తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌లో వివాదాలు ముదిరి పాకానపడుతున్నాయి. దీంతో తెలంగాణ కాంగ్రెస్ ప్రస్తుతం అగ్ని పరీక్షను ఎదుర్కొంటోంది. అధికారం చేపట్టిన ఏడాది తర్వాత పార్టీలో విభేదాలు, అసంతృప్తి పెరిగిపోతుంది. మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య వివాదం నడుస్తుంటే.. తాజాగా ఇద్దరు అమాత్యుల మధ్య అంతర్యుద్ధం మళ్లీ పెరిగింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఓ మంత్రి.. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన మరో మంత్రి మధ్య చెలరేగిన గొడవ ఇప్పుడు పరస్పర ఫిర్యాదుల వరకు వెళ్లింది. అభివృద్ధి పనుల కాంట్రాక్ట్‌ల విషయంలో ఈ ఇద్దరు మంత్రులు పోటీ పడుతున్నారు. అయితే, సీఎం మాత్రం ఒక మంత్రికి సపోర్ట్‌గా ఉండటంతో ఆయనకే కాంట్రాక్ట్‌లు దక్కుతున్నాయంటూ మరో మంత్రి ఫైర్ అవుతున్నారు. ఈ వివాదం సాగుతుండగా.. ఇప్పుడు నల్గొండ జిల్లాకు చెందిన మంత్రి.. కాంట్రాక్టులు దక్కించుకున్న మంత్రి కంపెనీ పనులపై ఏకంగా విజిలెన్స్‌కు ఫిర్యాదు చేయించాడు. తన కంపెనీ చేస్తున్న పనులపై విజిలెన్స్‌కు కంప్లైంట్ చేసిన విషయం సదరు మంత్రికి తెలియడంతో.. ఇప్పుడు సీఎం దగ్గర పంచాయతీ పెట్టారు.
చూసుకుందామా..?
ఇటీవల కొన్ని కీలకమైన పనులు ఓ మంత్రికి చెందిన నిర్మాణ సంస్థకు టెండర్లు దక్కాయి. సీఎం సొంత సెగ్మెంట్‌లోని నీటిపారుదల రంగానికి చెందిన పనులు, అదే జిల్లాలో మరికొన్ని పనులు కూడా సదరు మంత్రి సంస్థకు అప్పగించారు. ఇందులో కొన్ని నామినేషన్లపై ఇచ్చిన పనులు కూడా ఉన్నాయి. అయితే, మరో మంత్రికి కూడా కాంట్రాక్ట్ కంపెనీ ఉంది. కానీ, ఇటీవల ఆ మంత్రి సంస్థకు పనులు దక్కడం లేదు. అంతేకాదు.. ఆయన తమ్ముడు కూడా ఎమ్మెల్యే. ఆయనకు కూడా ఓ కాంట్రాక్ట్ సంస్థ ఉంది. కానీ, ఇప్పటిదాకా లాభం వచ్చే పని ఒక్కటీ దక్కలేదని ఆవేదన చెందుతున్నారు. దీంతో సదరు మంత్రి సీరియస్ గా ఉన్నాడు. తాను డైరెక్ట్‌గా రంగంలోకి దిగకుండా.. తన వర్గీయులతో ఇంకో మంత్రిపై గురి పెట్టించాడు. దీనిలో భాగంగానే కాంగ్రెస్ ఎమ్మెల్యేల రహస్య భేటీ నిర్వహించినట్లు పార్టీలో టాక్. అంతేకాదు.. హైదరాబాద్‌లో ఓ హోటల్‌లో 10 మంది ఎమ్మెల్యేలు సమావేశం కావడం వెనక సదరు మంత్రి హస్తం ఉందని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ మీటింగ్‌ను ఏర్పాటు చేసింది సదరు మంత్రి అనుచరుడే.
సీఎం దగ్గర పంచాయతీ
ఇక, తనపై పదేపదే అంతర్గత యుద్దానికి దిగుతున్న ఆ మంత్రిపై.. సీఎం దగ్గరే తేల్చుకుందామంటూ పంచాయతీ పెట్టినట్లు తెలుస్తున్నది. అయితే, సీఎం కూడా దీనిపై ఎటూ ఏం చెప్పలేక సైలెంట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇద్దరు మంత్రుల మధ్య వివాదాన్ని ఆనుకూలంగా మల్చుకునే ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లు టాక్.
అయితే, తాజాగా పనులు దక్కించుకున్న మంత్రికి చెందిన నిర్మాణ సంస్థపై ఆగ్రహంతో ఉన్న మరో మంత్రి ద్వారా విజిలెన్స్‌కు ఫిర్యాదు వెళ్లినట్లు సమాచారం. కొన్ని పనులపై ఇప్పటికే విజిలెన్స్ నివేదిక కోరిందని చెబుతున్నారు. దీంతో అమాత్యుల పంచాయతీ మరింత పెరిగినట్లుగా మారింది. అయితే, ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారని, విభేదాలను సద్దుమణిగేలా చర్యలు తీసుకునే యోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఇద్దరు మంత్రుల మధ్య విభేదాలను నివారించేందుకు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పెద్దలు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నా, వర్గపోరు, ఇగోలు అదుపులోకి రావడం లేదు.