పది నెలల్లోనే భారీ నియామకాలు
జాబ్ క్యాలండర్‌తో నిరంతరం ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్
రాష్ట్రంలో నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేరుతున్నాయి. ప్రభుత్వం పది నెలల్లోనే భారీగా నియామకాలను చేపడుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ప్రక్షాళన చేసింది. అప్పటివరకు పెండింగ్‌లో ఉన్న పరీక్షల ఫలితాలకు ఉన్న అడ్డంకులను తొలిగించి ఫలితాలు విడుదల చేయటంతో పాటు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను అందించింది. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలండర్‌ను ప్రకటించింది.
క్యాలండర్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగ నియామకాలను నిరంతర ప్రక్రియగా నిర్వహించే వినూత్న విధానాన్ని అనుసరిస్తోంది. దీంతో అటు నిరుద్యోగులకు ఉద్యోగ ధీమాతో పాటు ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, ఖాళీలను పారదర్శకంగా ఉండే విధానాన్ని అమలు చేస్తోంది. గత ప్రభుత్వం పదేండ్లలో ఒకేసారి డిఎస్సీ వేసి 7,857 టీచర్ పోస్టులు భర్తీ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కేవలం పది నెలల వ్యవధిలోనే 11,062 పోస్టులతో మెగా డిఎస్సీ 2024 నిర్వహించింది. జూలైలో పరీక్షలు నిర్వహించి, రికార్డు వేగంతో సెప్టెంబర్ 30వ తేదీన ఫలితాలను వెల్లడించింది. ఎంపికైన అభ్యర్థులకు దసరాలోపు నియామక పత్రాలను అందించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.
15 రోజుల్లో 3,967 పోస్టుల నియామకానికి వరుసగా నోటిఫికేషన్‌లు
గడిచిన 15 రోజుల్లోనే మెడికల్ అండ్ హెల్త్ బోర్డు 3,967 పోస్టుల నియామకానికి వరుసగా మూడు భారీ నోటిఫికేషన్‌లను ప్రభుత్వం జారీ చేసింది. సెప్టెంబర్ 11వ తేదీన 1,284 ల్యాబ్ టెక్నిషియన్ పోస్టులతో పాటు సెప్టెంబర్ 18వ తేదీన 2,050 నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్ నర్స్) పోస్టులు, సెప్టెంబర్ 24వ తేదీన 633 ఫార్మాసిస్ట్ (గ్రేడ్ 2) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌లను ప్రభుత్వం విడుదల చేయటం విశేషం. ‘రెసిడెన్షియల్ సొసైటీల పరిధిలో టిజిటి, పిజిటి, జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ కాలేజీ లెక్చరర్ పోస్టులను కలిపి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 8,304 మందికి నియామక పత్రాలను అందించింది.
టిజిపిఎస్సీ ద్వారా 26 వివిధ నోటిఫికేషన్‌లను విడుదల చేయగా, ఇందులో దాదాపు 17,341 ఉద్యోగ నియామకాలు వివిధ దశల్లో ఉన్నాయి. వీటిలో ఇప్పటికే కొందరికీ నియామక పత్రాలను ప్రభుత్వం అందించింది. ఇటీవలే ఇరిగేషన్ విభాగంలో 687 మంది ఏఈఈలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందించారు. గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన గ్రూప్ 4 ఫలితాలను టిజిపిఎస్సీ వెల్లడించింది. 8,180 పోస్టుల నియామకాలకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతోంది.
అక్టోబర్ 21 నుంచి 27 వరకు మెయిన్స్ నిర్వహణకు ఏర్పాట్లు
సంక్షేమ శాఖలోని 581 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ల పోస్టులు, 53 డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టుల ఫలితాలు వెలువడ్డాయి. గతంలో పేపర్ లీకేజీతో గందరగోళంగా మారిన గ్రూప్ 1 పరీక్షను కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేసింది. 563 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ ఇచ్చింది. జూన్ 9వ తేదీన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించింది. 3,02,172 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకాగా, నెల రోజుల్లోగా జూలై 7వ తేదీన ప్రిలిమ్స్ ఫలితాలను ప్రకటించింది. అక్టోబర్ 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు మెయిన్స్ నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
షెడ్యూల్ ప్రకారం గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలను నిర్వహించనుంది. పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు అధ్వరంలో 2022లో నిర్వహించిన 16,929 మంది కానిస్టేబుల్ పోస్టుల ఫలితాలను కూడా గత ప్రభుత్వం వెల్లడించ లేకపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వారికి ఉద్యోగ నియామక పత్రాలను అందించింది. మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్‌మెంట్ బోర్డు 2022 డిసెంబర్‌లో నిర్వహించిన 7,094 మంది స్టాఫ్ నర్స్ ఉద్యోగాల ఫలితాలను కూడా అప్పుడు పెండింగ్‌లో పెట్టింది. ప్రస్తుతం ఫలితాలను విడుదల చేసిన కొత్త ప్రభుత్వం వారికి ఉద్యోగ నియామక పత్రాలను అందచేసింది.