Sunday, March 16, 2025

ఆరునెలల్లో నాటుసారా నిర్మూలనకు ఎక్సైజ్ అధికారుల నిరంతరం దాడులు

  • ఆరునెలల్లో నాటుసారా నిర్మూలనకు
  • ఎక్సైజ్ అధికారుల నిరంతరం దాడులు
  • ఆగష్టు31వ తేదీ నాటికి నాటుసారాను తుది ముట్టించడమే
  • లక్షంగా ముందుకు
  • 2014లో తెలంగాణలో 80,450 నాటుసారా కేసులు
  • 2024 సంవత్సరంలో 14,675 కేసుల నమోదు

ఈ పదేళ్లలో నాటుసారా తయారీ, విక్రయం అంతకంతకూ పెరిగింది. అయితే ఈ నాటుసారాను పూర్తిగా నిర్మూలించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దానిపై సమరభేరీ మోగించింది. ఈ నేపథ్యంలోనే ఆగష్టు31వ తేదీ నాటికి నాటుసారాను తుది ముట్టించడమే లక్ష్యంగా అధికారయంత్రాంగం చర్యలు చేపట్టాలని సిఎం రేవంత్ ఆదేశించడంతో పల్లె నుంచి పట్టణాల వరకు ఎక్సైజ్ అధికారులు స్పెషల్‌డ్రైవ్ చేపట్టారు. ఈ నేపథ్యంలోనే అబ్కారీశాఖ కమిషనర్ ఇ.శ్రీధర్, ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ విబి కమలాసన్ రెడ్డి దిశా,నిర్ధేశం మేరకు ఈ ఆరునెలల్లో నాటుసారా తయారీ, విక్రయంపై ఎప్పటికప్పుడు తండాలు, గ్రామాల్లో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. కరోనా సమయంలో మద్యం దొరక్కపోవడంతో మళ్లీ పల్లెల్లోనూ అక్కడక్కడ నాటుసారా తయారీ ప్రారంభమయ్యింది. అనంతరం దానిని చాలామంది కొనసాగించడంతో సారా విక్రయం, తయారీ అధికమయ్యింది. ప్రస్తుతం సిఎం ఆదేశాల మేరకు ఆగష్టు31వ తేదీ నాటికి నాటుసారాను రాష్ట్రంలో రూపుమాపడానికి ఎక్సైజ్ శాఖ అధికారులు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌లు ఎప్పటికప్పుడు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ దాడుల్లో భాగంగా నాటుసారా తయారీ, రవాణా, వినియోగంపై ఉక్కుపాదం మోపుతూనే మరో పక్క నాటుసారా తయారీకి అవసరమైన ముడిసరుకుల రవాణాను అడ్డుకోవడానికి ప్రత్యేక కార్యాచరణతో వారు ముందుకు వెళుతున్నారు. దీంతోపాటు బెల్లం, అలం అమ్మకాలు జరిపే వ్యాపారులపై కేసులు నమోదు చేయడం, వారి వాహనాలను సీజ్ చేయడంతో ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి అయ్యే బెల్లం రవాణా తగ్గుముఖం పట్టిందని ఎక్సైజ్ శాఖ గణాంకాలు పేర్కొంటున్నాయి.

2024లో 14,675 కేసులు నమోదు

2014లో తెలంగాణలో 80,450 నాటుసారా కేసులు నమోదు కాగా (35,159) మంది అరెస్టు అయ్యారు.  2015 సంవత్సరంలో 68,778 కేసులు నమోదు కాగా (68,778) మంది అరెస్టు అయ్యారు. 2016లో 15,422 కేసులు నమోదు కాగా, (15,422) మంది అరెస్టు, 2017లో 8,459 కేసులు నమోదు కాగా (8,501) మంది అరెస్టు అయ్యారు. 2018లో 9,836 కేసులు నమోదు కాగా (6,053) మంది అరెస్టు, 2019లో 8,439 కేసులు నమోదు కాగా (5,254) మంది అరెస్టు, 2020 సంవత్సరంలో 11,105 కేసులు నమోదు కాగా (8,603) మంది అరెస్టు, 2021లో 7,519 కేసులు నమోదు కాగా (5,033) మంది అరెస్టు, 2022లో 9,998 కేసులు నమోదు కాగా (10,328) మంది అరెస్టు, 2023 సంవత్సరంలో 22, 274 కేసులు నమోదు కాగా (12,703) మంది అరెస్టు, 2024 (జూన్ 30వ తేదీ నాటికి) 14,675 కేసులు నమోదు కాగా, (6,869) మంది అరెస్టు అయ్యారని ఎక్సైజ్ శాఖ గణాంకాలు పేర్కొంటున్నాయి. ఇక తెలంగాణలో 2014 నుంచి 2024 జూన్ 30వ తేదీ వరకు ఎక్సైజ్ శాఖ 2,56,955 కేసులను నమోదు చేసి 1,43,404 మందిని అరెస్టు చేసింది. దీంతో పాటు 30,59,678 లీటర్ల నాటుసారాను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకోవడంతో పాటు 7,38,88,496 లీటర్ల బెల్లం పానకాన్ని అధికారులు ధ్వంసం చేసి 15,089 వాహనాలను ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు.

ప్రజలతో తోడ్పాటుతో పూర్తి స్థాయిలో నిర్మూలిస్తాం
ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ విబి కమలాసన్ రెడ్డి

ఇలా ఎప్పటికప్పుడు సారాను పూర్తిగా నిర్మూలించడానికి ఎక్సైజ్ సిబ్బంది నిరంతరం కంటిమీద కునుకులేకుండా శ్రమిస్తున్నారు. మాకు ప్రజలు కూడా తోడ్పాటు అందించాలి. అందరి సహకారంతో ఆగష్టు 31వ తేదీ నాటికి సారా పూర్తిగా నిర్మూలించడానికి కృషి చేస్తాం. నాటుసారా వల్ల కలిగే నష్టాలపై అవగహన సదస్సులు నిర్వహిస్తూ ప్రజల్లో చైతన్యం నింపుతున్నాం. ఎక్సైజ్ యంత్రానికి పోలీసులు సైతం సహకారం అందిస్తున్నారు. నాటుసారా తయారీకి వినియోగించే బెల్లం, అలం రవాణాపై పూర్తి స్థాయిలో కట్టడి చర్యలు తీసుకున్నాం.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com