Sunday, December 29, 2024

Manmohan singh funeral మాజీ ప్ర‌ధాని అంత్యక్రియలపై వివాదం

  • సంప్రదాయాలు పాటించలేదని కాంగ్రెస్ విమర్శలు
  • గతంలో మీరేం చేశారో తెలుసంటూ బిజెపి ప్ర‌తివిమ‌ర్శ‌లు
  • పివికి జరిగిన అవమానంపై తాజాగా చర్చ

మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు దిల్లీలోని నిగమ్ బోధ్‌లో జరిగాయి. ఆయన స్మారక చిహ్నం కోసం ప్రత్యేకంగా స్థలం కేటాయించాలని, కాంగ్రెస్‌ పార్టీ కేంద ప్రభుత్వానికి లేఖ సైతం రాసింది. దీనిపై కాంగ్రెస్‌, బీజేపీ నేతల మధ్య రాజకీయ విమర్శలు కొనసాగుతున్నాయి. మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియల విషయంలో కేంద్రం సంప్రదాయాలను పాటించడం లేదని కాంగ్రెస్ ఆరోపించింది. ఇదే సమయంలో గతంలో కాంగ్రెస్‌ ఎలాంటి సంప్రదాయాలు పాటించిందో గుర్తుచేసుకోవాల‌ని బీజేపీ నేతలు కౌంటర్‌ ఇచ్చారు. ఈ క్రమంలో దిల్లీలోని రాజ్‌ఘాట్‌లో అంత్యక్రియలు జరగని మాజీ ప్రధానుల అంశం తాజాగా తెరపైకి వొచ్చింది. దేశ రాజకీయాల్లో ఓ ప్రధాని అంత్యక్రియల అంశం వార్తల్లో నిలవడం ఇదే తొలిసారి కాదు. గతంలో ముగ్గురు ప్రధానుల అంత్యక్రియలు దిల్లీ బయటే జరిగాయి. దిల్లీలో అంత్యక్రియలు జరగని ముగ్గురు ప్రధానుల్లో పివి నరసింహారావు కూడా ఉన్నారు. ఆయన పట్ల అప్పట్లో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నా దారుణంగా వ్యవహరించింది. భారతదేశానికి 1991 నుంచి 1996 వరకు భారత ప్రధానిగా పనిచేసిన పీవీ నరసింహారావు 2004 డిసెంబర్‌ 23న తుదిశ్వాస విడిచారు. ఆ సమయంలో దిల్లీలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉండగా ప్రధానమంత్రిగా మన్మోహన్‌ సింగ్‌ ఉన్నారు.

పీవీ నరసింహారావు అంత్యక్రియలు దిల్లీలోనే నిర్వహించాలని ఆయన కుటుంబ సభ్యులు తొలుత భావించారు. కానీ కాంగ్రెస్‌లోని కొందరు సీనియర్‌ నేతలు పీవీ అంతిమ సంస్కారాలు హస్తినలో కాకుండా హైదరాబాద్‌లో నిర్వహించేలా అధిష్ఠానంపై ఒత్తిడి తీసుకువొచ్చారు. ఈ అంశంపై దిల్లీలో ఎన్నో చర్చలు జరిగాయి. అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ సైతం పీవీ అంత్యక్రియలు దిల్లీలో నిర్వహించేందుకు సానుకూలంగా ఉన్నప్పటికీ పార్టీలో సీనియర్ల నుంచి వొచ్చిన ఒత్తిడితో ఏమి చేయలేకపోయారని అప్పట్లో మన్మోహన్‌ సింగ్ మీడియా సలహాదారుగా ఉన్న సంజయ్‌ బారు గతంలో చెప్పారు. చివరకు పీవీ అంత్యక్రియలు హైదరాబాద్‌లో నిర్వహించారు. కాంగ్రెస్‌ హయాంలో దిల్లీలో పీవీ నరసింహరావు స్మారకం నిర్మించాలనే చర్చ జరిగినప్పటికీ నిర్మాణం కాలేదు. తెలంగాణకు చెందిన పీవీ నరసింహారావు దేశ ప్రధానిగా సేవలు అందించినప్పటికీ ఆయన అంత్యక్రియలు దిల్లీలో జరగలేదు. 1989 నుంచి 1990 వరకు భారత ప్రధానిగా పనిచేసిన వీపీ సింగ్‌ 2008లో దిల్లీలో మరణించారు.

దిల్లీలో ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తారనే చర్చ జరిగింది. చివరికి ఆయనను అలహాబాద్‌కు తీసుకెళ్లారు. ఆ సమయంలో కుటుంబ సభ్యుల కోరిక మేరకు అంత్యక్రియలు ప్రయాగ్‌రాజ్‌లోని సంగం ఒడ్డున నిర్వహించారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించగా.. ప్రభుత్వ ప్రతినిధిగా అప్పటి కేంద్రమంత్రి సుభోద్కాంత్‌ సహాయ్‌ సింగ్‌.. వీపీ సింగ్‌ అంత్యక్రియలు హాజరయ్యారు. ఆ తర్వాత స్మారక చిహ్నం దిల్లీలో నిర్మించాలనే ప్రయత్నం చేసినా నిర్మాణం జరగలేదు. 1977 నుంచి 1979 వరకు ప్రధానమంత్రిగా పనిచేసిన మొరార్జీ దేశాయ్‌ 1995లో ముంబైలోని జస్లోక్‌ హాస్పిటల్‌లో కన్నుమూశారు. మొరార్జీ కుటుంబ సభ్యుల కోరిక మేరకు సబర్మతి ఒడ్డున ఆయన అంత్యక్రియలు జరిగాయి. మొరార్జీ అంత్యక్రియలకు అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు హాజరయ్యారు. అంత్యక్రియల అనంతరం మొరార్జీ చితాభస్మాన్ని దిల్లీకి తరలించారు. మాజీ ప్రధానులు జవహర్‌లాల్‌ నెహ్రూ, లాల్‌బహదూర్‌ శాస్త్రి, ఇందిరాగాంధీ, చంద్రశేఖర్‌, చౌదరి చరణ్‌ సింగ్‌, రాజీవ్‌ గాంధీ, ఐకే గుజ్రాల్‌, అటల్‌ బిహారీ వాజ్‌పేయి అంత్యక్రియలు దిల్లీలోనే జరిగాయి. వీరిలో నెహ్రూ, శాస్త్రి, ఇందిరాగాంధీ, చౌదరి చరణ్‌, చంద్రశేఖర్‌, రాజీవ్‌ గాంధీ, అటల్‌ బిహారీ వాజ్‌పేయి స్మారకాలకు ప్రత్యేక స్థలాన్ని కేటాయించారు. ఈ ప్రధానులతో పాటు సంజయ్‌ గాంధీ అంత్యక్రియలు రాజ్‌ఘాట్‌లో నిర్వహించారు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com