‘రాష్ట్రపతి, గవర్నర్‌కు కోర్టులు గడువు ఎలా నిర్దేశిస్తాయి : ముర్ము 14 ప్రశ్నలు
బిల్లుల విషయంలో సుప్రీంకోర్టు ఇటీవల వెలువరించిన సంచలన తీర్పుపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము స్పందించారు. గవర్నర్‌తో పాటు రాష్ట్రపతికి గడువు విధించగా రాజ్యాంగంలో అలాంటి నిబంధన లేకపోవడంతో తీర్పు ఎలా ఇచ్చిందని సర్వోన్నత న్యాయస్థానాన్ని ప్రశ్నించారు. ఈ మేరకు 14 ప్రశ్నలు అడిగారు. తమిళనాడు శాసనసభ ఆమోదం తెలిపిన 10 బిల్లులను ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ ఎన్ రవి ఆమోదించకుండా తన వద్ద ఉంచుకోవడం సరికాదని కొద్ది రోజుల క్రితం సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. 415 పేజీల తీర్పును వెలువరించిన సర్వోన్నత న్యాయస్థానం, రాష్ట్రాలు పంపే బిల్లులను రాష్ట్రపతి/గవర్నర్ గరిష్ఠంగా మూడు నెలల్లోగా ఆమోదించడమో లేకుంటే తిప్పి పంపించడమో చేయాలని వ్యాఖ్యానించింది. అయితే బిల్లులను వెనక్కి తిప్పి పంపితే ఎందుకు ఎలా చేశారనే కారణాలు కూడా చెప్పాలని పేర్కొంది. అంతే కాదు గవర్నర్లు బిల్లులపై జాప్యం చేస్తుంటే సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని రాష్ట్రాలకు స్పష్టం చేసింది. గవర్నర్ల నిష్క్రియాపరత్వం న్యాయసమీక్ష పరిధిలోకి వస్తుందని తెలిపింది. రాజ్యాంగ అధికరణం 142 ద్వారా అటువంటి సంపూర్ణ అధికారం సుప్రీంకోర్టుకు ఉందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ముర్ము సుప్రీంను ప్రశ్నించారు.
==
రాష్ట్రపతి అడిగిన ప్రశ్నలు ఇవే!
==
రాష్ట్రపతితోపాటు గవర్నర్‌కు అసలు కోర్టులు గడువు ఎలా నిర్దేశిస్తాయి?
ఆర్టికల్ 142 కింద సుప్రీంకోర్టు రాష్ట్రపతి లేదా గవర్నర్ అధికారాలను తన సొంత అధికారాలతో ఎలా భర్తీ చేస్తుంది?
అత్యున్నత న్యాయస్థాన ప్లీనరీ అధికారాలను రాష్ట్రాలు దుర్వినియోగం చేస్తున్నాయా?
రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 కింద బిల్లును సమర్పించినప్పుడు గవర్నర్ ముందు ఉన్న రాజ్యాంగపరమైన ఎంపికలు ఏమిటి?
ఈ ఎంపికలను అమలు చేయడంలో గవర్నర్ మంత్రి మండలి సలహాకు కట్టుబడి ఉంటారా?
ఆర్టికల్ 200 కింద గవర్నర్ రాజ్యాంగ విచక్షణాధికారం ఉపయోగించడం న్యాయబద్ధమేనా?
ఆర్టికల్ 200 కింద గవర్నర్ చర్యలపై న్యాయ పరిశీలనపై ఆర్టికల్ 361 సంపూర్ణ నిషేధాన్ని విధిస్తుందా?
ఆర్టికల్ 201 కింద రాష్ట్రపతి రాజ్యాంగ విచక్షణాధికారం ఉపయోగించడం న్యాయబద్ధమేనా?
ఆర్టికల్ 201 కింద రాష్ట్రపతి విచక్షణాధికారం వినియోగించడానికి కోర్టులు విధానపరమైన అవసరాలను నిర్ణయించవచ్చా?
గవర్నర్ రిజర్వ్ చేసిన బిల్లులపై నిర్ణయం తీసుకునేటప్పుడు రాష్ట్రపతి ఆర్టికల్ 143 కింద సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని కోరాలా?
ఒక చట్టం అధికారికంగా అమల్లోకి రాకముందే గవర్నర్, రాష్ట్రపతి తీసుకునే నిర్ణయాలు న్యాయబద్ధంగా ఉంటాయా?
ఆర్టికల్ 142 ద్వారా రాష్ట్రపతి లేదా గవర్నర్ వినియోగించే రాజ్యాంగ అధికారాలను న్యాయవ్యవస్థ సవరించగలదా లేదా అధిగమించగలదా?
ఆర్టికల్ 200 కింద గవర్నర్ అనుమతి లేకుండా రాష్ట్ర చట్టం అమలులోకి వస్తుందా?
సుప్రీంకోర్టులోని ఏదైనా బెంచ్ ముందుగా ఒక కేసులో గణనీయమైన రాజ్యాంగ వివరణ ఉందో లేదో నిర్ణయించి, ఆర్టికల్ 145(3) కింద ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్‌కు సూచించగలరా
ఈ మొత్తం 14 ప్రశ్నలను రాజ్యాంగంలోని 143 ఆర్టికల్ కింద ఉన్న ప్రత్యేక అధికారాలను వినియోగించుకుని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సంధించారు. వాటిపై తమ అభిప్రాయాలను కూడా తెలియజేయాలని సుప్రీంకోర్టును అడిగినట్లు సమాచారం. దీంతో సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ త్వరలోనే రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.