Tuesday, March 11, 2025

టిఎన్జీఓ యూనియన్ చుట్టూ వివాదాలు ..?

రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల సమస్యల కోసం పోరాడే టిఎన్జీఓ సంస్థ చుట్టూ ప్రస్తుతం వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఉద్యోగుల సమస్యలను పక్కనపెట్టి వ్యక్తిగత పనుల మీద నాయకులు దృష్టి పెట్టారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ప్రభుత్వం తీసుకొచ్చిన 317 జిఓ కింద చాలామంది ఉద్యోగులు బదిలీ కాగా, ప్రస్తుతం వారిలో చాలామంది వెనక్కి తిరిగి రాలేక ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక ఉద్యోగాల పేరుతో ఈ జిఓను అప్పట్లో సిఎస్‌గా ఉన్న సోమేష్‌కుమార్ అమల్లోకి తీసుకురావడంతో చాలామంది ఉద్యోగులు బదిలీ అయిన చోటుకే పరిమితమయ్యారు. అయితే ఇందులో కొందరు ఉద్యోగులు తమకు ఉన్న పలుకుబడి, లంచాలతో తాము అనుకున్న చోటుకు మళ్లీ తిరిగి వచ్చారు. అయితే డబ్బులు పెట్టలేని కొందరు ఉద్యోగులు, రాజకీయంగా పలుకుబడి లేని ఉద్యోగులు మాత్రం ప్రభుత్వం బదిలీ చేసిన స్థానంలోనే కుటంబానికి దూరంగా ప్రస్తుతం పనిచేస్తున్నారు. అయితే పశుసంవర్ధక శాఖలోని ఆరుగురు ఉద్యోగులు మాత్రం 317 జిఓకు విరుద్ధంగా తిరిగి తాము కోరుకున్న చోటుకు బదిలీ కావడంతో ప్రస్తుతం టిఎన్జీఓ సంస్థను వివాదాలు చుట్టుముట్టేలా చేశాయి.

ఆఫీస్ బేరర్‌లని లెటర్ హెడ్

అయితే పశుసంవర్ధక శాఖలోని ఈ ఆరుగురు ఉద్యోగులు అప్పటి టిఎన్జీఓ అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్‌ను కలిసి తమ బదిలీ గురించి ఆయనకు విన్నవించారు. అయితే ఆయన ఈ విషయంలో వారు కోరిన విధంగా అప్పటి ప్రభుత్వాన్ని ఒప్పించి వారు అడిగిన స్థానాలను ఇప్పించారు. ఇక్కడే అసలు మతలబు మొదలయ్యింది. ఈ పశుసంవర్ధక శాఖలోని ఆరుగురు ఉద్యోగులు టిఎన్జీఓ ఆఫీస్ బేరర్‌లని ఆయన రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో లెటర్ ఇవ్వడంతో పాటు అప్పటి ప్రభుత్వంతో మాట్లాడి వారిని ఆయా స్థానాల నుంచి బదిలీ చేయించినట్టుగా తెలిసింది. అయితే వారు ఆఫీస్ బేరర్‌లు కాదనీ, యూనియన్‌లో వారికి ఎలాంటి హోదా లేదని మాములుగానే వారు కూడా ఉద్యోగులనీ, ఉద్యోగులపై ప్రేమ ఉంటే మిగతా వారిని కూడా వారు అడిగిన స్థానాలకు మామిళ్ల రాజేందర్ బదిలీ చేయించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.

నేను ఉద్యోగంలో, యూనియన్‌లో లేను…

ప్రస్తుతం టిఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడిగా మామిళ్ల రాజేందర్ తన ఉద్యోగానికి విఆర్‌ఎస్ తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే అప్పుడు రాజేందర్ చేసిన తప్పును ఎత్తిచూపుతూ రాజు అనే ఉద్యోగి సోషల్‌మీడియాలో పెట్టిన కాల్‌రికార్డింగ్ ప్రస్తుతం ప్రతి ఉద్యోగి ఫోన్‌లో వైరల్ అవుతోంది. ఆ ఆరుగురి మీద రాజేందర్ ఎందుకు ప్రేమ చూపారని, వారు ఆఫీస్ బేరర్‌లకు కాకున్నా వారికి టిఎన్జీఓ లెటర్ హెడ్‌పై పేర్లు ఎందుకు ఇచ్చారని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయాన్ని రాజు అనే ఉద్యోగి మామిళ్ల రాజేందర్‌కు ఫోన్ చేసి అడగ్గా తాను ఇప్పుడు ఉద్యోగంలో లేనని, ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్‌ను అడగాలని రాజుతో ఫోన్‌లో చెప్పారు. వెంటనే రాజు ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్‌కు ఫోన్ చేయగా ఆ సమయంలో తాను అధ్యక్షుడిని, ప్రధాన కార్యదర్శిని కాదనీ రాజుతో పేర్కొన్నారు. ప్రస్తుతం రాజు అనే ఉద్యోగి మామిళ్ల రాజేందర్, మారం జగదీశ్వర్‌తో మాట్లాడిన ఫోన్ సంభాషణను సోషల్‌మీడియాలో పెట్టడంతో ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. దీంతో ఉద్యోగులంతా టిఎన్జీఓ సంఘంలో ప్రస్తుతం జరుగుతున్న తంతుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అప్పుడు జరిగిన దాని గురించి ఇప్పుడు అడగడం భావ్యం కాదు మాజీ టిఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ అయితే ఈవిషయమై మామిళ్ల రాజేందర్‌ను వివరణ కోరగా అప్పట్లో జరిగిన విషయాన్ని ప్రస్తుతం రాజు అనే ఉద్యోగి ఇప్పుడు అడగడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. తాను ఉద్యోగంలో ఉన్నప్పుడు, టిఎన్జీఓ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రాజు అడిగితే సమాధానం చెప్పేవాడినని ఆయన తెలిపారు. ఆఫీస్ బేరర్‌లు అంటే రాష్ట్ర కార్యవర్గంలోనే ఉండాల్సిన అవసరం లేదని, జిల్లా కార్యవర్గంలో ఉన్నవారు సైతం ఆఫీస్ బేరర్‌లోనని ఆయన పేర్కొన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com