-
తిరుగుబావుటా..
-
టిక్కెట్ల కోసం కాంగ్రెస్ సీనియర్ల పట్టు
-
గాంధీభవన్ వేదికగా నిరసన గళం
-
నాగర్ కర్నూల్, ఖమ్మం టిక్కెట్లపై పెరుగుతోన్న ఒత్తిడి
-
రాజకీయ చర్చకు దారితీసిన వీహెచ్, మల్లురవి, సంపత్ కుమార్ ఆరోపపణలు
టీఎస్ న్యూస్ : పార్లమెంట్ ఎన్నికల్లో టిక్కెట్ల కోసం అధికార పార్టీ సీనియర్లు టీపీసీసీపై తిరుగుబావుటా ఎగురవేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్లు ఆశించి భంగపడ్డ కొందరు.. ఆ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమీ పాలైన ఇంకొందరు.. కేవలం లోక్ సభ టిక్కెట్టు కోసం ఎన్నికలకు దూరంగా మరి కొందరు ఇప్పుడు తమ తమ స్ధాయిల్లో ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మరోవైపు ఎంపీ టిక్కెట్టు కచ్చితంగా ఇచ్చి తీరాల్సిందేనంటూ ఆల్టీమేటం జారీ చేస్తున్నారు.
ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ అధికార ప్రతినిధి హోదాలో కొనసాగుతూ ఈ నెల 23న తన పదవికి రాజీనామా చేసిన సీనియర్ నేత మల్లురవి.. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి నాగర్ కర్నూల్ అభ్యర్ధిగా పోటీలో ఉంటానని జడ్చర్లలో సంచలన ప్రకటన చేశారు. ఎంపీ టిక్కెట్టుకు తన పదవి అడ్డువస్తుందనే రాజీనామా చేసినట్లు ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో జడ్చర్ల ఎమ్మెల్యే టిక్కెట్టు ఆశించిన తనకు అధిష్టానం నాగర్ కర్నూల్ ఎంపీ టిక్కెట్టు ఇస్తానని గతంలోనే హామీ ఇచ్చిందని కుండబద్దలు కొట్టారు. మరోవైపు.. అసెంబ్లీ ఎన్నికల్లో ఆలంపూర్ నుంచి పోటీ చేసి ఓటమీ పాలైన ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ఈ నెల 26న గాంధీభవన్ లో మీడియా సమక్షంలో సొంత పార్టీ తీరుపై తనదైన శైలీలో అసంతృప్తి వ్యక్తం చేశారు.
నాగర్ కర్నూల్ టిక్కెట్టు మల్లురవికి వస్తుందనడం కేవలం ప్రచారం మాత్రమే అన్నారు. తాను సైతం టిక్కెట్టు రేసులో ఉన్నానని చెప్పిన సంపత్ కుమార్ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ టిక్కెట్టు కచ్చితంగా తనకే వరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తనతో పాటు మరో 26 మంది ఆశావాహులు నాగర్ కర్నూల్ టిక్కెట్టు ఆశిస్తున్నారని చెప్పారు. వీరితో పాటు పీసీసీ మాజీ చీఫ్ వి.హనుమంతరావు సైతం టిక్కెట్టు కోసం గళం విప్పారు.ఈ నెల 26న గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం నుంచి పోటీలో ఉంటానని తేల్చి చెప్పేశారు.
పార్టీ కోసం తన కంటే ఎక్కువ కష్టపడ్డ వాళ్లు లేరనీ, తనకంటే ఎక్కువ తిరిగే నాయకుడు అసలు ఇండియాలో లేడన్నారు. అయినా తానేం తప్పు చేశాననీ తనను ఎందుకు పక్కన పెట్టారని వీహెచ్ అగ్రనేతలను ప్రశ్నించారు.పార్టీలో కొత్తగా వచ్చిన వారికి టిక్కెట్లు ఇస్తే తన లాంటి సీనియర్ల పరిస్థితి ఏంటనీ ప్రశ్నించారు. ఖమ్మంలో చాలా ఏండ్లుగా పని చేస్తున్నాన్న వీహెచ్.. ఖమ్మం ప్రజలపై జరిగిన ప్రతి అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేశాన్నారు. ఇప్పుడు ఖమ్మం క్యాడర్ తనను అక్కడి నుంచి పోటీ చేయాలని అడుగుతున్నారని చెప్పారు.
సీఎం రేవంత్ పై తనకు నమ్మకం ఉందని..ఆ టిక్కెట్టు కచ్చితంగా తనకే వస్తుందనే ధీమా ఉందన్నారు. మరోవైపు ఎమ్మెల్పీ టి. జీవన్ రెడ్డి సైతం నిజామాబాద్ నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు. ఖమ్మం ఎంపీ టిక్కెట్టు కోసం టీపీసీసీ సభ్యుడు నాగా సీతారాములు సైతం బీసీ కార్డును ప్రదర్శించి టిక్కెట్టు కోసం పైరవీ ముమ్మరం చేశారు. ఇదీలావుంటే ఇటీవల కొడంగల్ సభలో ప్రసంగించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఏఐసీసీ కార్యదర్శి వంశీచందర్ రెడ్డిని మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్ధిగా ప్రకటించడం వివాదస్పదంగా మారింది. సీఎంగా, టీపీసీసీ చీఫ్ గా అభ్యర్థులను ప్రకటించే అధికారం రేవంత్ కు ఉన్నప్పటికీ పార్టీలో తమతో చర్చించకుండానే ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారంటూ మిగతా సీనియర్లు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.