20, 2024

సిఎం రేవంత్‌రెడ్డి నివాసంలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం

* సిఎం రేవంత్‌రెడ్డి నివాసంలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం
* పార్లమెంట్ సీట్ల ఎంపికపై చర్చ

సిఎం రేవంత్రెడ్డి నివాసంలో శుక్రవారం రాత్రి కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం అయ్యింది. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ హరీష్‌చౌదరితో పాటు మరో ఇద్దరు సభ్యులు సైతం ఇందులో పాల్గొన్నారు. వారితో పాటు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జీ దీపాదాస్ మున్షీ, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్ రెడ్డిలు ఉన్నారు. ముఖ్యంగా పార్లమెంట్ సీట్లకు సంబంధించి అభ్యర్థుల ఎంపికపై ఈ సమావేశంలో చర్చించినట్టుగా తెలిసింది. 17 నియోజకవర్గాలకు సుమారుగా 300లకు పైచిలుకు దరఖాస్తులు రావడంతో వాటిని టిపిసిసి ఇప్పటికే వడబోత చేపట్టింది. అందులో భాగంగానే మహబూబ్ నగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా వంశీచంద్ రెడ్డిని సిఎం రేవంత్ అభ్యర్థిగా ప్రకటించగా మిగతా 16 మంది అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఉత్కంఠగా మారింది. ఈ 16 సీట్లకు భారీగా ఆశావహులు ఫైరవీలు చేస్తుండడంతో ఇది అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలోనే మిగిలిన 16 సీట్లకు అభ్యర్థుల ఎంపికలో సునీల్ కనుగోలు సర్వేతో పాటు ఆయా నియోజకవర్గాల్లో ఆశావహుల బలాబలాల గురించి ఈ సమావేశంలో చర్చించినట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ హరీష్‌చౌదరి బలహీనంగా ఉన్న పలు నియోజకవర్గాల గురించి ఆరా తీసినట్టుగా తెలిసింది.

ఆయా నియోజకవర్గాల్లో కొత్త వారిని పార్టీలో చేర్చుకొని వారికి సీటును కేటాయిస్తే ఎలా ఉంటుంది, పాత వారిలో అభ్యర్థుల బలబలాలపై గురించి సిఎం రేవంత్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ దీపాదాస్ మున్షీని ఆయన అడిగి తెలుసుకున్నట్టుగా సమాచారం. త్వరగా అభ్యర్థుల ఎంపిక జరగాలని ఏఐసిసి అధిష్టానం ఆదేశించిన నేపథ్యంలో స్క్రీనింగ్ కమిటీ ఈ సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఇప్పటికే పలువురు పార్టీలో చేరిన వారితో పాటు చేరే వారి గురించి స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ దృష్టికి సిఎం రేవంత్, డిప్యూటీ సిఎం భట్టిలు తీసుకెళ్లినట్టుగా తెలిసింది. అయితే కొన్ని ప్రాంతాల్లో వారికి సీట్లను కేటాయిస్తే పార్టీ కచ్చితంగా గెలిచే అవకాశం ఉన్నట్టుగా వారు చైర్మన్‌కు సూచించినట్టుగా సమాచారం. దీంతోపాటు ఖమ్మం లేదా భువనగిరి నుంచి రాహుల్‌గాంధీ పోటీ చేసేలా ఒప్పించాలని వారు స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ హరీష్‌చౌదరితో పేర్కొన్నట్టుగా తెలిసింది.

5 నియోజకవర్గాలపై ఏకాభిప్రాయం..!

అయితే ఈ సమావేశంలో భాగంగా 5 నియోజకవర్గాల అభ్యర్థులపై సభ్యులంతా ఏకభిప్రాయం వ్యక్తం చేసినట్టుగా తెలిసింది. ఈ నియోజకవర్గాల్లో భాగంగా నాగర్‌కర్నూల్ నుంచి మల్లు రవి లేదా సంపత్, జహీరాబాద్ నుంచి సురేష్‌షెట్కార్, మహబూబాబాద్ నుంచి బలరాంనాయక్, పెద్దపల్లి నుంచి వివేక్ కొడుకు వంశీ, సికింద్రాబాద్ నుంచి బొంతు రామ్మోహన్, మల్కాజిగిరి నుంచి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి (అల్లు అర్జున్ మామ)ల అభ్యర్థిత్వంపై గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలిసింది. వరంగల్, నల్లగొండ, ఖమ్మం పార్లమెంట్ సీట్లకు అధికంగా పోటీ ఉన్న నేపథ్యంలో వాటిని ఏఐసిసికి అప్పగించాలని ఈ స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయించినట్టుగా తెలిసింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular