తెలంగాణ పోలీస్ బెటాలియన్లలో పనిచేసే కానిస్టేబుళ్లు చేస్తున్న ఆందోళనలపై పోలీస్ శాఖ గుర్రుగా ఉంది. విధులను బహిష్కరించడం, రోడ్ల పైకి వచ్చి ఖాకీలే ఆందోళన చేయడం తీవ్రమైన క్రమశిక్షణ ఉల్లంఘనగా పోలీస్ శాఖ భావిస్తోంది. ఈ పరిణామాన్ని ఏమాత్రం లైట్ తీసుకోవొద్దని పోలీసు శాఖ నిర్ణయించింది. పోలీసు శాఖలో పనిచేస్తూ జన జీవనానికి ఇబ్బంది కలిగేలా రోడ్లపై వొచ్చి ఆందోళన చేస్తున్న పోలీసులపై చట్టపరమైన, శాఖాపరమైన చర్యలకు పోలీస్ శాఖ సిద్ధమైనట్లు సమాచారం. పోలీస్ బెటాలియన్ కానిస్టేబుల్స్‌కు సెలవుల విషయంలో పాత పద్ధతిని అనుసరిస్తామని ఇప్పటికే చెప్పినప్పటికీ ఉద్దేశపూర్వకంగా ఆందోళన చేస్తున్నారని పోలీస్ శాఖ ఆగ్రహంగా ఉంది. ఈ క్రమంలో బాధ్యులపై తీవ్రమైన చర్యలకు పోలీస్ శాఖ సిద్ధమైంది.
శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా నిరసనలకు దిగిన కొంతమందిని పోలీస్ శాఖ ఇప్పటికే గుర్తించింది. కానిస్టేబుళ్ల ఆందోళన వెనుక ప్రభుత్వం అంటే గిట్టని కొన్ని రాజకీయ శక్తుల హస్తముందని పోలీస్ శాఖ అనుమానిస్తోంది. ఈ క్రమంలో బెటాలియన్ కానిస్టేబుళ్లు చేస్తున్న ఆందోళనపై తెలంగాణ డీజీపీ జితేందర్ తీవ్రంగా స్పందించారు. క్రమక్షశిణతో కూడిన ఫోర్స్‌లో ఉంటూ ఆందోళనలు చేయడం సరికాదన్నారు. ఒకే పోలీసు విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బెటాలియన్ పోలీసులు ఆందోళనకు దిగారు.
నిరసన కార్యక్రమాల్లో కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో డీజీపీ జితేందర్ శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. సెలవులపై పాత పద్ధతే అమలు చేస్తామని చెప్పినప్పటికీ మళ్లీ ఆందోళనలకు దిగడం సరికాదన్నారు. ఆందోళనల వెనుక ప్రభుత్వ వ్యతిరేక శక్తులు ఉన్నాయనే అనుమానం ఉందన్నారు. ఆందోళనలు చేస్తున్న వారిపై చట్టరీత్యా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. మన దగ్గర ఉన్న రిక్రూట్‌మెంట్ వ్యవస్థను అన్ని రాష్టాల్రు అమలు చేస్తున్నాయని ప్రకటనలో పేర్కొన్నారు.