ఒక్కోసారి కొంతమందికి లక్ అలా కలిసివస్తది. నక్కని తొక్కి వచ్చారు అన్న సామెత కూడా దీనికి సరిపోతుంది. ఇంతకీ ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా… అదేనండీ సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయిన మోనాలిసా గురించి. కుంభమేళాలో పూసలు అమ్ముకుంటూ తన జీవనం సాగిస్తుంది మోనాలిసా అనే అమ్మాయి. కొన్ని కోట్ల మంది ప్రయాగ్‌రాజ్ కుంభమేళాకు వెళ్ళిన వాళ్ళలో కొంత మంది ఆమెని చూసి తేనె కళ్లు, అందం, చిరునవ్వుతో కనిపించే మోనాలిసా నెటిజన్లను ఆకర్షించడంతో ఓవర్ నైట్ ఫేమస్ అయిపోయింది. అంటే మట్టిలో మాణిక్యంలా ఆమె ముఖవర్చస్సు కనిపించింది. దీంతో ఆ ఫొటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇంకేముంది దాంతో సడెన్‌గా ఈ అమ్మడికి ఏకంగా బాలీవుడ్‌లో హీరోయిన్‌గా అవకాశం వచ్చింది.
సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయి సినిమా ఛాన్స్ కొట్టేసింది మోనాలిసా. కుంభమేళాలో పూసలు విక్రయిస్తూ ఫేమస్ అయిన మోనాలిసా బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా సినిమాలో ఆఫర్ ఇచ్చారు. నటనపై ఆమెకు శిక్షణ ఇప్పించి మరీ ఆమెను హీరోయిన్‌గా తీసుకుంటున్నారు. మొత్తానికి మోనాలిసా రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు ఉంది ఆమె అదృష్టం. ఇక ఇదిలా ఉంటే… సినిమాలో ఆఫర్ సంగతి అటుంచి ప్రస్తుతం ఆమె పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. అసలు విషయం ఏమిటంటే… మధ్యప్రదేశ్ ఇండోర్‌లోని గ్రామీణ ప్రాంతానికి చెందిన యువతి మోనాలిసా ప్రయాగ్‌రాజ్ కుంభమేళాలో పూసలు అమ్ముకునే చిరు వ్యాపారం చేస్తుండగా, ఒక నెటిజన్ ఆమె ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. ఈ ఫోటో వైరల్ అయింది. దీంతో కుంభమేళాకు వచ్చిన జనం ఆమెతో ఫోటో దిగడానికి ఆసక్తి చూపడం, ఆ క్రమంలో ఆమెను ఇబ్బంది పెట్టడం లాంటివి కొందరు చేశారు. దీంతో ఆమె తన పూసల వ్యాపారానికి స్వస్తి పలికి స్వగ్రామానికి వెళ్లిపోయింది. మోనాలిసాకు జరిగిన అన్యాయంపై నెటిజన్లు సానుకూలంగా స్పందించారు.
బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా తన సినిమాలో హీరోయిన్ అవకాశం ఇస్తానని ప్రకటించాడు. ఆ వెంటనే మణిపూర్ నేపథ్యంలో ఆయన రూపొందించే సినిమాకి మోనాలిసా సంతకం కూడా చేసింది. ఈ సినిమా కోసం ఆమె ప్రస్తుతం యాక్టింగ్‌పై శిక్షణ పొందుతోంది. ఈ క్రమంలో దర్శకుడు సనోజ్ మిశ్రా ఆమెతో చనువుగా ఉంటూ ఆమెకు సంబంధించిన అన్ని పనులు దగ్గరుండి చూసుకుంటున్నారు. అయితే మోనాలిసాతో సనోజ్ మిశ్రా చనువుగా ఉండటంపై బాలీవుడ్ నిర్మాత జితేంద్ర నారాయణ్ సింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. మోనాలిసాను సనోజ్ మిశ్రా పబ్లిసిటీ కోసం వాడుకుంటున్నాడని, ఆమెను ట్రాప్ చేస్తున్నాడంటూ సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై మిశ్రా స్పందిస్తూ మోనాలిసా తన కూతురు లాంటిదని, ఆమెకు తన కూతురు వయసు ఉంటుందని, ఆమెను తను వేధించడం లేదని, ఇష్టపూర్వకంగానే సినిమాలో నటిస్తోందని చెప్పుకొచ్చారు. మోనాలిసా ఆర్థిక పరిస్థితి దృష్ట్యా తానే యాక్టింగ్‌లో శిక్షణ ఇప్పిస్తున్నట్లుగా పేర్కొన్నాడు. దీనిపై నిర్మాత జితేంద్ర నారాయణ్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోనాలిసా విషయంపై దర్శకుడు, నిర్మాత మధ్య మాటల యుద్ధం జరుగుతుండటంతో తన మొదటి సినీ ప్రాజెక్టుపై మోనాలిసా ఆందోళన చెందుతోంది. ఇరువురి వివాదంతో మోనాలిసా సినీ కెరీర్ ప్రశ్నార్ధకంగా మారిపోయింది.
దర్శకుడు, నిర్మాత మధ్య తలెత్తిన వివాదం కారణంగా తన మొదటి సినిమా ప్రాజెక్టుకు గ్రహణం పడుతుందేమోనని మోనాలిసా భయపడుతోంది. ఎక్కడో మారుమూల గ్రామం నుంచి వచ్చి తన పని తను చేసుకుంటుంటే ఇప్పుడు ఆ పనీ లేకుండా ఏ పనీ లేకుండా ఆమె పరిస్థితిని హీనంగా చేశారు. సినిమా ఆఫర్ అని అదని… ఇదని… ఆశ పెట్టి చివరకు లేనిపోని వివాదాల్లో దింపి అనవసర ఆరోపణలు అన్ని చేసి ఆమెను రచ్చకెక్కిస్తున్నారు ఈ సినీ దర్శక నిర్మాతలు.